Thursday 17 January 2013

పల్నాటి నాగమ్మ
'పల్నాటి యుద్ధం' తెలుగునాట ఇప్పటికీ ఒక సజీవ దృశ్యం. జరిగి 900 సంవత్సరాలైనా ఆ యుద్ధంలోని ప్రధాన పాత్రధారులందరూ పల్నాడు బయట కూడా చిరపరిచితులే. వారిలో నాయకురాలు నాగమ్మ ఒకరు. బ్రహ్మనాయుడులా ఆమె కూడా స్థానికురాలే అనుకుంటారు చాలామంది; కాని కాదు. ఆమె తెలంగాణ నుంచి వలస వెళ్లిన మహిళ. భారతదేశంలోనే ప్రప్రథమ మహిళా మంత్రిణిగా పేరు గాంచిన నాగమ్మ ... పుట్టింది, మరణించింది కూడా కరీంనగర్ జిల్లా పెగడపెల్లి మండలంలోని 'ఆరవెల్లి' గ్రామంలోనే. ఆమెకు అక్కడ ఒక గుడి ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఆ ఆలయం గురించే ఈ వ్యాసం.

కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్ళే ప్రధాన రహదారిలో ఆంజనేయస్వామి 'కొండగట్టు' దాటిన తర్వాత మల్యాల క్రాస్ రోడ్ వస్తుంది. అక్కడి నుంచి దాదాపు పదిహేను కిలోమీటర్లు వెళితే ఆరవెల్లి గ్రామం వస్తుంది. ప్రస్తుతం ఈ గ్రామం పెగడపెల్లి మండలంలో ఉండగా... పల్నాటి చరిత్రకారులు తమ రచనల్లో ఈ ప్రదేశాన్ని 'సబ్బి మండలం'గా పేర్కొన్నారు. ఆరవెల్లి గ్రామ శివారులో నాయకురాలు నాగమ్మకు ఒక గుడి ఉంది. గుడిపైన గోపురం కాకుండా, మట్టిపెంకులతో పైకప్పు నిర్మాణమై ఉంది. గుడి గోడలపై నాగమ్మ చిత్రాలు ఉన్నాయి. ఆవరణలో ధ్వజస్తంభం ఉంది. గుడి ఎదురుగా ఉన్న రావిచెట్టు మొదట్లో మూడు చిన్న రాతివిగ్రహాలు ఉన్నాయి.

ఇరవై అడుగుల లోతులో నాగమ్మ గర్భగుడి
నాగమ్మ విగ్రహముండే గర్భగుడి దాదాపు నేలమాళిగలో ఉన్నట్టుగా ఉంటుంది. గర్భగుడిలోకి దిగడానికి మెట్లున్నాయి. విగ్రహం అంత లోతులో ఎందుకుంది అని గ్రామస్తుల్ని అడిగినపుడు - నాగమ్మ పుట్టలో జీవసమాధి అయిందని కొందరు చెబితే, 'కొండల్రాయుడు' అనే వ్యక్తితో నాగమ్మ తలపడిందని, అతడు తొక్కితే నాగమ్మ పాతాళలోకానికి పోయిందని మరికొందరు చెప్పారు.

చరిత్ర కథనంలో ...
కీ.శే. కలువల వెంకట సుబ్బారావు రాసిన 'భక్తి పల్నాటి వీర చరిత్ర'లోనూ, మరో పల్నాటి పరిశోధకుడు డా. తంగిరాల సుబ్బారావు రాసిన 'పల్నాటి వీర కథాచక్రం'లోనూ, గురజాలకు చెందిన గుర్రం చెన్నారెడ్డి రాసిన 'పల్నాటి చరిత్ర'లోనూ నాగమ్మ ఆరవెల్లి నుంచి వలస వచ్చిన స్త్రీ అనే రాశారు. ఈ చివరి గ్రంథంలోని వివరాల ప్రకారం -
నాగమ్మ తండ్రి పేరు చౌదరి రామిరెడ్డి. వారిది వ్యవసాయ కుటుంబం. కరువుకాటకాలు, మశూచి వంటి వ్యాధులు ఆరవెల్లి గ్రామాన్ని తరచూ ఇబ్బంది పెడుతున్న కారణంగా రామిరెడ్డి నాగమ్మను తీసుకొని పల్నాడులోని జిట్టగ్రామాలపాడులో ఉన్న తన బావమరిది మేకపోతుల జగ్గారెడ్డి వద్దకు వెళ్తాడు. అక్కడ వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి బతుకుతుంటాడు. గోపన్న మంత్రి పర్యవేక్షణలో నాగమ్మ చదువుతో పాటు సాముగరిడీలు, ధనుర్విద్య, అశ్వ శిక్షణలో ప్రావీణ్యం పొంది, సంస్కృతాంధ్ర, కన్నడ, తమిళ భాషలలో పాండిత్యం సాధిస్తుంది. రాజనీతి, తత్వశాస్త్రాలని కూడా అధ్యయనం చేస్తుంది. రామిరెడ్డి మేనల్లుడైన సింగారెడ్డితో నాగమ్మ వివాహం జరుగుతుంది. వివాహమైన మూడు రోజులకే సింగారెడ్డి మరణించడంతో నాగమ్మ వితంతువు అవుతుంది. కొంతకాలం తర్వాత రామిరెడ్డి భూమిలో చెరువు తవ్వించే ప్రయత్నం చేస్తాడు అనుగురాజు. రామిరెడ్డి ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో, బ్రహ్మనాయుడు ఆగ్రహించి ఓ రోజు నిద్రలో ఉన్న రామిరెడ్డిని తాళ్ళతో మంచానికి కట్టివేసి పొందుగుల అడవుల్లోకి తీసికెళ్ళి హత్య చేయిస్తాడు.

ఆ తర్వాతి కథ అందరికీ తెలిసిందే. పల్నాటి యుద్ధం అయిపోయాక నాగమ్మ ఏమైందనేది కూడా గుర్రం చెన్నారెడ్డి పుస్తకంలో వివరంగా ఉంది. ఒక ముసలి స్త్రీ గుర్రం మీద ఆయుధాలను పెట్టుకుని యుద్ధరంగం నుండి నేరుగా ఆరవెల్లికే వచ్చిందనీ, ఊరి ప్రజలను పిలిచి తనను నాయకురాలంటారని, కలరా భయంతో తాను చిన్నతనంలోనే ఆరవెల్లి విడిచి మేనమామ ఊరికి వలస వెళ్ళానని, అక్కడ జరిగిన యుద్ధంలో ఒక మహావీరుణ్ణి ఓడించి చివరి రోజులు పుట్టిన ఊరిలో గడపడానికి వచ్చినట్టు చెప్పిందనీ రాశారు. గ్రామస్తుల యోగక్షేమాలను తెలుసుకోవడమే కాక, వారిని భయభ్రాంతులను చేస్తున్న దొంగలను తాను ఎదిరిస్తానని చెప్పిందట.

వారికి దొంగలను ఎదిరించడానికి తగిన శిక్షణ కూడా ఇచ్చిందట. చివరకు దొంగలను ఎదిరిస్తూనే ఆమె చనిపోయింది అని ఒక కథ తెలిపితే, కాదు కాదు నాగమ్మ తన చరమ దశలో స్వచ్ఛందంగా జీవసమాధి అయిందని కొందరు అంటారు. ఏదేమైనా తన ఊరి కొరకు పాటుపడిన నాగమ్మకు గుడికట్టి గ్రామదేవతగా ఆ గ్రామస్తులు నేటికీ ఆరాధిస్తున్నారు. ఆమె గుడికి తూర్పు వైపున ఉన్న నీటి వాగును నాయకురాలి వాగని, కొలనును నాయకురాలి నీటి మడుగని పిలుస్తున్నారు. వాగు పక్కనే ఉన్న ప్రాంతాన్ని నాయకురాలు కొండల్రాయుడితో యుద్ధం చేసిన ప్రదేశమని అంటారు. కొండల్రాయుడు గెలిచాడో నాగమ్మ గెలిచిందో ఇదమిత్థంగా తెలియదు. ఓడి ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు, గెలిచి నాగమ్మను పాతాళానికి తొక్కేసాడని కొందరు చెపుతారు. బుడిగజంగాలు చెప్పే కొండల్రాయుడి కథలో నాగమ్మ ప్రస్తావన చాలాసార్లు వస్తుంది.

'ఏడేండ్ల ప్రాయంలో
ఎగిరిపోయిన చిలక
యాడుందో ఏమైందో
ఎరికలేక పోయెరా
ముసల్దయి వచ్చింది అమ్మోరి తీరునా
అందరిని పసిగట్టి అడిగించినాది
నాయకురాలై నడిపించినాది
ఉసిగొలిపి జగడముల కమ్మించినాది
గుబాగుబా రక్తమే గుబ్బలేసింది
కొండల్రాయుడే గుర్రంతో తొక్కిస్తే
పాతాళలోకంల కూరుక పోయింది
రాయుడే... మన కొండల్రాయుడే..'
- ఇట్లా సాగుతుందది.

గురజాల ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి పల్నాడు మహోత్సవాల్ని ఏటా ఘనంగా జరుపుతున్నారు. ఆ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మన్న, నాగమ్మ, కన్నమదాసుల విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు. మరి తెలంగాణ రాజకీయ నాయకులు నాగమ్మ విషయంలో ఏం చేస్తున్నారు? నాగమ్మ తెలంగాణ ఆడపడుచని, దేశంలోనే ప్రప్రథమ మహిళా మంత్రిణి అన్న విషయం తెలంగాణలో ఎంతమందికి తెలుసు? నాగమ్మ తెలంగాణలో పుట్టి, చివరి దశలో తిరిగి తన సొంత ఊరు ఆరవెల్లి గ్రామానికి వెళ్ళిందని పల్నాటి రచయితలు, పరిశోధకులు పాతికేళ్ల క్రితమే ధృవీకరించినపుడు, అంతటి మహా నాయకురాలు మన గడ్డమీద పుట్టిందన్న విషయంపై తెలంగాణ చరిత్రకారులు, పరిశోధకులు ఇన్నేళ్ళయినా పూర్తిస్థాయిలో ఎందుకు పరిశోధనలు చేయలేదో అర్థం కాదు.

శ్రీనాథుడి కావ్యంలో...
పదిహేనవ శతాబ్దంలో శ్రీనాథుడు కొండవీటి రెడ్డిరాజుల ఆస్థానంలో విద్యాధికారిగా పదవీ బాధ్యతలను నిర్వహించాడు. అప్పుడు చారిత్రక ప్రదేశాలన్నీ తిరిగి శ్రీనాథుడు రాసిన 'పల్నాటి యుద్ధం'లో కూడా నాగమ్మను ఆరవెల్లి నాగమ్మగానే రాశాడు.
'పంటరెడ్డి వారి పణతి యనంగా
ఎలమి జగ్గారెడ్డి వేడుక పుత్రీ
మేకపోతులరెడ్డి మేనకోడలును
'ఆరవెల్లి' వారింటి అమరకోడలును
తరుణి నాగమయను తక్షణముంచు...'

ఓరుగల్లులో వీరోత్సవాలు...
వీరాచార సంప్రదాయం పేరిట ఏటా కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, ఓరుగల్లులలో (ఇప్పటి వరంగల్లు) పల్నాటి వీరోత్సవాలు జరిగేవి. ఓరుగల్లులో పల్నాటి వీరోత్సవాలు ఘనంగా జరిగినట్లు వినుకొండ వల్లభరాయుడు 16వ శతాబ్దిలోనే తన క్రీడాభిరామంలో పేర్కొన్నాడు. పల్నాటి వీరగాథల్ని ఓరుగల్లు వీథుల్లో ఆలపించడాన్ని ఆయన పద్యాలుగా రచించాడు.

(మరిన్ని వివరాలకు- కె.వి. నరేందర్ 94404 02871
సంగెవేని రవీంద్ర 099871 45310)

No comments:

Post a Comment