భౌతికంగా ఎన్టీఆర్ ఎప్పుడో దూరమయ్యారు. ఇప్పుడాయన స్మృతి ‘చిహ్నాలూ’ లేకుండా పోతున్నాయి.
అవసరమైనప్పుడు కేవలం ఆయన బొమ్మతోనో, విగ్రహంతోనో లబ్ధి పొందాలనే తాపత్రయమే
తప్ప.. ఆయనకు గుర్తుగా మిగిలిన వాటినైనా కాపాడుకోవాలనే తపన లేకుండా
పోయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి
ఎన్.టి.రామారావు స్మారకాలు ఒక్కొక్కటిగా చెరిగిపోతున్నాయి.
పార్లమెంట్ ఆవరణలో ఎన్‌టి రామారావు విగ్రహం ఏర్పాటు నిర్ణయం వె నుక కృషి
తమదంటే కాదు తమదంటూ ఇటీవల పోటీలు పడి అభిమానం చాటుకుంటున్న ఆయన కుటుంబ,
రాజకీయ వారసులే ఆయన స్మృతులను చెరిపేస్తున్నారు. ఒక ఇంటి ని కూల్చేశారు. ఒక
ఇంటిని అమ్ముకున్నారు. ఇక ఆయన పేరిట ఉన్న మ్యూజియం మూతపడి ఉన్నా
పట్టించుకునే దిక్కులేదు. చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసుకుని, ఆ తర్వాత
రాజకీయ రంగ ప్రవేశం చేసి సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ హైదరాబాద్‌లో రెండు
ఇళ్లలో నివాసం ఉన్నారు. సినీ రంగాన్ని ఏలుతున్న సమయంలో (1971లో) హైదరాబాద్
నగర ప్రధాన కూడలి అబిడ్స్‌లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ వెనుక వైపున ఓ ఇంటిని
నిర్మించారు. మద్రాసు (చెన్నై) నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా
రాష్ర్టం నలుమూలల నుంచి వచ్చే అభిమానులను అబిడ్స్ ఇంట్లోనే ఎన్టీఆర్
కలుసుకునేవారు. 1982లో ఆయన తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన తరువాత ఆ
ఇంటికి మరింత కళ వచ్చింది.

అభ్యర్థుల ఎంపిక, మంత్రివర్గ కూర్పు వంటి కీలకమైన నిర్ణయాలన్నీ ఈ ఇంటి
నుంచే జరిగాయి. 1989 వరకూ ఇక్కడే రాజకీయ కార్యకలాపాలు కొనసాగాయి. 1990లో
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 13లోని గృహానికి
మారారు. అప్పటికే నిర్మించి ఉన్న ఆ భవనాన్ని రూ.15 లక్షలకు అమెరికాలో
ఉంటున్న తన చిన్న కుమార్తె ఉమామహేశ్వరి పేరిట కొనుగోలు చేశారు. 1994
ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి కావడం, సొంత అల్లుడు చంద్రబాబు
వెన్నుపోటు కారణంగా పదవి కోల్పోవడం, ఆ తరువాత కొద్ది కాలానికే మరణించటం ఈ
నివాసంలోనే జరిగాయి. కాగా ఎన్‌టీఆర్ ఎంతో ఇష్టంగా అబిడ్స్‌లో
నిర్మించుకున్న నివాసాన్ని ఆస్తుల పంపకంలో భాగంగా చిట్టచివరి కుమారుడు
నందమూరి రామకృష్ణకు కేటాయించారు. రామకృష్ణ కొద్దికాలం అందులోనే నివసించారు.
తర్వాత గతంలో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున
పోటీచేసిన దాసరి జై రమేష్‌కు అమ్మేశారు. ఇక బంజారాహిల్స్ నివాసంలో నిన్న,
మొన్నటివరకూ ఆయన సతీమణి లక్ష్మీపార్వతి ఉన్నారు. అయితే ఉమామహేశ్వరి
కోర్టును ఆశ్రయించటం, ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో లక్ష్మీపార్వతిని
బలవంతంగా ఖాళీ చేయించారు. లక్ష్మీపార్వతి ఆ ఇంటిలో ఉన్నప్పుడు ముందు గదిలో
ఎన్టీఆర్ నిలువె త్తు ఫొటో ఉండేది. మొదటి అంతస్తులో ఎన్టీఆర్ ఉపయోగించిన
గదిని ఆయన స్మారకార్థం యథాతథంగా ఉంచారు. అయితే కొద్దిరోజుల క్రితం ఆ ఇంటి
కూల్చివేతకు కుటుంబసభ్యులు పూనుకున్నారు. కూల్చివేత దాదాపు
పూర్తికావచ్చింది. ఎన్‌టీఆర్ నివసించిన రెండు ఇళ్లూ అలా కావడం ఆయన
అభిమానులను, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ
ఆయన్నెంతగానో అభిమానించే నాయకులు, కార్యకర్తలను తీవ్ర అసంతృప్తికి,
ఆవేదనకు గురిచేసింది.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశ, దిశలా వ్యాపింప చేసింది ఎన్‌టీఆరేనని
చెప్పుకునే ఆయన కుటుంబసభ్యులు.. ఆయన పట్ల అనుసరిస్తున్న వైఖరిపై తమలో తామే
మథనపడుతున్నారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన విగ్ర హం ఏర్పాటు క్రెడిట్‌ను
కొట్టేయాలని చూస్తున్న కుటుంబసభ్యులు ఇక్కడున్న ఎన్టీఆర్ స్మృతులను
చెరిపివేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్‌టీఆర్ కు 11 మంది సంతానం. ఇందులో
ఇద్దరు కుమారులు మరణించారు. కుమార్తె పురందేశ్వరి కేంద్ర మంత్రి కాగా,
కుమారుడు నందమూరి హరికృష్ణ ఎంపీగా ఉన్నారు. ఒక అల్లుడు చంద్రబాబు నాయుడు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు తొమ్మిదేళ్లు పనిచేశారు. ఇక మరో అల్లుడు
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. మిగిలిన కుమారులు,
కుమార్తెలు, అల్లుళ్లు, కోడళ్లు, వారి పిల్లలు.. వ్యాపారాలు, సినీ రంగాల్లో
కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరందరికీ ఎన్‌టీఆర్ తాను సినీరంగంలో
మకుటాయమానంగా వెలిగే రోజుల్లోనే ఇళ్లు, కాంప్లెక్స్‌లు నిర్మించి, కొనుగోలు
చేసి ఇచ్చారు. ఇంత సమకూర్చి పెట్టినా సంతృప్తి చెందకుండా.. ఆయన నివాసాలను
విక్రయించటం, కూల్చివేయటాన్ని అభిమానులు, తె లుగుదే శం కార్యకర్తలు
జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నివిధాలుగా లబ్ధి పొందినవారేం చే స్తున్నట్లు?
ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని సొంతం చేసుకున్నా... రాజకీయ
అవసరాల కోసం ఆయన్ను స్మరించే అల్లుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరి ఈ
వ్యవహారంలో పలు విమర్శలకు దారితీస్తోంది. ఎన్‌టీఆర్ స్థాపించిన పార్టీతో
ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అనుభవించిన చంద్రబాబు ఆయన
నివసించిన గృహాలను కాపాడేందుకు ఎందుకు చొరవ చూపలేదన్న ప్రశ్న ఎన్టీఆర్
అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. పార్లమెంటులో ఎన్‌టీఆర్ విగ్రహాన్ని పెట్టి
ఆయన స్మృతులు చెరిగిపోకుండా కాపాడుతున్నామని చెప్పుకునేందుకు పోటీ
పడుతున్న టీడీపీ అధ్యక్షుడు... అదే ఎన్‌టీఆర్ నివాసాలను ఎందుకు
కాపాడలేకపోయారని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఎన్‌టీఆర్‌ను
దేవుడిగా పూజించే అభిమానులకు ఒక పిలుపు ఇస్తే.. వాటిని
విక్రయించాలనుకున్నా, కూల్చాలనుకున్నా కుటుంబసభ్యులకు ఎంత అవసరమైతే అంత
ఇచ్చి వాటిని కాపాడుకునేవారని, 1977 నుంచి ఎన్టీఆర్ మర ణించే వరకూ వెన్నంటి
ఉన్న ఒక అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు. మ్యూజియం మూసే ఉంది
తాను సినిమాల్లో రారాజుగా వెలుగొందిన సమయంలో వాడిన వస్తువులు, వచ్చిన
బహుమతులను భావితరాలకు చూపించాలనే తపనతో మ్యూజియం ఏర్పాటు చేయాలని ఎన్‌టీఆర్
నిర్ణయించారు. ఇందుకోసం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 13లో ఒక గృహాన్ని
కొనుగోలు చేశారు. అందులో ఆయన వాడిన వస్తువులు, దుస్తులు, గెలుచుకున్న
బహుమతులను ఉంచారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో ఆయన ఉపయోగించిన వస్తువులన్నీ
అందులో ఉన్నాయి. ఆయన మరణానంతరం ఆ ఇల్లు తమదంటే తమదంటూ కుటుంబసభ్యులు
గొడవకు దిగారు. కోర్టును ఆశ్రయించారు. కోర్టు యథాతథస్థితిని
కొనసాగించాల్సిందిగా ఆదేశించింది. దీంతో గత పదిహేనేళ్లుగా ఆ మ్యూజియం
మూతపడి ఉంది. అయితే తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అల్లుడు
చంద్రబాబునాయుడు కానీ, ఇతర కుటుంబసభ్యులు కానీ వివాదాన్ని పరిష్కరించి
నటసార్వభౌముడి కళాభిరుచులను ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు పరిచయం
చేసేందుకు వీలుగా మ్యూజియంను తెరిపించే ప్రయత్నం ఏమాత్రం చేయకపోవడం
శోచనీయం.
|
|
No comments:
Post a Comment