Tuesday 18 December 2012

బాబుకు సాక్షి కవరేజీ

- కేసీఆర్ ను ఎదుర్కొనేందుకే?


హైదరాబాద్, డిసెంబరు 17: శుత్రవుకు శత్రువు మిత్రుడు అనే సామెత రాజకీయాల్లో చక్కగా పనిచేస్తుంది. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా కూడా రుజువు చేస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ప్రధాన ప్రత్యర్థి. దీంతో తెలంగాణలో కేసీఆర్ పై పోరులో భాగంగా వైఎస్ జగన్ సాక్షి మీడియా చంద్రబాబు తెలంగాణ పాదయాత్రను కూడా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు వస్తున్నా.. మీకోసం పేరుతో చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో సాగుతోంది. తెరాసకు ఎక్కువగా పట్టున్న జిల్లాల్లో ఇదొకటి. తెలంగాణలో ప్రవేశించినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు కేసీఆర్‌పై, ఆయన పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే కేసీఆర్‌పై విమర్శల జడివాన కురిపిస్తున్నారు. కేసీఆర్‌పై, తెరాసపై చంద్రబాబు చేస్తున్న విమర్శలకు సాక్షి మీడియా ప్రాధాన్యం ఇస్తూ ప్రచురిస్తోంది. చంద్రబాబు, జగన్ ఉమ్మడి శత్రువు కూడా తెలంగాణలో కేసీఆర్ కావడం వల్లనే సాక్షి మీడియా ఆ విధంగా చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
తెరాసను తిరకాసు పార్టీగా చంద్రబాబు అభివర్ణిస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం చేసేందేమీ లేదని అంటున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ రావాలని కూడా లేదని ఆయన అంటున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు సాక్షి మీడియా ప్రాధాన్యం ఇస్తూ ప్రచురిస్తోంది. అదే సమయంలో చంద్రబాబు వైఎస్ జగన్‌పై, ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ఆస్తుల పోగుపై చంద్రబాబు పదే పదే ఓ పిట్ట కథ చెబుతున్నారు. జగన్ సంపాదించిన డబ్బులు కట్టలు కడితే ఎన్ని లారీలు అవుతాయో ఆయన చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలకు మాత్రం సాక్షి మీడియా కోత పెడుతోంది.
తెలంగాణలో ప్రవేశించిన వైఎస్ జగన్ సోదరి షర్మిల మొదట్లో కేసీఆర్‌పై దూకుడుగా వ్యాఖ్యలు చేశారు. అవతలి నుంచి తీవ్రమైన ఎదురు దాడి ప్రారంభమైంది. దీంతో ఆమె కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. షర్మిల మాత్రం చంద్రబాబునే ప్రధాన లక్ష్యం చేసుకుని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏమైనా, రాజకీయాలనే కాకుండా ప్రజలను కూడా అయోమయంలో పడేయడానికి రాజకీయ పార్టీలు చేయాల్సినంత పని చేస్తున్నాయి.
---------------------------

జగన్‌-మజ్లిస్ దోస్తీ?
- ఆత్మరక్షణలో కాంగ్రెస్

హైదరాబాద్, డిసెంబరు 17: రాజధానిలో కీలకంగా ఉన్న మజ్లిస్ పార్టీ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో దోస్తీకి సిద్ధం కావడంతో ముస్లిం ఓట్లపై ఎప్పుడూ భారీ ఆశలు పెట్టుకునే కాంగ్రెస్ నాలుగు శాతం రిజర్వేషన్‌లు తమవిగా చెప్పుకునే ప్రయత్నాలను ప్రారంభించింది. సొంత కుంపటి పెట్టుకున్న వైఎస్ జగన్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోని పథకాలన్నీ తన తండ్రివిగా ప్రచారం చేస్తున్నారు. తద్వారా ఆయన లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104... ఇలా ప్రతి పథకాన్ని తన తండ్రి పథకంగా జగన్ చెబుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పథకాలే అయితే మిగిలిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు లేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. పథకాలపై కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుండి జగన్ పార్టీపై ఎదురుదాడి చేస్తోంది. అవి కాంగ్రెస్ పథకాలని, ముఖ్యమంత్రిగా ఎవరున్నా వాటిని అమలుపర్చుతామని, పథకాలు ఏ ఒక్కరికో చెందినవి కావని... పార్టీవిగా చెప్పుకొస్తున్నారు. పథకాలపై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి కొంతలో కొంతైనా ప్రభుత్వానికి కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. లేదంటే అంతకుముందు ఆ పథకాలను పూర్తిగా వైఎస్‌విగా భావించే వారు. ఇప్పుడిప్పుడే క్రమంగా కాంగ్రెస్ పథకాలుగా ప్రజల్లో నానుతున్నవి.
ఇదే సమయంలో పుష్కరకాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ తో కలిసి ఉన్న మజ్లిస్ పార్టీ జగన్‌తో దోస్తీకి తహతహలాడుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ కు తమ మద్దతును ఇటీవల ఉపసంహరించుకున్నారు. ఆ సమయంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ముస్లింల అభివృద్ది కోసం వైఎస్ ఎంతో చేశారని, నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారని ప్రశంసలు గుప్పించారు. మజ్లిస్ కేవలం హైదరాబాదులోనే కీలకంగా ఉన్నప్పటికీ ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పడుతుంది. నాలుగు శాతం రిజర్వేషన్ వైయస్‌ది అని మజ్లిస్ చెప్పడంతో ఇన్నాళ్లు తమకు అండగా ముస్లిం ఓటర్లు ఎక్కడ దూరం అవుతారోనని భావించిన కాంగ్రెస్ నిన్న నిర్వహించిన సదస్సులో ఆ క్రెడిట్ తమదిగా చెప్పుకునే ప్రయత్నాలు చేసింది. నాలుగు శాతం రిజర్వేషన్‌లు ప్రకటించినప్పుడు కాంగ్రెస్ నేతలు వైయస్‌ను పొగిడారు. ఇప్పుడు వైయస్‌ను జగన్ సొమ్ము చేసుకుంటుండటం, మజ్లిస్ తమకు దూరమవడంతో ఆలస్యంగానైనా మేలుకున్న కాంగ్రెస్ పార్టీ అన్ని పథకాల్లాగే రిజర్వేషన్ క్రెడిట్ కూడా తమదే అని సదస్సులో చెప్పింది.
ముస్లింలకు రిజర్వేషన్‌కు కారకులు కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ అని చెప్పారు. ఆజాద్ వల్లే ఇది సాధ్యమైందని కితాబిచ్చారు. ఆజాద్ ముస్లిం నేత. కాబట్టి ఆయనకు ఆపాదించడం ద్వారా 4 శాతం రిజర్వేషన్ క్రెడిట్ కాంగ్రెస్ ది అని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు మరింత సులభంగా ఉంటుందనే భావనతో కాంగ్రెస్ ఉందని అంటున్నారు. అలాగే రైతులకు ఉచిత విద్యుత్ కూడా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచన ప్రకారమే అని కాంగ్రెస్ నేతలు ఆదివారం నాటి సదస్సులో గొంతెత్తి చెప్పారు.
-----------------------------

No comments:

Post a Comment