Wednesday 19 December 2012

మన తెలుగు

మార్కెట్ సంస్కృతిలో తెలుగు కు తప్పని విధ్వంసం


18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవ ప్రభావం వలన ఇంగ్లండు దేశీయులు తమ పారిశ్రామిక ఉత్పత్తుల అమ్మకానికి వలస దేశాల స్థాపనకు పూనుకున్నారు. అలాగే రెండు దశాబ్దాలకు ముందు ప్రపంచంలో విద్యుత్ సంబంధ పరికరాలు, సౌందర్య సంబంధ సాధనాలు, వాహనాలు, మొదలైన వాటికి సంబంధించిన సాంకేతిక విజ్ఞానం పెరిగింది. దీనివల్ల ఆయా పెట్టుబడిదారీ దేశాలు తమ పారిశ్రామిక ఉత్పత్తుల అమ్మకం నిమిత్తమై మరోమారు వలస దేశాల వేటలో పడ్డాయి. ఈ పరంపరలో సహజంగానే మరల అమెరికా మొదలుగాగల పెట్టుబడిదారీ దేశాలు కొనుగోలుదారీ సామర్థ్యం కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలపైకి దృష్టి సారించాయి.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటైన భారతదేశం నేడు పెట్టుబడిదారీ వర్గం దృష్టిని తీవ్రంగా ఆకర్షిస్తోంది. దీనికి ప్రధాన కారణం సహజంగానే ఇక్కడ ఉన్న సహజ వనరులు, తక్కువవేతనంతో లభించే శ్రామిక వర్గం అందుబాటులో ఉన్నాయి. ఈ అంశాలు ఆయా దేశాలు వ్యాపారం చేసుకోవటానికి అనుకూలిస్తున్నాయి. ఐతే ఇదే సమయంలో సంస్కృతీ పరంగా ఇక్కడి ప్రజలలో భిన్నత్వంలో ఏకత్వం అనేది పెట్టుబడిదారీ వర్గానికి అననుకూలమైన అంశంగా కన్పించింది. అంటే ఇక్కడి సంస్కృతిలోని ఏకత్వం కారణంగా భారతీయులు కట్టుబొట్టులలో మార్పులను అంతగా ఇష్టపడరు. దేశ సంస్కృతిలో భాగంగా వివిధ ప్రాంతాల్లో వివిధ భాషలు కానవస్తాయి. ఈ వివిధ భాషల్లో ఆయా సంస్థలు (కంపెనీలు) తమ ఉత్పత్తుల్ని గూర్చిన ప్రచారం చేయడం కష్టంతో కూడిన పని. అంటే ఎంతో ఖర్చుతో కూడిన పని. ఈ ఖర్చును తగ్గించుకోవడం, ఉత్పత్తులను అపరిమితంగా అమ్ముకోవడం కోసం దేశం మొత్తంలో ఒకే భాషను అమలుచేయాలని పెట్టుబడిదారీ దేశాలు ఆలోచించాయి. ఇదే ఆలోచనను ఒకనాడు బ్రటీష్ వారు చేశారు. వారి పాలనలో చౌకగా దొరికే గుమాస్తాగిరి వెలగబెట్టే వారి కోసం మెకాలే ఆంగ్ల విద్యా విధానాన్ని తెరపైకి తెచ్చాడు. నేడు అమెరికా మొదలైన పెట్టుబడిదారీ దేశాలు ఆంగ్ల భాషను పెంచి పోషించడం ద్వారా మన దేశం వంటి దేశాలలో వారి ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి అనుకూలంగా మలుచుకోదలచారు. అందుకే ఒక దశాబ్దం క్రితం ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు ప్రోత్సాహాన్ని అందించడం కోసం ప్రపంచ బ్యాంకు నుండి ఉదారంగా మన దేశంపైకి నిధులు విడుదలయ్యాయి. ఇలా విడుదలైన నిధులే నేడు మన రాష్ట్రంలో సక్సెస్ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు పేరుతో ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు తామర తంపరగా పుట్టడానికి కారణమయ్యాయి. వీటివల్ల ఒక దశాబ్దం క్రితం దాకా ధనిక వర్గానికే ప్రైవేటు పాఠశాలల ద్వారా అందుబాటులో ఉన్న ఆంగ్ల విద్య నేడు ఉచితంగా సామాన్య వర్గం వద్దకు చేరింది. దీనితో ఆంధ్రదేశంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేడు తెలుగు మాధ్యమంలో చదివేవారు క్రమక్రమంగా తగ్గిపోతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదివేవారు పెరుగుతున్నారు. ఇక్కడ గమనించదగిన ఒక ముఖ్య విషయం ఉంది. అదేమంటే ఆంగ్ల మాధ్యమ విద్యా విధానంవల్ల విద్యార్థుల్లో ఆంగ్ల భాషలో నైపుణ్యం కంటే, ఆంగ్ల భాషను కేవలం అర్థం చేసుకోవడం, ఆంగ్లంలో సమాధానం చెప్పగలగడం దీని లక్ష్యం. ఇలా 1990వ దశకంలో ఆరంభమైన ప్రపంచీకరణ విషబీజం దేశంతోపాటుగా ఆంధ్రదేశంలో గట్టిగా వేళ్ళూనుకొంది. ఆంధ్ర దేశంలో ఆంగ్ల భాషలో మాట్లాడటం నేడు మోజుగా మారింది. తెలుగు భాషలో మాట్లాడితే నిరక్షరాస్యునిగా భావిస్తున్నారు. తెలుగు అసలు మాట్లాడటం రాదని చెప్పుకోవడం ఈ తరానికి సరదాగా పరిణమించింది. ఆంగ్ల భాషలో చదువు సాములు ఒక హోదా. అదే తెలుగు భాషలో చదివితే వారికి ఉద్యోగాలు రావని, వారికి సమాజంలో కనీసం బతుకుతెరువు కూడా ఉండదనే అపప్రచారం సమాజమంతటా నీలి మేఘాల్లా కమ్మేసింది. పాశ్చాత్యుల పిజ్జాలు, బర్గర్‌లు, పఫ్‌లు వంటి ఆహార అలవాట్లు మన సంప్రదాయపు వంటకాలైన అరిసెలు, బూరెలు, గారెలు వంటి వాటిని చిద్విలాసంగా వెక్కిరిస్తున్నాయి. దీనికి కారణం కేవలం మన మాతృభాషా విధ్వంసమే.
‘ఎఫ్.డి.ఐ’ పేరుతో తొందరలో చిల్లర వస్తువుల దుకాణాల్ని మన దేశంలో అడుగడుగునా పెట్టుబడిదారీ దేశాలు ప్రారంభించనున్నాయి. ఈ పరిస్థితుల పరంపరని మనం గమనిస్తే పరభాషా వ్యామోహం సమాజాన్ని పట్టి మనల్ని భాషా పరతంత్రులుగా మార్చిందనుటలో ఏలాంటి సందేహం లేదు. మరోమారు ఈ దేశం పరోక్షంగా పెట్టుబడిదారీ వర్గపు కబంధహస్తాలలో చిక్కుకుపోతుందనడానికి ప్రాంతీ య భాషల్లో ఒకటైన తెలుగు భాష తన స్థానాన్ని కోల్పోతూ ఆంగ్ల భాష తన స్థానాన్ని పదిలం చేసుకోవడమే ప్రబల తార్కాణంగా చెప్పుకోవచ్చు

3 comments:

  1. మీ భావ స్పష్టతా,నిర్మొహమాట వైఖరీ హర్షించదగినవి. మీరు విశ దీకరించినట్లుగా భాష మీద అభిమానానికన్నా దాన్ని గురించి ఏదో మాట్లాడేసి నావాటా నేను పట్టుకుపోవాలి అన్న ధోరణి తెలుగు మహాసభల నిర్వాహకులలో లేకున్నట్లయితె కొంచెము ముందుకు పోవగలమేమో.

    ఈ సంబరాల్ని వింటే నాకు మా చిన్నప్పుడు ఊర్లొ జరిగే "దివ్వలు" సంబరాలు గుర్తొస్తయి. వాటి ప్రాముఖ్యం ఎవరికీ తెలి యదు కాని ప్రతి ఏడూ జరుపు కుంటుంటారు .ఉలాలు పోస్తారు,పప్పలు వండుకుంటారు,దీపాలు పెడతారు. మళ్ళా ఇంకో యేడాదికి గాని దాన్ని గురించి చింతనే ఉండదు.

    మాదిన రామకృష్ణ.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సార్....ఈ బ్లాగ్ ను దయచేసి అందరికీ పరిచయం చేయగలరని మనవి

      Delete