Friday 21 December 2012

సాహిత్యం


‘కథకు పర్యాయపదం’---పెద్దిభొట్ల


పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారిని -ఆ మధ్యన ఎవరోగానీ- ‘కథకు పర్యాయపదం’గా నిర్వచించారు. కొందరి కళ్లకు ఆయన ‘గోరంత దీపం’గా కనిపిస్తే మరికొందరి మనస్సులకు ‘కొండంత వెలుగ’నిపించాడు. ఒకరికి ‘ధ్రువతార’గా కనిపిస్తే, మరొకరికి ‘విద్రోహ కవి’గా కనిపించాడు. ఒకవేపునుంచి చూస్తే ‘సామూహిక విషాదగానానికి బాణీలు కడుతున్న సంగీత దర్శకుడిలా’ కనిపిస్తూనే, మరో కోణంలోంచి ‘చరిత్రహీనుల పదయాత్రకు ప్లకార్డులు రాసిపెడుతున్న పేవ్‌మెంటు చిత్రకారు’డిలా అనిపించడం ఆయన ప్రత్యేకత.

కొందరాయన్ను ‘బ్రాహ్మణ దళితుల చరిత్రకారు’డన్నారు. మరికొందరు ‘బాల్యం పారేసుకున్న భవభూతి భ్రాత’గా ఆయన్ను అభివర్ణించారు. వాస్తవానికి, ఆయన పెద్దిభొట్ల సుబ్బరామయ్య! అంతే- ఆయన్ను పరిపూర్ణంగా వర్ణించగల వచనాలూ లేవు, నిర్వచనాలూ లేవు; సరిపోల్చడానికి సాటి రచయితా లేడు! అలాంటి పెద్దిభొట్లకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు -కాస్త ఆలశ్యంగానే అయినా- ప్రకటించారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్యకథలు - మొదటి సంపుటానికి ఈ పురస్కారం దక్కింది. నిజానికిది ప్రపంచవ్యాప్తంగా విస్తరించివున్న తెలుగుజాతికి దక్కిన అపూర్వ పురస్కారం.

టంగుటూరి ప్రకాశం పుట్టిన పల్లె -వల్లూరు-లోనే పుట్టిన పెద్దిభొట్ల, కథాసాహిత్యాన్ని సాధికారికమయిన చారిత్రిక పత్రాల స్థాయికి తీసుకెళ్లారు. మన దేశం స్వతంత్రమయిన కొత్తలో, ఇక్కడి సమాజంలోని కొన్ని పొరలు భూమిలోకి కుంగిపోగా, మరికొన్ని పైపైకి లేచాయి. పల్లెల్లో బతుకు సాగక లక్షలాదిమంది పట్నాలకూ, నగరాలకూ తరలివెళ్లిపోయారు. కొత్తకొత్త బతుకు తెరువులు రూపుదిద్దుకున్నాయి. జీవితానికి అపూర్వమయిన వన్నెలన్నో వచ్చిచేరాయి.

వాటినన్నిటినీ వడిసిపట్టుకుని కథల కలనేతలుగా అల్లినవాడు పెద్దిభొట్ల. అందుకే, ఆయన్ను చరితార్థుడనేది! ఆయన రాసిన ‘దగ్ధగీతం’, ‘శనిదేవత పదధ్వనులు’, ‘కోరిక’, ‘నీళ్లు’, ‘కళ్లజోడు’, ‘దుర్దినం’, ‘పూర్ణాహుతి’ తదితర కథలు అంతర్జాతీయ ప్రమాణాలను అవలీలగా అతిక్రమించిన కళాఖండాలు. సుబ్బరామయ్యగారు గొప్ప కథకులే కాదు- మరింత గొప్ప పాఠకులు కూడా. విశ్వసాహితిని యువపాఠకులకు పరిచయం చెయ్యడమంటే ఆయనకు ప్రత్యేకమయిన శ్రద్ధా, ఆసక్తీని!

జ్ఞాపకాల్లో జీవించడం పెద్దిభొట్ల స్వాభావిక లక్షణమనిపిస్తుంది. రచయితగా కూడా ఆయన చేసిన పని అదేనేమో! ఈ తలపోతల కలనేతలో పెద్దిభొట్లది ప్రత్యేకమయిన ధోరణి. ఎక్కడెక్కడి రంగురంగుల పోగుల్నో ఏరుకొచ్చి గమ్మత్తుగా కథ నేస్తారు పెద్దిభొట్ల. ఈ క్రమంలో పాటించే శిల్ప రహస్యాలేమిటో చర్చించడానికి ఆయన పెద్దగా ఇష్టపడరు. ‘‘శిల్పం-తల్పం కాదు గానీ, ఓ విషయం చెప్తా. నా కథలన్నీ -సాధారణంగా- అండర్‌స్టేట్మెంట్స్ అయుంటాయి.

అలా ఉండడం వల్లనే వాటికి మంచి పంచ్ యాడయిందని నా నమ్మకం. ఈ లక్షణం బహుశా నా స్వభావంలోనే ఉండి ఉంటుంది. దేన్నీ ఔట్ రైట్‌గా తిరస్కరించడం నా స్వభావం కాదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచనలో పడతా. ఒక్కోసారి ఈ ఆలోచన్లు ఓ కొలిక్కి వస్తాయి. అప్పుడే నా కథలు పుడతాయి. ఇది ఒకరోజులో జరిగే క్రమం కాదు- కొన్ని సందర్భాల్లో ఏళ్ల తరబడి స్ప్రెడ్ అయిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు త్రిపుర లాంటి గొప్ప రచయితల ప్రశంసలకు పాత్రమయిన ‘ఇంగువ’ కథ తీసుకోండి- ఈ ఐడియా ఓ కొలిక్కి రావడానికి దశాబ్దాలు పట్టింది’’ అంటారు పెద్దిభొట్ల.

‘‘ఆధునిక జీవనంలో వేగం పెరిగి విలువలు తరిగిపోతున్నాయనిపిస్తుంది. స్కూళ్లలోనూ, కాలేజీల్లోనూ నేర్చుకునే చదువులు బతకడం నేర్పవు! అది సాహిత్యం ద్వారా మాత్రమే నేర్చుకోగలమన్నది నా అనుభవం. కానీ, మన మే చేజేతులా పిల్లలను సాహిత్యానికి దూరం చేస్తున్నాం. రేపు వాళ్ల బతుకుల్లో ఏవన్నా వికారాలు కనిపిస్తే మనమే సమాజాన్నీ, మానవ స్వభావాన్నీ ఆడిపోసుకుంటాం. మన పిల్లలు మంచి సాహిత్యం చదివితే, చక్కని కళా రూపాలకు ఎక్స్‌పోజ్ అయితే, వాళ్ల సంస్కారం వికసిస్తుంది.

అలాంటి అవకాశం దొరక్కపోతే, వాళ్లలో వికాసం కనిపించదు. ఉదాహరణకు ఈకాలం పిల్లలకు తెలుగు కూడా సక్రమంగా రాయడం రావడం లేదు. అసలు వాళ్లేమన్నా చదివి ఉంటేగదా రాయడమనేది?! ఇక, వర్ణమాలనూ, వర్ణక్రమాన్నే సరిగ్గా నేర్పకపోతే వాళ్లకు రాయడమెలా వస్తుంది మరి? చక్షురక్షరసంయోగం అంటారు చూడండి- కంటి చూపుకూ, మెదడులో ఉండే ఇమేజ్‌కూ మధ్య ఏర్పడే అనుసంధానం- అది లేనిరోజున మన పిల్లలకి అక్షరజ్ఞానం కూడా కరువవుతుంది! ఇది నేను రచయితగా చెప్పే మాట కాదు- టీచర్‌గానూ, నాగరిక సమాజ సభ్యుడిగానూ చెప్తున్నా!!’’ అంటారు పెద్దిభొట్ల.

సుబ్బరామయ్యగారికి సాహిత్య పురస్కారం రావడం ఇదే మొదలు కాదు. గతంలో రావిశాస్త్రి స్మారక 
సాహిత్య నిధి పురస్కారం యగళ్ళ ఫౌండేషన్ (శ్రీకాకుళం), గోపీచంద్ 
స్మారక పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం అందుకున్న పెద్దిభొట్లకు అజోవిభొ ఫౌండేషన్ ఈ ఏడాది ప్రతిభామూర్తి పురస్కారాన్ని ప్రకటించారు. తన కథలపై పాఠకలోకానికి ఉన్న అభిమానానికి గుర్తుగా కేంద్ర సాహిత్య ఎకాడెమీ అవార్డు వచ్చినట్టు భావిస్తున్నానడం పెద్దిభొట్ల విశిష్ట వ్యక్త్తిత్వానికి నిదర్శనం. కాగా, ఈ సంవత్సరమే ప్రముఖ సాహిత్య విమర్శకుడూ, అనువాదకుడూ, 160 పుస్తకాల రచయితా ఆర్వియార్(రాళ్లభండి వెంకటేశ్వరరావు) మేస్టారికి కూడా కేంద్ర సాహిత్య ఎకాడెమీ పురస్కారం ప్రకటించారు. ఇటీవలే ఆర్వియార్ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment