Saturday 5 January 2013

కోట్లకు పడగలెత్తిన పత్రీజీ


 

క్యాష్ మీద ద్యాస

  • 'ధ్యానం' చుట్టూ రియల్‌ వ్యాపారం
  • అక్రమాలపై సిపిఎం ఫిర్యాదు

'శ్వాస మీద ధ్యాస' పేరుతో అమాయకులను ఉచ్చులోకి లాగి ఇంతింతై వటుడింతై అన్న చందంగా సుభాష్‌ పత్రీజీ ఎదిగిపోయారు. కోరమాండల్‌ ఫర్టిలైజర్స్‌ కంపెనీలో అసిస్టెంట్‌ సేల్స్‌ ప్రమోటర్‌గా 1975లో కర్నూలుకు వచ్చిన సుభాష్‌ పత్రీ విధులు నిర్వహిస్తూనే ధ్యానం పేరుతో నగరంలోని ప్రముఖులను తను ఉచ్చులోకి లాగారు. పారిశ్రామికవేత్త బివి రెడ్డి, ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శౌరీలు, బాల్బన్‌, ప్రేమ్‌కుమార్‌ అనే వ్యక్తులతో కలిసి పిరమిడ్‌ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. తర్వాతి కాలంలో దానికి బుద్ధ పిరమిడ్‌ ధ్యాన కేంద్రంగా పేరు మార్చారు. మొత్తం 15 మంది సభ్యులతో పిరమిడ్‌ స్పిర్చ్‌వల్‌ సొసైటీని ప్రారంభించారు. కర్నూలు నగరంలోని ఏడో జాతీయ రహదారి పక్కన ఉన్న రాఘవేంద్ర నగర్‌లో మొదట ఈ సొసైటీ కార్యకలాపాలను సాగించారు. ప్రారంభంలో పారిశ్రామికవేత్త బివి రెడ్డి స్థలంలోనే ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్వహించారు. దీనికి ఎవరూ రాకపోవడంతో పత్రీ వీధుల్లోని వారిని దుర్భాషలాడే వారని స్థానికులు చెబుతున్నారు. గంటల కొద్దీ అమ్మలక్కల మాటలు మాట్లాడుకునే బదులు ఓగంట ధ్యానం చేస్తే మీ సొమ్మేంపోతుందని తిట్టేవారని స్థానికులు అంటున్నారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన పారిశ్రామికవేత్త బివి రెడ్డి ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయంటూ సుభాష్‌ పత్రీతో ఏకమై ఈ పిరమిడ్‌ స్పిర్చ్‌వల్‌ సొసైటీ విస్తరణకు పూనుకున్నారు.

తర్వాత ఆయన శిష్యగణాన్ని ఏర్పాటు చేసుకుని తన పేరుకు 'జీ'ని తగిలించుకుని సుభాష్‌ పత్రీజీగా చలామణి అయ్యారు. 1997 నుంచి బ్రహ్మర్షి అనే పేరును తగిలించుకుని 'బ్రహ్మర్షి సుభాష్‌ పత్రీజీ'గా కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఇటీవల సంస్కరణల మూలంగా పడుతున్న భారాలు, ఉద్యోగ భద్రత లేమి వంటి సమస్యలతో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా సతమతమవుతున్నారు. ఎక్కువగా కుటుంబ సమస్యలతో, ఆందోళనతో ఉండే మహిళలను గుర్తించి, వారిని ధ్యాన కేంద్రానికి పిలిపించి, వారి ద్వారా తన ఆధ్యాత్మిక సామ్రాజ్య విస్తరణకు పూనుకున్నారు. మధ్య తరగతి మహిళలను తమ ఉచ్చులోకి లాగి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. కర్నూలు నగర శివారులోని కోట్లాది రూపాయల విలువ చేసే జగన్నాథగట్టుపై వీరి కన్ను పడింది. అక్కడ ధ్యానం పేరుతో ఓ పిరమిడ్‌ కేంద్రాన్ని నిర్మించి, దానికి అనుబంధంగా దాదాపు 50 ఎకరాల విస్తీర్ణాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. అందులో ప్రభుత్వ పోరంబోకు భూములే ఎక్కువ. 138 సర్వే నెంబరులోని 8.75 ఎకరాలు, 139 సర్వే నెంబరులోని 84 ఎకరాల్లో కొంత భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో ఆ భూమిపై ఆధారపడి జీవనం సాగించే పేదలు తిరగబడ్డారు. పత్రీజీ ఆక్రమణలోకి ప్రభుత్వ పోరంబోకు భూముల్లో దూపాడు, లకిëపురం గ్రామాలకు చెందిన పేదలు సిపిఎం చేపట్టిన భూపోరాటంలో భాగంగా వెళ్ళి జెండాలు పాతారు. పత్రీజీ ఆక్రమణలో ఉన్నన్నాళ్ళూ నోరుమెదపని అధికారులు, పేదలు జెండాలు పాతగానే హుటాహుటిన వచ్చి జెండాలను తీసేయించారు. ఇవి పట్టా భూములంటూ పత్రీజీకి వత్తాసు పలికారు.

ప్రభుత్వ భూముల్లో పత్రీజీ అక్రమాలపై విచారణ జరపాలంటూ సిపిఎం నాయకులు నాటి కలెక్టర్‌ రాంశంకర్‌నాయక్‌కు, ఆర్‌డిఓలకు పలు దఫాలుగా ఫిర్యాదు చేసినా స్పందించింది శూన్యం. ప్రస్తుతం ఆ భూములన్నీ రియలెస్టేట్‌ కింద ప్లాట్లు చేసి అమ్మేశారు. నిజామాబాద్‌ జిల్లా శక్కర్‌నగర్‌కు చెందిన సుభాష్‌ పత్రీ అగ్రికల్చర్‌ బిఎస్సీతోపాటు భూసారశాస్త్రంలో పిజి చేశారు. ఆయన మొదట తెనాలిలో 1970లో ఆదాయ పన్ను శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా కొంతకాలం పని చేశారు. తర్వాత బహుళజాతి కంపెనీ అయిన కోరమాండల్‌ ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగం రావడంతో కర్నూలుకు మకాం మార్చారు. అక్కడే తర్వాత ఆధ్యాత్మిక ధోరణీతో కొంతమందిని పోగేసుకుని సొసైటీని ఏర్పాటు చేశారు. ఆపై ఆస్తుల విస్తరణ దిశగా ఆయన దృష్టి సారించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కర్నూలులో మొదలుపెట్టిన ఈ పిరమిడ్‌ ధ్యానం తర్వాత డోన్‌, అనంతపురం జిల్లా, బెంగళూరులకు విస్తరించింది. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. అలాగే విదేశాలకూ విస్తరించారు. సింగపూర్‌, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ వీరు విస్తరించారు.
అభద్రతా భావమే మూఢ నమ్మకాలను పెంచుతోంది : జెవివి
ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా సమాజంలో రోజురోజుకూ అభద్రతాభావం పెరిగిపోతోంది. వీటికి శాశ్వత పరిష్కారం చూపకుండా యోగా, ధ్యానం చేస్తే సమస్యకు ఉపశమనం దొరుకుతుందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ప్రసాద్‌శర్మ  తెలిపారు.

No comments:

Post a Comment