Sunday 3 February 2013

(తోట భావన్నారాయణ గారి వ్యాసం)

విద్య, వ్యవసాయ చానెళ్ళకు ప్రభుత్వమే సైంధవుడు

- దూరదర్శన్‌కే మినహాయింపు!
- ‘ట్రాయ్‌’ది కూడా అదే సిఫారసు
- ఆలోచన విరమించిన మంత్రిత్వశాఖలు
- ‘ప్రైవేటు’ చానళ్ళకు అభ్యంతరం లేదు!
- ప్రభుత్వ శాఖలకే ఈ నియంత్రణ!
- పార్టీల చానెళ్ళ విషయం పట్టదా?
- అడ్డదారులు సూచిస్తున్న సమాచార శాఖ 


దూరదర్శన్‌ తప్ప ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలోగాని, రాష్ట్ర ప్రభుత్వాలుగాని ఎవరూ కొత్త చానళ్ళు పెట్టటానికి అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. నిజానికి కొన్ని మంత్రిత్వ శాఖలు తమ పరిధిలో చానెళ్ళు ఏర్పాటుచేసి ప్రజలకు మెరుగైన విజ్నానం, సమాచారం అందుబాటులోకి తీసుకురావాలను కున్నాయి. అయితే, సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ మాత్రం ససేమిరా అంటోంది. పైగా ఈ విషయాన్ని పరిశీలించి సలహా ఇమ్మని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌)ని అడిగితే అక్కడినుంచి కూడా అదే సిఫార్సు వచ్చింది. దీంతో మానవ వనరుల శాఖ, వ్యవసాయ శాఖ సొంతగా అన్ని భాషల్లో విద్యార్థులకు, రైతులకు టీవీ ద్వారా విజ్ఞానం అందించాలనుకున్న ఆలోచన విరమించుకోవాల్సి వచ్చింది.

ప్రైవేటు శాటిలైట్‌ చానళ్ళ విషయంలో లేని అభ్యంతరాలు ప్రభుత్వ శాఖల విషయంలో ఎందుకొచ్చిందనే ప్రశ్నకు విచిత్రమైన సమాధానం అందింది. ఆ చానెళ్ళు ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఉపయోగపడతాయని, తద్వారా అధికార పార్టీకి లబ్ధి చేకూరుస్తాయని ట్రాయ్‌ చెబుతోంది. ఒక వైపు రాజకీయ పార్టీల చానెళ్ళు కు అనుమతి ఇస్తూనే మరోవైపు ప్రభుత్వశాఖలను మాత్రమే అడ్డుకోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అంతుచిక్కదు. రాజకీయ పార్టీలు నేరుగా పార్టీ పేరుతో దరఖాస్తు చేయటం లేదని, కంపెనీల చట్టం కింద నమోదు చేసుకున్న ఏ సంస్థ అయినా శాటిలైట్‌ చానల్‌ పెట్టేందుకు అర్హమేగనుక అనుమతి ఇస్తున్నామని చెబుతోంది.

ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు చానెళ్ళు పెట్టదలచు కున్న ప్రభుత్వశాఖలకు అనుమతి నిరాకరిస్తూ, రాజకీయ పార్టీల విషయంలో తెలిసినా తెలియనట్టు నటించడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కాదు. చానెళ్ళకు అనుమతి ఇవ్వటానికి వాటిని న్యూస్‌ చానెళ్ళు, నాన్‌-న్యూస్‌ చానెళ్ళు పేరిట రెండు రకాలుగా వర్గీకరించారు.

న్యూస్‌ చానెల్‌ విభాగంలో లైసెన్స్‌ తీసుకున్నవాళ్ళు నూటికి నూరు శాతం వినోద కార్యక్రమాలు ప్రసారం చేసినా పట్టించుకోరు. కానీ వార్తేతర విభాగంలో లైసెన్స్‌ పొందిన చానెళ్ళు మాత్రం ఒక నిమిషం కూడా వార్తలు ప్రసారం చేయటానికి వీల్లేదు. ఈ వెసులుబాటు కారణంగా- ముందు జాగ్రత్తగా న్యూస్‌ లైసెన్స్‌ తీసుకొని, మ్యూజిక్‌ చానెళ్ళు నడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ఈ రోజు దేశంలో ఎన్ని 24 గంటల న్యూస్‌ చానెళ్ళు ఉన్నాయో లైసెన్స్‌ ఇచ్చిన సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖకే తెలియదు. ఎందుకంటే, న్యూస్‌ లైసెన్స్‌ తీసుకున్న చానెళ్ళలో దాదాపు సగం చానెళ్ళు వార్తలు ప్రసారం చెయ్యవు.

ఈ సమస్య నిజానికి పదేళ్ళ కిందట చంద్రబాబు హయాంలో ప్రభుత్వం ఒక చానల్‌ పెట్టాలని అనుకున్నప్పుడు కూడా చర్చకు వచ్చింది. అప్పుడు కూడా ఇదే కారణంతో అనుమతి నిరాకరించింది. అందుకు ప్రత్యామ్నాయంగా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా ఒక సొసైటీ ఏర్పాటుచేసి కెయు బాండ్‌లో ప్రసారాలు చేసుకోవటానికి ‘మన టీవీ’ ప్రారంభించింది. వాటి కోసం ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేకంగా డిష్‌లు ఇవ్వాల్సి రావడం, తదితర కారణాలవలన పాఠశాలలకూ ఆసక్తి తగ్గిపోయింది. మరో నెలరోజుల్లో నాలుగింటిలో ఒక చానల్‌ను అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి ఇవ్వాలని నిర్ణయించడం వెనుక కూడా కేంద్ర ప్రభుత్వం శాటిలైట్‌ ప్రసారాలకు అనుమతి ఇవ్వకపోవటమే కారణమని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది.

రాష్ట్ర ప్రభుత్వాల మీద ఇలాంటి అనుమానాలతో నిరాకరించారని అనుకున్నా, వివిధ మంత్రిత్వ శాఖలు నడిపే చానెళ్ళు ఆయా శాఖల ఆధ్వర్యంలోని ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తాయని చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రసారభారతి ఆధ్వర్యంలో ప్రసారమవుతున్న దూరదర్శన్‌ చానెళ్ళ వలన ప్రభుత్వ పథకాల ప్రచారం జరుగుతుందంటే మాత్రం సమాచార ప్రసారాల శాఖ నమ్మదట, వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతుల కోసం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో చానెళ్ళు నడపాలని ప్రతిపాదించినప్పుడు, మానవ వనరులశాఖ విద్యార్థుల కోసం 50 చానెళ్ళు ప్రారంభించాలని ప్రతిపాదించినప్పుడు మాత్రం అవి అధికార పార్టీకి రాజకీయ ప్రయోజనాలు తెచ్చిపెడతాయేమోనన్న వితండవాదం ముందుకు తీసుకురావడమే చిత్రంగా ఉంది.

ఆ విధంగా రైతులకు, విద్యార్థులకు చానెళ్ళు అందకుండా అడ్డుకున్నారు. పైగా ఇప్పుడు ‘మన టీవీ’ భవితవ్యం కూడా ప్రశ్నార్థకమైంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశమేంటంటే, ప్రభుత్వమే పరోక్షంగా ఒక పరిష్కారమార్గం కూడా చెబుతోంది. కార్పొరేట్‌ సంస్థలకు మాత్రమే శాటిలైట్‌ చానెళ్ళు ప్రారంభించే వీలున్నదని చెప్పటం ద్వారా ప్రభుత్వ సంస్థలను, శాఖలను కూడా ఆ దిశగా ప్రేరేపించడం. ప్రభుత్వ శాఖలు ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి, దానిచేత ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టించి, ఆ కంపెనీ ద్వారా శాటిలైట్‌ చానెల్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తారు.

ఇలా దొడ్డిదారి లైసెన్స్‌ విధానాన్ని సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ వారు ఆమోదిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆ దొడ్డి దారి విధానాన్నే ఉపయోగించుకొని చానల్‌ లైసెన్స్‌ తెచ్చుకుంది. మానవ వనరుల, వ్యవసాయ శాఖలు కూడా ఇప్పుడు ఇలాంటి దొడ్డిదారిని ఎంచుకోవటం మినహా మార్గం లేదు. రాజకీయ పార్టీలకు అలాగే ఇస్తున్నమని చెప్పటం ద్వారా కేంద్రప్రభుత్వం అందరికీ ఈ పరోక్ష సలహా ఇస్తోంది.

ఇక చానెళ్ళు పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలమీద కూడా ఆంక్షలు విధించింది. ఈ సమస్య తమిళనాడు వ్యవహారంతో చర్చకు వచ్చింది. కేబుల్‌ ఆపరేటర్ల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తనచేతుల్లోకి తీసుకోవటం మీద కేంద్రానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆపరేటర్ల ఉపాధికి ఎక్కడా సమస్య రాలేదు. కేవలం కార్పొరేట్‌ ఎమ్‌ఎస్‌వోల దోపిడీని అడ్డు కోవటానికే ప్రభుత్వం రంగ ప్రవేశం చేసింది. ఆపరేటర్లు స్థానికంగా సేవలందిస్తూ, నెలసరి చందాలు వసూలు చేస్తూ ఎప్పట్లాగే తమ ఉపాధిని కొనసాగించు కుంటారు. హోల్‌సేల్‌ వ్యవస్థను ప్రభుత్వం తీసుకోవడం వలన తక్కువ చందాతో వినియోగదారులకు సేవలందుతాయి. ప్రభుత్వమే ఒక ఎమ్‌ఎస్‌వోగా అవతరించడం వలన పే చానెళ్ళతో బేరమాడే శక్తి పెరుగుతుంది. ఫలితంగా వినియోగదారులు ప్రయోజనం పొందుతారు.

కానీ తమిళనాడు ప్రభుత్వానికిప్పుడు చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వాలు చానెళ్ళ పంపిణీ (కేబుల్‌ టీవీ) వ్యాపారంలోకి దిగకూడదని సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ చెబుతోంది. నిజానికి అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి తన మనవడు కళానిధి మారన్‌తో విభేదాల కారణంగా అతడి కేబుల్‌ నెట్‌ వర్క్‌ను దెబ్బతీసేందుకు ప్రభుత్వమే కేబుల్‌ టీవీ నడపాలని నిర్ణయించారు. అరసు కేబుల్‌ నెట్‌వర్క్‌ పేరిట ఒక కార్పొరేషన్‌ కూడా ఏర్పాటుచేశారు. కానీ అంతలోనే విభేదాలు సమసిపోయి లెక్కలు కుదరటంతో దాన్ని పక్కన బెట్టారు. జయలలిత అధికారంలోకి రాగానే అదే సంస్థను పునరుద్ధరించి కేబుల్‌ వ్యాపారాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులో రాజకీయ కారణాలున్నప్పటికీ అంతిమంగా సామాన్యప్రజలు లబ్ధిపొందుతారు.

ప్రజలకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆలోచించే విధానం వక్రంగా ఉందనటానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో కేబుల్‌ నడవడం వలన సామాన్యప్రజలకు ఎలా లబ్ధి చేకూరిందో అధ్యయనం చేయటానికి ఏనాడూ ప్రయత్నించలేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కెయు బాండ్‌లో మన టీవీ నడుపుకునేందుకు అవకాశం ఇవ్వడం ద్వారా అక్కడ ప్రభుత్వ పథకాల ప్రచారం జరిగి రాజకీయ లబ్ధిపొందుతున్నారేమోనని కూడా ఎప్పుడూ ఆరా తీయలేదు. ఊహాజనితమైన, అర్థంలేని అనుమానాలతో సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ తీసుకునే నిర్ణయాలు తిరోగామి దిశలో నడిపిస్తున్నట్టో, లేదంటే దొడ్డి దారినో, అడ్డదారినో వెళ్ళాలని సూచిస్తున్నట్టో ఉన్నది
 
(తోట భావన్నారాయణ గారి వ్యాసం)

No comments:

Post a Comment