Sunday 26 May 2013

మంత్రులు...మాయలు

రాజీనామాల డ్రామాలకు తెర
 
 
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిల రాజీనామాలను గవర్నర్ నరసింహన్ ఆదివారం ఆమోదించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం వారి రాజీనామా పత్రాలను గవర్నర్‌కు పంపించారు. వాటిని గవర్నర్ వెంటనే ఆమోదించారు. జగన్ కేసులో ధర్మాన, సబితలు క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని సిబిఐ వాదన. జగన్ కేసుకు సంబంధించి వాన్‌పిక్ అంశంలో ధర్మాన ప్రసాద రావు, దాల్మియా అంశానికి సంబంధించి సబితా ఇంద్రా రెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. సిబిఐ ఛార్జీషీటులో అభియోగాలు నమోదు కావడంతో వారిద్దరిచే రాజీనామా చేయించాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రికి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలకు సూచించింది. సబిత, ధర్మానలు గతంలోనే రాజీనామా చేశారు. అయితే, వారు ఏ తప్పు చేయాలేదని చెబుతూ ముఖ్యమంత్రి వాటిని పక్కన పెట్టారు. కేంద్రంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులచే అధిష్టానం రాజీనామా చేయిస్తుండగా ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటంపై సొంత పార్టీ నేతల నుండి విమర్శలు వచ్చాయి. మరోవైపు అధిష్టానం కూడా కిరణ్, బొత్సలను పిలిచి రాజీనామా చేయించాలని, వాటిని ఆమోదించేలా చూడాలని ఆదేశించింది. దీంతో అధిష్టానం ఆదేశాల మేరకే సబిత, ధర్మాన రాజీనామాలను ఇప్పటికిప్పుడు గవర్నర్ వద్దకు పంపడం, వాటిని నరసింహన్ వెంటనే ఆమోదించడం జరిగిందని అంటున్నారు. కొన్నాళ్లుగా సస్పెన్స్‌కు దారి తీసిన రాజీనామాల వ్యవహారం ఈ రోజుతో ఓ కొలిక్కి వచ్చింది.

No comments:

Post a Comment