Tuesday 22 January 2013

ధర్మానకి ఏది దారి?



దిక్కుతోచని  స్థితిలో  ధర్మాన ప్రసాదరావు 
తాజాగా వాన్‌పిక్ కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పేర్కొంటూ..సిబిఐ కోర్టు తీర్పునివ్వడంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడ్డారు.


వాన్‌పిక్ కేసులో సీబీఐ గత ఏడాది ఆగస్టు 13న దాఖలు చేసిన నాలుగో చార్జిషీట్‌లో ధర్మాన ప్రసాదరావును ఆరో నిందితునిగా చేర్చింది. తర్వాత ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఆగస్టు 14 న ముఖ్యమంత్రికి లేఖను అందజేశారు. దీనిపై ముఖ్యమంత్రి చాలాకాలం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజీనామా చేసినప్పటి నుంచి ధర్మాన విధులకు హాజరుకావడం లేదు. ఆ శాఖకు సంబంధించిన ఫైళ్లన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.

సీఎం తన రాజీనామా ఆమోదించనప్పటికీ తాను మంత్రిగా లేనని, కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతున్నానని ధర్మాన పలు సందర్భాల్లో ప్రకటించారు. ఇదిలా ఉండగా సుమారు రెండు నెలల క్రితం ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర కేబినె ట్ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరిస్తూ మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్ తిప్పిపంపడంతో ప్రభుత్వం ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితిలో ఉంది.

తాజాగా వాన్‌పిక్ కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పేర్కొంటూ.. అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై అభియోగాలను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడంతో ప్రభుత్వం మరోసారి ఇరకాటంలో పడింది. తాజా పరిణామాలతో ధర్మాన రాజీనామా వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇలావుండగా.. తొలుత ధర్మాన ప్యాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి కోరిన సీబీఐ, ఆ తర్వాత అనూహ్యంగా ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ కోర్టును ఆశ్రయించింది. సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించడంతో ధర్మాన రాజీనామా మరోసారి చర్చనీయాంశమైంది.

తాజాగా కోర్టు ధర్మానపై అభియోగాలను విచారణకు స్వీకరించడంతో సీఎం ఆయన రాజీనామాను ఆమోదిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మాన ప్రాసిక్యూషన్ కొనసాగినా ఆయన సాంకేతికంగా పదవిలో కొనసాగేందుకు ఇబ్బందులు లేనందున రాజీనామాను యథాతథంగా పెండింగ్‌లోనే పెట్టొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోపిదేవిని సీబీఐ అరెస్టు చేసినందునే ఆయన రాజీనామాను ఆమోదించాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి పలుమార్లు చెప్పుకొచ్చారు. ఆ విధంగా సాంకేతికాంశాలను పరిగణనలోకి తీసుకుంటే ధర్మాన రాజీనామా లేఖపై కిరణ్‌కుమార్‌రెడ్డి మరికొన్నాళ్లు వేచిచూసే అవకాశముందని చెబుతున్నారు. మరోపక్క ధర్మాన సీబీఐ కోర్టును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ధర్మానకి ఏది దారి?


మంత్రి ధర్మాన ప్రసాదరావు భయపడినంతా అయ్యింది. ఆయన కేసు విచారణ బోనెక్కింది. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్‌లో మిణుకుమిణుకుమన్న ఆశలు ఆవిరైపోయాయి. ‘ఆ.. మాకేం భయం. సోనియా నుంచి సీఎం కిరణ్ వరకు అంతా అండగా ఉన్నారు’ అని ఇప్పటివరకు డాంభికాలు పలికిన వారంతా తాజా పరిణామాలతో నీరుగారిపోయారు. మంత్రిని విచారించేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడం జిల్లా కాంగ్రెస్‌లో కలకలం రేపింది. పార్టీ శ్రేణుల్లో కలవరం.. ఆగ్రహం సమపాళ్లలో పెల్లుబికాయి. నమ్ముకున్నవారిని పార్టీ నట్టేట ముంచేస్తోందని కార్యకర్తలు మండిపడుతున్నారు.
మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టైంది శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పరిస్థితి. అసలే రోజురోజుకూ ప్రాభవం కోల్పోతున్న ఆ పార్టీ మంత్రి ధర్మాన వ్యవహారంతో మరింతగా మసకబారనుంది. జిల్లా వ్యాప్తంగా కాం గ్రెస్ కార్యకర్త ల్లో పట్టున్న నేత మంత్రి ధర్మానే. 2009 నుంచి శత్రుచర్ల విజయరామరాజు మంత్రిగా ఉన్నప్పటికీ, జిల్లా కాంగ్రెస్‌లో ఎవరేమిటో ఆయనకు ఇప్పటికీ తెలీదు. ఇక ఏడాది క్రితం మంత్రి అయిన కోండ్రు మురళీగానీ, తాజాగా కేంద్రమంత్రి అయిన కృపారాణిగానీ జిల్లావ్యాప్తంగా పట్టు సాధించలేకపోయారు. వారిద్దరి రాజకీయ వ్యూహరచన సామర్థ్యంపైనా కార్యకర్తలకు నమ్మకం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ఏకైక పెద్ద దిక్కు మంత్రి ధర్మానే. ఇప్పుడు ఆయనపైనే విచారణకు సీబీఐ కోర్టు అనుమతింది. దీంతో మంత్రి స్వయంగా చిక్కుల్లో పడ గా.. ఆయన్నే నమ్ముకున్న కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలకు ఇది గ్రహపాటుగా మారింది. సీబీఐ కేసు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనకు అండగా ఉన్నాయన్న ఆశతో ఉన్న మంత్రి, కార్యకర్తలకు సైతం అదే చెబుతూ వచ్చారు. పార్టీ అధిష్టానంపై నమ్మకం లేకపోయినా ధర్మాన చెప్పడంతో ఇప్పటివరకు కాస్త ఆశతో ఉన్న కార్యకర్తలు తాజా పరిణామాల నేపథ్యంలో నిసృ్పహతో కుంగిపోయారు.

అధిష్టానం తీరుతోనే ఈ దుస్థితి
సీబీఐ కేసు విషయంలో పార్టీ అధిష్టానం తీరుపై కాంగ్రెస్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రి ధర్మానకు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ధర్మాన విచారణకు అనుమతివ్వకూడదన్న మంత్రివర్గ సహచరుల ఒత్తిడితో సీఎం కిరణ్ అయిష్టంగానే అంగీకరించారని వారు ఆరోపిస్తున్నారు. అందుకే మంత్రి మండలి తీర్మానాన్ని గవర్నర్ తిరస్కరించిన తరువాత కిరణ్ ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేశారని అంటున్నారు. తద్వారా సీబీఐ వాదనకు పరోక్షంగా మద్దతు పలికారని ఆరోపిస్తున్నారు.

కాగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు పన్నిన కుట్ర కాంగ్రెస్‌కే తిప్పికొడుతోందని మంత్రి ధర్మాన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వై.ఎస్. హయాంలో జారీ చేసిన 26 జీవోలు సక్రమమేనని ప్రభుత్వం వాదిస్తే పరిస్థితి ఇంతగా దిగజారేదికాదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తాము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ సీఎం వినిపించుకోలేదని కూడా ధర్మాన నిష్టూరమాడినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ కాపాడలేనంతగా పార్టీ పరిస్థితి దిగజారిందని...ఇక చేసేదేమీ లేదని కాంగ్రెస్ వర్గాలు నిసృ్పహ వ్యక్తం చేస్తున్నాయి.

No comments:

Post a Comment