Friday 28 December 2012

మూడనమ్మకాలు

బతుకులను బలిగొన్న మౌఢ్యం


పేదరికం బతుకులో ఒక భాగమైతే మూఢ నమ్మకాలు ఎలా జీవితాలను శాసిస్తాయో చెప్పడానికి ఈ దారుణమే అతి పెద్ద ఉదాహరణ. తాను మౌఢ్యానికి గురి కావడమే కాకుండా దానినే బతుకుతెరువు చేసుకుని జనానికి తాను అమ్మవారినని బురిడీ కొట్టించి మూఢత్వంతో బలై పోయిన ఉదంతమిది.
శ్రీకాకుళం జిల్ల్లా కవిటి మండలం కుసుంపురం గ్రామానికి చెందిన తిమ్మల గోపి అనే యువకుడు స్వగ్రామంలో పని దొరక్క... వలస వెళ్లినా జీవనం గడవక.. వక్రమార్గం పట్టాడు. సోలాపూర్ అమ్మవారినంటూ కొంతమంది శిష్యులను పోగేసుకుని ఓ కొండపై ఆశ్రమం ఏర్పాటు చేసుకుని.. అద్భుతాలు సృష్టిస్తానం టూ ప్రచారం చేసుకున్నాడు. సోలాపూర్ అమ్మవారు తన గర్భాన జన్మిస్తుందని ప్రచారం చేసుకుని.. ఆ కథ అడ్డం తిరగడంతో ఆత్మహత్యకు పాల్పడి.. జైలు పాలై.. చివరికి శిష్యుడి చేతిలో హతమయ్యాడు. 'మనల్ని ఎవరూ నమ్మడం లేదు. చనిపోతే జనం మనకు పూజలు చేస్తారు.

ఇంట్లో వాళ్లూ ఆర్థికంగా సుఖపడతారని' శిష్యుడికి చెప్పాడు. తనను కత్తితో నరికి, ఆపై నీవూ నరుక్కుని చనిపోవాలని శిష్యుడిని ఆదేశించాడు. గురువు (అమ్మవారు) చెప్పినట్టుగానే శిష్యుడు అతడిని నరికేశాడు. తానూ నరుక్కున్నాడు. అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చావు బతుకుల్లోవున్న అతడిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కవిటి మండలం కుసుంపురం గ్రామానికి చెం దిన తిమ్మల గోపి విషాద గాథ ఇది. మానసిక వ్యాధితో మూఢనమ్మకాలకు గురైన గోపీ ఎత్తులను ఎండగట్టి, అతని బారి నుంచి భక్తులను రక్షించేందుకు విశేష కృషిచేసిన పోలీసులు, అధికారులు, వైద్యులు.. అతనిని మూఢ నమ్మకం నుంచి బయటపడేసేందుకు చర్యలు తీసుకోకపోవడంతో గోపీ కథ విషాదాంతమైంది. ఇటీవలకాలంలో బాబాల మహత్యాలు ఎక్కువై, అనేక ఆశ్రమాలు పుట్టుకొస్తూ, మానవతీత శక్తులు ఉన్నాయంటూ చేసుకుంటున్న ప్రచారానికే గోపీ ఆకర్షితుడయ్యాడు. ఈ మూఢ నమ్మకాలనే ప్రచారం చేశాడు. శిష్యులకూ చెప్పాడు. తాము చెప్పేది నిజం కాదని తెలిసినా.. సొమ్ములు వస్తుండటంతో కొంతమంది శిష్యులూ పోగుపడ్డారు. అతని ప్రభావం నుంచి ప్రజలను బయటపడేసేందుకు, అతనివన్నీ మాయమాటలను చెప్పడంలో విజయవంతమైన అధికార యంత్రాంగం, అతనిని సంస్కరించేందుకు కూడా చర్యలు తీసుకునివుంటే గోపీ ప్రాణాలను కాపాడి వుండేదేమో.

కవిటి మండలం కుసుంపురం గ్రామానికి చెందిన తిమ్మల గోపి ప్రారంభంలో స్వగ్రామంలో కూలి పనులు చేసుకుని జీవించాడు. ఉపాధి కోసం ఒడిశా రాష్ట్రంలోని సోలాపూర్, ఖరగ్‌పూర్ వెళ్లాడు. అక్కడ పనులు చేసుకుంటూనే సోలాపూర్ అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు చేసేవాడు. అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలో మునగ చెట్టుకు పూజలుచేస్తూ, మహిమలు చూపేందుకు ప్రయత్నించాడు. గ్రామంలో తన ప్రయత్నాలు అంతగా ఫలించకపోవడంతో కంచిలి మండలంలోని కత్తివరం కొండను ఆశ్రయించాడు. అక్కడే ఆశ్రమం (షెడ్డు) నిర్మించుకుని, కొంతమంది శిష్యబృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారి ప్రచారంతో కొండకు భక్తుల రాక ప్రారంభమయింది. ఈ నేపధ్యంలో తాను గర్భం దాల్చానని, సోలాపూర్ అమ్మవారు తన కడుపున జన్మించనుందని ప్రచారం చేసుకున్నాడు.

ఈ ప్రచారంతో మీడియా రంగంలోకి దిగింది. మీడియా కథనాలతో పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఎస్ఐ ఎం.శ్రీనివాసరావు, ఎంపీడీవో ఎం.రోజారాణి, ప్రత్యేకాధికారి రవిప్రకాష్ కొండపైకి వెళ్లి గోపీని విచారించారు. నవంబర్ 30న తన కడుపులో అమ్మవారు బంగారు ప్రతిమ రూపంలో జన్మిస్తుందని గోపీ విచారణలో చెప్పాడు. ఈ దశలో ఏఎన్ఎం వైద్య పరీక్షలు నిర్వహించి గోపీకి ఎటువంటి గర్భం లేదని నిర్ధారించారు. కొండను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు 17వ తేదీన తన ప్రియ శిష్యుడు ఇరోతు కృష్ణను ఆత్మహత్యకు ప్రేరేపించాడు. సోంపేట ఆసుపత్రిలో కృష్ణకు చికిత్స జరిపిన అనంతరం తాను కూడా విషం తీసుకున్నానని చెప్పడంతో గోపీని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ గోపీకి సాధారణ పరీక్షలతోపాటు, గర్భానికి సంబంధించిన పరీక్షలుచేశారు.

గోపీ గర్భం దాల్చలేదని తేల్చిచెప్పాడు. కోలుకున్న అనంతరం కృష్ణను ఆత్మహత్యకు ప్రేరేపించడం, భక్తులకు మోసగించిన నేరాలపై గోపీని అరెస్టుచేసి, రిమాండ్‌కు తరలించారు. సుమారు నెల రోజులపాటు జైలులోవున్న గోపీ ఈ నెల 23వ తేదీన బెయిల్‌పై బయటకువచ్చి, స్వగ్రామానికి వెళ్లాడు. రెండు రోజులపాటు ఇంటి వద్దే ఉన్న గోపీ బుధవారం సాయంత్రం సోంపేటలోని తన అక్క వద్దకు వెళ్తానని చెప్పడంతో అతడి అన్న మోహన్ సోంపేటలోని గాంధీమండపం వద్ద దిగబెట్టాడు. అయితే సుమారు రాత్రి పది గంటల సమయంలో గోపీ అక్క కూర్మావతికి మోహన్ ఫోన్‌చేసి గోపీ వచ్చాడా అని అడగడం, ఆమె రాలేదని చెప్పడంతో వెంటనే గోపీ సెల్‌కి ఫోన్ చేశాడు. సెల్ రింగ్ అవుతున్నా.. ఎంతకీ తీ యకపోగా రాత్రి పదకొండు గంటల సమయంలో ఫోన్ తీ సిన గోపీ మాట్లాడాడు. తాను, తన శిష్యుడు ఆత్మబలిదానం చేసుకుంటున్నామని, ముందు కృష్ణ తనను నరుకుతాడని, తరువాత తాను నరుక్కుని చనిపోతాడని చెప్పి ఫోన్ కట్ చేశాడు.

ఉదయం మోహన్ కొండపైకి వెళ్లి చూడగా, గోపీ శిష్యుడు ఇరోతు కృష్ణ అపస్మారక స్థితిలో షెడ్డు బయట పడి ఉన్నాడు. షెడ్డులో గోపీ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

కృష్ణ కథనం ప్రకారం.. బుధవారం రాత్రి గోపీ తనను కొండపైకి రమ్మని చెప్పాడని, అనంతరం అమ్మవారి ఆజ్ఞ మేరకు ఇన్నాళ్లు అన్ని చేసిన మనం ప్రస్తుతం జనం నమ్మని కారణంగా ఆత్మబలిదానం చేసుకోవాలని అమ్మచెప్పిందని తెలిపాడు. ముందుగా తనని నరకమని చెప్పి, అనంతరం నువ్వు నరుక్కోమని చెప్పడంతో అక్కడే ఉన్న పెద్ద కత్తితో తానే గోపీని మెడ వెనుక భాగంలో నరికి చంపానని తెలిపాడు. గోపీని నరికిన అనంతరం తానుకూడా కత్తితో మెడపై నరుక్కున్నానని తెలిపాడు. అయితే అపస్మారక స్థితిలో ఉన్న కృష్ణను సోంపేట ఆసుపత్రికి తరలించినపుడు తనకు గోపీకి మధ్య శారీరక సంబంధం ఉందని, తాము అమ్మవారి ఆజ్ఞమేరకు గతంలో పెళ్లి చేసుకున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో తామిద్దరం ఆత్మబలిదానం చేసుకోవాలని అమ్మ చెప్పడంతో ఇద్దరం అందుకు సిద్ధపడ్డామని తెలిపాడు. అనంతరం గోపీ చెప్పడంతోనే తాను అతడిని కత్తితో నరికి, తరువాత తాను చనిపోయేందుకు సిద్ధపడ్డానని తెలిపాడు. తరువాత తామిద్దరం చనిపోతే తమ కుటుంబాలు బాగుపడతాయని, భక్తులు సైతం తమ ఫోటోలు పెట్టుకుని పూజలు చేస్తారని, గుర్తింపు లభిస్తుందని గోపీ చెప్పాడని తెలిపాడు. ఈమేరకు గోపీ కూడా సూసైడ్ నోట్ రాశాడు. అయితే కొండపై గోపీని హత్యచేసిన ప్రదేశం ఒక చోట ఉంటే మృతదేహాన్ని అమ్మవారి పాదాల వద్దకు చేర్చటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఒకేచోట ఆ ప్రయత్నం చేయకుండా ఇలా మృతదేహాన్ని ఒకచోటు నుంచి వేరొకచోటుకు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భక్తులు సమర్పించిన బంగారం గోపీ వద్ద ఉందని, దాని కోసమే అతడిని హతమార్చి ఉంటారనే ప్రచారమూ జరుగుతోంది. మొత్తంమీద మూఢ నమ్మకాలు ఓ యువకుడి ప్రాణం తీసుకున్నాయి. మరొకరిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాయి.

కేజీహెచ్‌కు కృష్ణ తరలింపు: గోపిని కత్తితో హత్యచేసి, ఆత్మహత్యకు పాల్పడిన ఇరోతు కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గోపిని బుధవారం అర్ధరాత్రి హత్యచేసిన అనంతరం కత్తితో మెడపై న, చేతిపైన గాయాలు చేసుకుని కృష్ణ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అధిక రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి చేరిన కృష్ణను గురువారం ఉదయం పోలీసులు సోం పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అ నంతరం మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

No comments:

Post a Comment