Wednesday 19 December 2012

పర్యావరణం

యథేచ్ఛగా పులుల వేట
- స్మగ్లర్లకు వరంగా మారుతున్న చైనా మార్కెట్లు
- చైనాలో పులుల అవయవాల బహిరంగ విక్రయాలు


న్యూఢిల్లీ, డిసెంబరు 19(న్యూస్ మీడియా): 
దేశంలో పులులు సంరక్షణకు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. ఇంకా యథేచ్ఛగా వాటి వేట కొనసాగుతోంది. ఏటికేడాది పెద్ద సంఖ్యలో వేటగాళ్ల చేతుల్లో పెద్ద పులులు ప్రాణాలు కోల్పోతున్నాయి. స్మగ్లర్లకు చైనా మార్కెట్లు స్వర్గధామంగా మారడమే పరిస్థితికి కారణమవుతోంది.

ఎలక్ట్రానిక్‌ పరికరాల విక్రయాలకే కాదు.. చైనా మార్కెట్లు వన్య ప్రాణుల అవయవాల అమ్మకాలకూ పెట్టింది పేరు. అక్కడ బహిరంగంగానే ఈ తంతు అంతా జరుగుతోంది. గోళ్ల నుంచి చర్మం దాకా.. ఎముకల నుంచి పుర్రె వరకూ... ఇలా పులుల అవయవాలు సైతం చైనా మార్కెట్లలో యథేచ్ఛగా దొరుకుతాయి. రోజూ కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోంది. అక్కడి ప్రభుత్వాలు కూడా ఈ వ్యాపారానికి కొమ్ముకాస్తాయన్నది బహిరంగ రహస్యం. బడా బడా కంపెనీలు లేబుళ్లతో సహా ప్యాక్‌ చేసిన పులుల అవయవాలు అమ్మడం పరిస్థితికి అద్దం పడుతుంది.

చైనా వైద్య విధానాల్లో పులుల ఉత్పత్తులను బాగా వినియోగిస్తారు. వాటి ఎముకలు శృంగార ప్రేరకాలుగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు. చర్మం, మాంసం ఇలా దేన్నీ అక్కడి వారు విడిచిపెట్టడం లేదు. అందుకోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. దాంతో చైనా వ్యాపారవేత్తలు మన దేశంలో పులుల స్మగ్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో పులిపై ఐదు లక్షలు వెచ్చిస్తున్నారు. ఫలితంగా భారత్‌లో పులుల వేట యథేచ్ఛగా కొనసాగుతోంది. ఒక్క పులి చర్మమే అంతర్జాతీయ మార్కెట్లో లక్ష రూపాయలు పైగా ధర పలుకుతోంది. అంటే వారికి ఒక్క పులి కోట్లు ఆర్జించి పెడుతోంది.

ఈ ఏడాది నవంబర్‌ వరకూ మన దేశంలో మొత్తం 50 పులులు వేటగాళ్ల బారిన పడి మరణించాయని అధికారులు చెబుతున్నారు. వన్యప్రాణుల అవయవాల వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న చైనా, దక్షిణ కొరియాలపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది.

-------------------

No comments:

Post a Comment