Sunday 20 January 2013

అ-ధర్మాన

ఇంతకీ 

ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర మంత్రా? ఎమ్మెల్యేనా?...

 
 
ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర మంత్రా? ఎమ్మెల్యేనా?... ఇప్పుడు అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్న ఇదే. వాన్‌పిక్‌ భూముల కేటాయింపు, జగన్‌ అక్రమాస్తుల కేసులో సిబిఐ నిందితునిగా పేర్కొనడంతో నైతికత విలువలకు కట్టుబడి తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని, ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేనని ధర్మాన పలు వేదికలపై స్పష్టం చేశారు. మీడియా వద్దా ఇదే పాట పాడారు. అయితే జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో సమీక్షలు, పర్యటనలు మాత్రం చేస్తున్నారు. ఆ సమావేశాలు, పర్యటనలు మంత్రి హోదాలో చేశారా? ఎమ్మెల్యే హోదాలోనా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ధర్మాన తనకు తాను ఎమ్మెల్యేగానే భావించి సమీక్షలు చేశారనుకున్నా, హాజరైన అధికారులు మాత్రం ఆయనను మంత్రిగానే భావిస్తున్నారు. నిన్నటివరకూ ఎమ్మెల్యేనని చెప్తున్న ధర్మాన ఏ హోదాతో సమీక్షలు చేస్తున్నారని, తన నైతికత ఏమైందని విపక్ష నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
వాన్‌పిక్‌ భూముల కేటాయింపు, జగన్‌ అక్రమాస్తుల కేసులో ధర్మానను ఎ-5 నిందితునిగా పేర్కొంటూ సిబిఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. నైతిక విలువలకు కట్టుబడి మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆగస్టు 14వ తేదీన ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేశారు. వంద రోజుల తర్వాత దాన్ని ఆమోదించడం లేదంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ధర్మానను విచారణకు నిరాకరిస్తూ గవర్నర్‌ నరసింహన్‌కు రాష్ట్ర మంత్రిమండలి ఫైలు పంపింది. ఆ ఫైలును గవర్నర్‌ తిరస్కరించి, మంత్రిమండలికి తిప్పి పంపారు. దీంతో ధర్మానను రక్షించాలన్న ప్రభుత్వ ప్రయత్నం బెడిసికొట్టింది. ఆ ఫైలుపై ప్రభుత్వం పునరాలోచన చేసిన దాఖలాల్లేవు. ఇంకా అది పెండింగ్‌లోనే ఉంది. మరోవైపు ఈ వ్యవహారంలో ధర్మానను విచారణకు అనుమతించాలని సిబిఐ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. విచారణకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు గత తీర్పులను ఉటంకించింది. ఇతర హోదాల్లో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి, మరో హోదాలో కొనసాగుతున్నప్పుడు విచారణకు ఎలాంటి అనుమతి అవసరం లేదని సిబిఐ మెమోలో పేర్కొంది. వాన్‌పిక్‌ భూముల కేటాయింపు వ్యవహారం 2004-09 ప్రభుత్వ కాలంలో ధర్మాన ప్రసాదరావు రెవెన్యూమంత్రి హోదాలో ఉన్నప్పుడు జరిగిందని, ఇప్పుడు ప్రభుత్వం, ఆయన శాఖ కూడా మారిందని చెప్తోంది. అందువల్ల ప్రభుత్వ అనుమతి లేకుండా విచారణకు అనుమతించాలని కోర్టును కోరింది. ప్రభుత్వ నిర్ణయాల్లో సిబిఐ జోక్యం చేసుకునే వీల్లేదని, అలాంటి ఆధారాలూ లేవని ధర్మాన ప్రసాదరావు కూడా వాదిస్తున్నారు. ఈ కేసు సోమవారం విచారణకు రానుంది.
నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశానని పేర్కొంటున్న ధర్మాన కొన్నాళ్లు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తాను మంత్రిని కాదని, ఎమ్మెల్యేనని చెప్తూ శ్రీకాకుళం నియోజకవర్గస్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజీనామాను ఆమోదించడం లేదని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత కూడా తాను ఎమ్మెల్యేనని ధర్మాన చెప్పుకుంటూ వస్తున్నారు. మంత్రిమండలి సమావేశాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి కోరుతున్నా, గైర్హాజరవుతున్నారు. ధర్మాన ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న విశాఖపట్నం జిల్లాలో అక్టోబరులోనే ముఖ్యమంత్రి 'ఇందిరమ్మబాట' కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ఆ కార్యక్రమానికి తాను హాజరు కాలేనని ధర్మాన చెప్పడంతో ముఖ్యమంత్రి దాన్ని వాయిదా వేసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని గత నెలలో నిర్వహించారు. ఇందిరమ్మబాటకు ముందు జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. తీరా సమావేశం ముగిశాక తాను మంత్రిని కాదని, ఎమ్మెల్యేనని మీడియా వద్ద పాత పాట పాడారు. ఆ తర్వాత ఇందిరమ్మబాట కార్యక్రమంలోనూ మంత్రి హోదాలోనే హాజరయ్యారు. తాను మంత్రిగా కొనసాగుతున్నానని చెప్పకుండానే ఆ కార్యక్రమంలో పర్యటించారు. రెండు రోజుల కిందట శ్రీకాకుళంలోని జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో ఉపాధిహామీ పథకంపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధర్మాన ప్రసాదరావు మంత్రి కాకుంటే ఏ హోదాతో సమీక్షలు చేశారని, ఏ హోదాతో ఇందిరమ్మబాట కార్యక్రమంలో పాల్గొన్నారని విపక్ష నాయకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ధర్మాన పేర్కొంటున్నట్టు ఎమ్మెల్యే హోదాలోనే మన జిల్లా, విశాఖ జిల్లాలో సమీక్షలు నిర్వహించారా? ఆ హోదాలోనే ఇందిరమ్మబాట కార్యక్రమంలో పాల్గొన్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆ అధికారం ఎమ్మెల్యేకు ఎక్కడుందని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. నైతికత వంటి మాటలను వల్లె వేసిన ధర్మాన మంత్రి హోదాలో కొనసాగుతున్నారా? ఎమ్మెల్యే హోదాలో ఉన్నారా? అన్న దానిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది.

No comments:

Post a Comment