Sunday 20 January 2013

వంశీ

వంశీ పసల పూడి కథ

 'పలుకునైనా కాకపోతిని పసలపూడి కథలలో..కలమునైనా కాకపోతిని ఆ కథలు కురిసిన సుధలకు' పసలపూడి కథల పుస్తకం రెండవ పేజీలో బాపు వేసిన చిత్రానికి రమణగారు రాసిన వాక్యమిది. పసలపూడి కథల్నే కాదు ఆ ఊరికబుర్లను కూడా అంతే ఆసక్తిగా చెబుతారు దర్శకుడు వంశీ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నిట్లో పల్లెటూరి సన్నివేశాలు, సంభాషణలు చాలా సహజంగా ఉండడం వెనక తన ఊరి జ్ఞాపకాలే ఉన్నాయంటారాయన. చిన్నప్పుడు లాకుల దగ్గరాడుకున్న ఆటలు, ఎడ్లబండిపై సెకండ్‌షోలకు వెళ్లిన సంఘటనలు, ఎంతో ఇష్టంగా తాగిన శొంఠి సోడాలు...అంటూ తన సొంతూరు గురించి వంశీ చెప్పిన విశేషాలు..........
 "నేను మూడోతరగతి చదువుకుంటున్నప్పుడు నాతో చదువుకునే కొందరి అమ్మాయిల మెడల్లో మంగళసూత్రాలు కనిపించేవి. వాళ్లు కడుపులో ఉండగానే సంబంధాలు కుదుర్చుకునేవారని మా పెద్దవాళ్లు చెప్పేవారు. పుట్టిన ఏడాదికో, రెండేళ్లకో పెళ్లిళ్లు చేసేసేవారు. ఆ చిన్నవయసులో నాకే కాదు...మెడలో మంగళసూత్రం ఉన్న ఆ అమ్మాయిలకు కూడా పెళ్లంటే ఏంటో తెలిసేది కాదు. మా చుట్టుపక్కల ఊళ్లలో అయితే ఈ వివాహాలు ఇంకా ఎక్కువట. అలా పెళ్లయిన పిల్లలు... పలకా బలపం పట్టుకుని అక్షరాలు దిద్దుతూ మెడలో ఉన్న తాడుతో ఆడుకునేవారు. మా ఊరు పేరెత్తగానే వెంటనే గుర్తొచ్చేది నా బాల్యం.
 ముందుగా నేను చదువుకున్న పాఠశాల, మాస్టార్లు, తోటి విద్యార్థులు నా కళ్లముందు మెదులుతుంటారు. అందుకే ముందు వివాహితలతో కలిసి ఓనమాలు నేర్చుకున్న సంఘటనతో మొదలుపెట్టాను. ఊరంటే బోలెడు జ్ఞాపకాలు, బోలెడు అనుభవాలు....నా మనసులో మెదిలే మా ఊరి స్మృతులను కథలుగా రాశాను. అవే...'పసలపూడి కథలు'. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని పసలపూడి గ్రామం మాది. నాకు ఊహ తెలిసేటప్పటికి మా ఊళ్లో మూడువందల ఇళ్లు వరకూ ఉండేవి. పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామం. అక్కడక్కడా మామిడితోటలు కూడా ఉండేవి.
 పశువులోడి ఊరు...
పూర్వం మా ఊరున్న స్థానంలో ఒక పశువుల కాపరి చిన్న గుడిసె వేసుకున్నాడంట. కొన్నాళ్లతర్వాత ఆ గుడిసెపక్కన మరో నలుగురు గుడిసెలు వేసుకున్నారట. మా చుట్టుపక్కల గ్రామాలవారు ఆ ప్రాంతాన్ని పశువులోడి ఊరు అని పిలిచేవారట. కొన్నేళ్లు గడిచేసరికి మరికొన్ని గుడిసెలు, పెంకుటిళ్లు వచ్చి క్రమంగా పేరులో కూడా మార్పు వచ్చింది. పశువులోడి ఊరు కాస్తా పసలపూడిగా అయిపోయిందని మా ఊరి పెద్దలు చెప్పే కథ. కర్రి మందారెడ్డిగారు మా ఊరి ప్రెసిడెంట్. తరతరాలుగా వారి కుటుంబమే మా ఊరిని ఏలుతోంది. నేను సినిమా రంగంలోకి వచ్చాక ఒకరోజు మా ఊరాయన ఒకాయన ఫోన్ చేసి 'మన ఊరి ప్రెసిడెంట్ ఎవరో తెలుసా నీకు?' అన్నాడు. 'ఇంకెవరుంటారు....ఆ కుటుంబమే కదా.' అన్నాను. 'ఆ రోజులు పోయాయి...మనూరి కాఫీహోటల్ యజమానే ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు' అని చెప్పగానే నేను షాక్ అయ్యాను.

 రోజుకూలీ చందాతో...
మా ఊరి కాఫీహోటల్ యజమాని చాలా మంచివాడు. ఊళ్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే వెంటనే ఆయన మోటర్‌సైకిల్‌పై పక్కఊరికి తీసుకెళ్లి వైద్యం చేయించేవాడు. అలాగే ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా తాను ముందుండి చక్కబెట్టేవాడు. అతన్ని ప్రెసిడెంట్‌గా నిలబడమని అడిగితే తనకంత స్థోమతలేదని చెప్పాడట. అతను ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీచేయడానికి కావాల్సిన ఖర్చుకోసం మా ఊరి కూలీలంతా ఒకరోజు కూలీని పోగుచేసి అతని చేతిలో పెట్టారు. అలా పేదోళ్లంతా కలిసి అతన్ని ప్రెసిడెంట్‌గా నిలబెట్టి గెలిపించుకున్నారు. ఆ విషయం తెలిసాక నాకు చాలా సంతోషం కలిగింది. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఏళ్లతరబడి ఏకఛత్రాధిపత్యంగా వస్తున్న ప్రెసిడెంట్ పదివికి వారు పెట్టిన చెక్ ప్రశంసనీయమనిపించింది.

పేద కుటుంబం...
మా నాన్నగారు చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవారు. మా తాతగారిది మా ఊరికి కొద్దిదూరంలో ఉన్న కుతుకులూరు. మా నాన్నగారు ఉద్యోగం నిమిత్తం పసలపూడికి వచ్చి స్థిరపడ్డారు. నాకు ఒక అక్క, తమ్ముడు. అమ్మ (సూరాయమ్మ), నాయనమ్మ(ఆర్యాయమ్మ)లకు ఇంట్లో పని సరిపోయేది. నాన్నకు ఉద్యోగం తప్ప ఇల్లు, పొలాలువంటి ఆస్తులేమీ ఉండేవి కావు. మాది మూడు గదుల పెంకుటిల్లు. రెండురూపాయల అద్దె. నాన్నకు సైకిల్ ఉండేది. దానిపైనే మా పక్కూరిలో ఉన్న ఫ్యాక్టరీకి వెళ్లేవారు.




గ్రంథాలయం స్నేహం...
మా ఊరి పాఠశాలలో ఐదో తరగతి వరకే ఉండేది. ప్రభాకర్ మాస్టారు, బాబురావు మాస్టారు, శర్మమాస్టారు, జయస్తుతి మాస్టారు...మా బడిని చక్కగా నడిపించేవారు. నాకు చిన్నప్పటి నుంచి స్నేహితులు తక్కువే. స్కూలు అయిపోగానే నేరుగా గ్రంథాలయానికి వెళ్లిపోయేవాడ్ని. రోజూవెళ్లడం వల్లేమో...గ్రంథాలయం మాస్టారు నాతో బాగా క్లోజ్‌గా ఉండేవారు. ఆ చిన్న వయసులోనే నేను చలం, శరత్, లత వంటివారి సాహిత్యం చదివాను. వాటి ప్రభావం వల్లే నా పదహారవ ఏటనే 'మంచుపల్లకి', 'కర్మ సాక్షి' వంటి నవలల్ని రాశాను. గ్రంథాలయంలో పుస్తకాలు చదవడం అయిపోయాక మా ఊరి లాకులదగ్గరికి వెళ్లిపోయేవాడ్ని.

అక్కడున్న చింతచెట్ల దగ్గర కూర్చుని కాలక్షేపం చేసేవాడ్ని. ఒకసారి జోరువర్షంలో అమ్మతో 'అమరశిల్పి జక్కన' సినిమా చూడ్డానికి పక్కఊరికి నడుచుకుంటూ వెళ్లాను. అదే నా మొదటి సినిమా. పిల్లలకు ఎక్కడ జలుబు చేస్తుందోనని అమ్మ బెంగపడుతుంటే...నేనేమో వాన చినుకుల్ని ఎంజాయ్ చేస్తూ సినిమాకి వెళ్లాను. అలా అప్పుడప్పుడు అమ్మతో కాకుండా ఊళ్లో నాతోటి కుర్రాలతో ఎడ్లబండిపై సెకండ్‌షో సినిమాలకు కూడా వెళ్లేవాడ్ని. మా కిళ్లీరన్న (కిళ్లీ వీరన్న )హోటల్‌లో పలావ్ భలే రుచిగా ఉంటుంది. చేతిలో పైసలుంటే అక్కడికి వెళ్లిపోయేవాళ్లం. లేదంటే రెండేసి శొంఠిసోడాలు తాగేసి ఇంటికొచ్చేసేవాళ్లం.
 
.




డాక్టర్ సైకిళ్లు...
పొద్దున్నించి సాయంత్రంలోపు ఇద్దరో, ముగ్గురో డాక్టర్లు సైకిళ్లమీద తిరిగేవారు. అప్పట్లో అన్ని గ్రామాల్లో ఆసుపత్రులుండేవి కావు. డాక్టర్లే నాలుగైదు ఊళ్లలో సైకిళ్లమీద తిరుగుతూ వైద్యం అందించేవారు. మా ఊరికి కృష్ణారావుగారు, అప్పన్నగారు అని ఇద్దరు డాక్టర్లు రోజూ వచ్చేవారు. డాక్టర్లంటే టక్కు, టై ఊహించుకుంటారేమో...తెల్లటి గ్లాస్కో పంచెలు కట్టుకుని వచ్చేవారు. సైకిల్ వెనకసీటుపై ఒక పెట్టె ఉండేది. మరీ పెద్ద వైద్యం అవసరమైతే పలానా ఆసుపత్రికి అని రాసిచ్చేవారు. ఒకోసారి వారే దగ్గరుండి తీసుకెళ్లేవారు. ఈ వైద్యం కాకుండా నాటువైద్యం, తాయెత్తులు కట్టేవారు కూడా ఎప్పుడూ బిజీగా ఉండేవారు.

గణపతి నవరాత్రులు...
పండగలన్నిటిలోకి సంక్రాంతి హైలైట్ అయినా...గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు మా ఊళ్లో చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. వీటి స్పెషాలిటీ ఏంటంటే...పూజలు, పునస్కారాలతో పాటు నాటకాలు, రికార్డింగ్ డాన్సులు కూడా ఉంటాయి.(నవ్వుతూ...) గణపతి నవరాత్రుల్లో అయితే నాటకాలు వేయడానికి రాజమండ్రి నుంచి వచ్చేవారు. చక్రవర్తి అని ఎన్టీఆర్‌కి, విజయకుమార్ అని ఏఎన్ఆర్‌కి డూప్‌లుండేవారు. అచ్చం వారిలాగే ఉండేవారు. వాళ్లిద్దరూ మా ఊరి బస్సు దిగగానే కుర్రాళ్లమంతా వారిచుట్టూ చేరిపోయేవాళ్లం. నిజంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వచ్చినట్టు ఫీలయ్యేవాళ్లం.

వాళ్లిద్దరూ వేసే పౌరాణిక నాటకాలతో పాటు చివరిరోజు వేసే రికార్డు డాన్సు స్టెప్పులవరకూ జనం భలే ఎంజాయ్ చేసేవారు. వినాయక చవితికి మా ఊళ్లో మరో ప్రత్యేకత ఉండేది. మా ఊరిపక్కనే ఉన్న కంపెనీవాళ్లు లారీల్లో పిల్లలందరినీ ఎక్కించుకుని చుట్టుపక్కల ఊళ్లన్నీ తిప్పేవారు. సంక్రాంతి సమయంలో అయితే కోడిపందేలు చూడ్డానికి మా ఊరినుంచి పెద్దవాళ్లు చుట్టుపక్కల ఊళ్లకు వెళ్లేవారు. ఊళ్లో ఏటా జరుపుకునే చింతాలమ్మతీర్థం చాలా ఫేమస్. ఈ వేడుకను చూడ్డానికి చుట్టుపక్కల ఊళ్లనుంచి జనం బాగా వచ్చేవారు. ఆ రోజు చింతాలమ్మ దేవతకు పూజలు చేయడం, మొక్కులు తీర్చుకోవడం, గుండాలు వేయడం వంటివన్నీ భక్తిశ్రద్ధలతో జరిపేవారు. ఆ తీర్థంలో రకరకాల ఆటబొమ్మలు అమ్మేవారు.

బోగంమేళాలు...
మా ఊరి నల్లమెల్లి రాజారెడ్డిగారి దూడల చావిట్లో అప్పుడప్పుడు బోగంమేళాలు జరుగుతుండేవి. బోగంమేళం పెట్టేముందు రెడ్డిగారి దూడల చావిడిని శుభ్రం చేసి ఎల్ల(సున్నం)వేసి రంగురంగు కాగితాలతో ముస్తాబుచేసేవారు. సాయంత్రం సమయంలో కార్యక్రమాలు మొదలయ్యేవి. అలాంటివాటికి పిల్లల్ని పంపించేవారు కాదు...కుర్రాళ్లం మాత్రం ఎలాగోలా వెళ్లిపోయేవాళ్లం. మా ఊరి రాయలరెడ్డిగారి అబ్బాయి పెళ్లిలో కళావంతులతో డాన్సు కార్యక్రమం పెట్టించారు. అప్పుడు 'ఎంకొచ్చిందో...మావ ఎదురొచ్చిందో మావ' అనే పాటకు ఒకావిడ చేసిన డాన్సును మొదటిసారి చూశాను. చాలా గొప్పగా చేసిందామె.

ఊరు వదలని అమ్మ...
నేను ఊళ్లో ఐదోతరగతి పూర్తయ్యాక పక్కూరిలో ఎస్ఎస్ఎల్‌సి చదువుతున్న సమయంలో నాన్న అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత నా చదువు పూర్తయ్యాక నేను రాసిన నవలలు చూసి ఒక పెద్దాయన నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు మద్రాసులో అన్నారు. ఆయనన్నట్టుగానే కొన్నాళ్లకు మద్రాసులో స్థిరపడ్డాను. 'లేడీస్ టైలర్' సినిమా సమయంలో ఊళ్లో ఇల్లు కొన్నాను. అక్క, తమ్ముడు పెళ్లిళ్లు అయ్యాక అమ్మ ఒక్కతే ఆ ఇంట్లో ఉండేది. అమ్మ నా దగ్గరకు రాలేదు. అమ్మ తన జీవితం ఊళ్లోనే ముగియాలనుకుంది. అలాగే జరిగింది కూడా. 72 ఏళ్ల వయసులో కన్నుమూసింది.

ఊళ్లోనే ఉంటాను...
ఇప్పుడు మా ఊరు చాలా మారిపోయింది. రూపుతోపాటు మాటల్లో గోదావరి యాస కూడా పోయింది. మా చిన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లావాళ్లని మాటని బట్టి చెప్పేసేవారు. ఇప్పుడు ఆ యాస పల్లెటూళ్లలో కూడా పోయింది. మా ఊరెళ్లినపుడు నేను అన్నింటికన్నా ఎక్కువ మిస్ అయ్యేది అదే. నేను ఊళ్లో కొన్న ఇంటిని కూలగొట్టి త్వరలో పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. నా చివరిరోజులు ఊళ్లోనే గడపాలనుకుంటున్నాను. కొన్నేళ్లక్రితం ఒకసారి స్నేహితులతో కూర్చుని ఏదో కబుర్లు చెప్పుకుంటుంటే వచ్చిన ఆలోచనే పసలపూడి కథలు. ఆలోచన వచ్చిందే తడవుగా మా ఊరి కథలు రాయడం మొదలుపెట్టాను.

ఓ రచయితకు పల్లెటూరికి మించిన వస్తువు మరొకటి ఉండదనడానికి 'పసలపూడి కథలు' పెద్ద సాక్ష్యం. ఆ కథలే కాదు...నా సినిమాల్లో కూడా పల్లెటూరి వాతావరణం, సన్నివేశాలు స్వచ్ఛంగా కనిపించడానికి మా ఊరి జ్ఞాపకాలే కారణం. ఇక్కడ పట్టణంలో కూర్చుని మా ఊరిని గుర్తుచేసుకునే రోజులుపోయి ప్రతిరోజు పొద్దునే లేచి మా ఊరి వీధుల్ని, కొబ్బరి చెట్లని, లాకుల్ని నేరుగా చూసుకునే రోజులు త్వరగా రావాలని కోరుకుంటున్నాను.

1 comment:

  1. athani cinema llo nativity anuvanuvuna kanipisthundi. raka rakaala manushulu, manasththwaalanu paatrala dwaara aavishkarinche vidhaanam athani sunisithamaina pariseelanaki nidarsanam. great director.

    ReplyDelete