Sunday 7 July 2013

ఉద్యమాల సెగ

సిక్కోలు సిగలో ఉద్యమాల సెగ
 

(శ్రీకాకుళం- మేజర్‌ న్యూస్‌ ప్రతినిధి):

ప్రజల ప్రగతి కోసమే శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తున్నా మని ప్రభుత్వం చాలా ఏళ్ల నుంచీ చెప్పుకొస్తోంది. అభివృద్ధి ముసుగులో పర్యావరణ విధ్వంసం పొంచి ఉందని, స్వచ్ఛమైన గాలికి, మంచినీటికి, వ్యవసాయానికి, మత్యసంపదకు దూరమైపోతామని ప్రజలు ఉద్యమాల బాటపట్టారు. పరిశ్రమలు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని చెబుతున్న మంత్రులు, అధికారులు, ఆయా పరిశ్రమల ప్రతినిధులు ప్రజలు లేవ నెత్తు తున్న ఎన్నో ప్రశ్నలకు కచ్చితమైన సమాధానమివ్వలేకపోతున్నారు. పరిశ్ర మలు వద్దని ఉద్యమిస్తున్న ప్రజల సందేహాలకు ప్రభుత్వం, పరిశ్రమల యజ మానుల పైపై మాటలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తమ పరిశ్రమల వల్ల అంతా మంచేజరుగుతుందని చెబుతున్న వారంతా ప్రజల్లో అనుమా నాలను నివృత్తి చేసే విషయంలో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పోలీ సుల సాయంతో పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటామనే భ్రమలు విచ్ఛిన్నమైనా ఇంకా ఆయా పరిశ్రమల ప్రతినిధులకు అధికారులు, ప్రజాప్రతినిధులు అదే నమ్మకంలోముంచేస్తున్నారు.
ట్రైమాక్స్‌పై
రగులుతున్న మత్స్యకారులు

జిల్లాలో వజ్రపు కొత్తూరు, సంతబొ మ్మాళి మండలాల పరిధిలో ట్రైమాక్స్‌ సంస్థ చేపట్టబోయే బీచ్‌శాండ్‌ మినరల్స్‌ పరిశ్రమ ఏర్పాటుపై మత్యస్యకారులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వజ్రపు కొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామంలో రెండేళ్ల కిందట ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. తీరంలో ఇసుక తవ్వకాలు, ఖనిజాల శుద్ధి పరిశ్రమ వల్ల తీరంలోని ఇసుకతిన్నెల్లో గల జీడితోటలు, సామాజిక అటవీ ప్రాంతం, జిరాయితీ భూముల్లో ఉండే పంటలు, వక్షాలు కనుమరుగవుతాయని మత్స్యకారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని సంచరించే అరుదైన పక్షుల ఉనికి లేకుండా పోతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీరానికి సహజరక్షణ కవచంలా వున్న ఇసుక తిన్నెలను తవ్వేస్తే మత్స్యకార గ్రామాలు సునామీలు, ఉప్పెనలు వంటి ప్రకతి వైపరీత్యాలకు గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆలివ్‌రిడ్లే తాబేళ్లు, మత్స్యసంపదా అంతరిస్తాయని చెబుతు న్నారు. భూగర్భ జలాలు కూడా కలుషితమై తాగునీరు, సాగునీరు కరువౌ తుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నివురుగప్పిన నిప్పులా సోంపేట థర్మల్‌
సోంపేట మండలం బీలలో ఎన్‌సీసీ నిర్మించబోయిన థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ అనుకూలంగానే ఉంది. అందువల్లే ప్రాజెక్టు మంజూరుకు ఉద్దేశించిన జీవోను ఇంతవరకూ రద్దు చేయలేదు. 2010 జూలై 14న ఈప్రాజెక్టు పనులను అడ్డుకునే విషయంలో జరిగిన థర్మల్‌ వ్యతిరేక పోరాటంలో ముగ్గురు రైతు కూలీలు పోలీసుల తూటాలకు బలయ్యారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇంతవరకు ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో 400 మంది వరకు పోలీసుల లాఠీలకు గాయపడ్డారు. మృతిచెందిన కుటుంబాలకు అరకొరగా పరి హారం ఇచ్చిన ప్రభుత్వం క్షతగాత్రులను పట్టించుకోకుండానే గాలికొదిలేసింది. థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరు తూ ప్రజల రిలే నిరాహారదీక్షలు ఇప్పటికీ సోంపేటలో కొనసాగుతు న్నాయి.
చల్లారని కాకరాపల్లి థర్మల్‌ సెగలు
సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో ఈస్ట్‌కోస్టు ప్రైవేటు లిమి టెడ్‌ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగు తున్న పవర్‌ ప్రాజెక్టుపై కూడా వివాదం చెలరేగింది. మత్స్యకారులు, అఖిలపక్ష నేతలు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకి స్తున్నారు. 2011 ఫిబ్రవరి నెలాఖరులో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చెలరేగింది. దీనిని ఎలాగైనా అణచివేయడానికి పోలీసులు ప్రయత్నించి ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్నారు. పొగబాంబులతో వడ్డితాండ్ర గ్రామాన్ని తగులబెట్టారు. అయినా సరే ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం పవర్‌ ప్రాజెక్టు పనులు బయటకు తాత్కాలికంగా నిలిపివేసి, లోపల యథావిధిగా పనులు చేసుకుంటున్నారు. ఇటీవల ఈ పవర్‌ ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ వచ్చేశా యంటూ పరిశ్రమ ప్రతినిధులు ప్రకటించడంపై అఖిల పక్షనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండానే అడ్డగోలుగా ఈ పవర్‌ప్రాజెక్టు నిర్మాణం జరుగు తోందని పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తు న్నారు. అధికారులు మాత్రం తమకు అందిన తాయి లాలతో నోర్లు మెదపడం లేదు.
అణువిద్యుత్‌పై ప్రజాభిప్రాయ సేకరణ లేనట్టేనా?
భారత్‌ అమెరికాతో చేసుకున్న అణుఒప్పందంలో భాగంగా రణస్థలం మండలం కొవ్వాడ మత్స్యలేశంలో నిర్మాణం కానున్న అణువిద్యుత్‌ కేంద్రం వివాదానికి కారణమవుతోంది. అణుధార్మిక ప్రమాదాలపై సరైన వివరణలు ఇచ్చి ప్రజల్లో అవగాహన కల్పించకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుం డానే అధికార యంత్రాంగం సర్వేలు పూర్తిచేయడం, భూసేకరణకు సిద్ధమై పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభు త్వ జోక్యంతోనే జిల్లా అధికార యంత్రాంగం అత్యుత్సాహం చూపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ప్రజాభిప్రాయ సేకరణ జరిపాకే అణువిద్యుత్‌ కేంద్రంపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి రెండేళ్ల కిందటే ప్రకటించారు.
ఇది జరిగి ఏళ్లు గడిచినా చట్టబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం ఇంతవరకూ జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా సర్వేలు నిర్వహించి, భూసేకరణకు సిద్ధమైపోయిన అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
అసలు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతారా? లేదో?ననే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. తాజాగా మీడియాను అనుకూలంగా మార్చుకోవడానికి అణువిద్యుత్‌ ప్రాజెక్టులపై అవగాహన నిమిత్తం తమిళనాడులోని కల్పకం అణువిద్యుత్‌ కేంద్రానికి వారిని విహార యాత్రకు కూడా తీసుకువెళ్లొచ్చారు.
పవర్‌గ్రిడ్‌పై భగ్గుమంటున్న జనం
పలాస మండలం రామకృష్ణాపురంలో ఏర్పాటు చేయబోయే పవర్‌గ్రిడ్‌పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో నిర్మించనున్న పవర్‌ ప్రాజెక్టులకు అనుసంధానించడానికే ఈ పవర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేస్తున్నారని ప్రజలు చేస్తున్న ఆరోపణలకు అధికారులు సమాధానమివ్వలేకపోతున్నారు. అంతేకాకుండా పవర్‌గ్రిడ్‌ దిగువ, పరిసరాల్లోనూ అధిక విద్యుత్‌ రేడియేషన్‌తో క్యాన్సర్లు, వంధత్వం, మతిమరుపు, మానసిక సమస్యలు, లుకేమియా తదితర ప్రాణాంతక వ్యాధులు తప్పవని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ విషయంలో కూడా ప్రజల అనుమానాలను అధికారులు సక్రమంగా నివృత్తి చేయలేకపోతున్నారు. మొత్తమ్మీద శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి మాటున జరగనున్న విధ్వంసంపై ప్రజల ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి.
| |

1 comment:

  1. పర్యావరణాన్ని కలుషితం చేసే పరిశ్రమలను జనావాసాల మధ్య ఏర్పాటుచేయకూడదు!అయినా ముడుపులు దండుకున్న నాయకులు వాళ్ళు అనుకున్నది చేసి కాని నిద్రపోరు!వీళ్ళంతా రాజకీయనాయకులే కాని రాజనీతిజ్ఞులు కారు!వచ్చే ఎన్నికలగూర్చి ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు (politician )వచ్చే తరం(generation )గూర్చి ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు (statesman )

    ReplyDelete