Sunday 30 December 2012

సాహిత్యం

బజరా ‘వాస్తవిక’కథలు
బమ్మిడి జగదీశ్వర రావు కథలన్నీ పాఠకుల్లో ఒక ఆలోచననీ, ‘వ్యక్తిస్థాయి’ నుండి ‘సామాజిక స్థాయి’కి అనే ఎదుగుదలకు చెందిన సంఘర్షణనీ పురిగొల్పే స్వభావాన్ని కలిగి ఉంటాయి. వ్యవస్థలోని జీవన సంక్షోభానికి కారణాలెైన భూమి సమస్య, దళారీ పాలకుల ప్రజావ్యతిరేక విధానాలు, సామ్రాజ్యవాదం వెదజల్లే వస్తు వ్యామోహ సంస్కృతి, డబ్బు సంస్కృతి ప్రజల్ని ఎంతటి హింసకైనా గురిచేస్తున్నాయనే వాస్తవానికి చెందిన ‘మౌలిక అంశాల్ని’ అందించడంలో బమ్మిడి కథలు చాలా వరకూ ప్రయోజకత్వాన్ని సాధించాయి.

bammidసాహిత్యం సమాజానికి అద్దం. అందువల్లే మంచి రచయితలు తాము ఎన్నుకున్న సాహితీ ప్రక్రియ ఏదెైనా సరే ఆ ప్రక్రియలో సమకాలీన సమాజాన్ని, వివిధ సామాజికాంశాల్ని ప్రతిఫలిస్తూ సామాజిక స్పృహను ప్రజ ల్లో కలిగిస్తుంటారు. ఆ కోణంలో చూస్తే బమ్మిడి జగదీశ్వర రావు కథలన్నీ సామాజిక స్పృహ కలిగినవే. ఈయన విప్లవ కథకుడు. ఈయన కథలన్నిటికీ సామాజిక జీవితమే ముడి సరుకు. ఈయన కథలన్నీ ఉపయోగితా విలువకూ, మానవ సంబంధాలకూ మధ్య జరిగిన సంఘర్షణలో- మానవ సంబంధాలే గెలుస్తాయని నిరూపించాయి. నిజానికి ఈ ఉపయోగితా విలువ కథలో మొదటి నుంచీ ఉంది. దాన్ని విమర్శకులు ఎంతబాగా చూపగలిగితే పాఠకులకు మానవ సంబంధాల్లో వచ్చే ఘర్షణల మూలాలు అంత బాగా అర్థమౌతాయి. ఆ ఆర్థిక సంబంధాల సారాంశాన్ని విప్పి చెప్పే సిద్ధాంతాన్ని జీర్ణించుకున్న రచయితే ఆ దృష్టితో మానవ సంబంధాలను చిత్రీకరించగలడు. ఇలా ఒక సిద్ధాం త నిబద్ధతతో జగదీశ్వరరావు మానవ జీవితంలోని పలు కోణాల్ని చూశాడు, చూపించాడు.

ఈయన కథలు చదువుతుంటే వాస్తవిక జీవితం కళ్లకు కట్టినట్లు కనబడుతుంది. ఈయన కథల్లో సమకాలీన సమా జం, ఆ సమాజంలోని మంచి చెడు పార్శ్వాలు, సాంఘిక రాజకీయ సమస్యలు కన్పిస్తాయి. ఈ కథల్లో సూటితనం ఉంది, స్పష్టత ఉంది. ఈయన ఎన్నుకున్న పాత్రలు కూడా బడి పంతుళ్లు, వ్యవసాయ దార్లు, దగా కోరులు, దగా పడ్డవాళ్లు, ప్రేమ రాహిత్యంతో కృంగిపోయేవాళ్లు, స్వార్థపరు లెైన రాజకీయ నాయకులు, నిస్సహాయు లు, నక్సలెైట్లు, పోలీసు దౌర్జన్యాలకు గురౌ తున్న అమాయకులు, దగా పడ్డ రెైతులు, పురుషాధిక్యతకు బలెైన స్త్రీమూర్తులు, చేతనా చేతనమైన వస్తు ప్రపంచంలో తిరు గాడుతూ కనిపిస్తారు.
బమ్మిడి తన కథల్లో కలిగించిన సామాజిక సృహను దృక్పథపరంగా చూస్తే ఆయన రాసిన ‘మట్టి తీగలు’ కథా సంకలనానికి ముందుమాట రాసిన వరవరరావు చెప్పి నట్లు- మానవ సంబంధాలు, పరారుూకరణ, పితృస్వామ్య వివక్ష ప్రధానంగా కనిపిస్తాయి.

మానవ సంబంధాలు సంక్లిష్టమౌతున్న మౌలిక యథార్థాన్ని సామాజిక స్పృహ కలిగిన బమ్మిడి తన కథల్లో ఆవిష్కరించాడు.బమ్మిడి జగదీశ్వరరావు కథల్లోని సామాజిక జీవితాన్ని మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, స్త్రీల సమ స్యలు, వ్యావసాయిక సమస్యలు, ఇతర అంశాలుగా విభ జించి విశ్లేషించుకుంటే ఓ స్పష్టమైన అవగాహన కలుగుతుంది.
ఆరోగ్యవంతమైన మానవ సమాజ మనుగడకు కుటుంబమే పునాది. కౌటుంబిక జీవితం కేవలం వంశాన్ని నిలిపే సాధనమే కాదు, సాంస్కృతిక సంప్రదాయలను వ్యాపింపజేసే వాహిక. అయితే అనేక సామాజిక పరిణా మాలు మానవ జీవితంలోని అన్ని అంశాల్ని స్పృశించినట్లు గానే కుటుంబ వ్యవస్థను కూడా ఎన్నో ఒడిదుడుకులకు లోను చేసింది. సామాజిక జీవనంలోని ‘ఆర్థిక విలువల’ దుష్ర్పభావం కుటుంబ వ్యవస్థపెై చాలా బలంగా పడింది. కుటుంబంలోని నెైతిక విలువలు ఆర్థిక విలువల ముందు తలవంచక తప్పలేదు.

బమ్మిడి రాసిన ‘మట్టితీగలు’ కథ కుటుంబ వ్యవస్థలోని దారుణ పరిణామాలకు సజీవ సాక్ష్యం. వృద్ధాప్యంలో కొడు కుల నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురౌతున్న తల్లిదండ్రుల హృదయ వేదనకు, మానసిక అలజడికి అక్షర రూపం. ఎంతసేపూ ఆస్తులకే తప్ప ఆ ఆస్తులను కష్టపడి సంపా దించిన వ్యక్తులకు విలువ ఇవ్వలేని దౌర్భగ్యపు కుటుంబ వ్యవస్థ మనది. ఆ వ్యవస్థ వికృత రూపాలే స్వార్థపరులెైన కొడుకులు, కూతుళ్లు. ఆర్థిక లావాదేవీలుగా మారిన కుటుంబ సంబంధాలు వృద్ధులకు మిగిల్చిన విషాదాన్ని ఈ కథ చాలా హృద్యంగా వివరించింది. ఈ కథలో పిల్లలకు దూరమైన ఒక తల్లి ఆవేదన పాత ఇతివృత్తమే అయినా, ఆ దూరానికి బమ్మిడి వెలికి తీసిన వాస్తవ కారణాలు కొత్తవి. ఈ కథలోని ముసలి తల్లి పడే ఆవేదనను కుటుంబ వ్యవస్థలోని నెైతిక విలువల పతనానికి పరాకాష్ఠగా చెప్పు కోవచ్చు.

‘ఒక ఒర రెండు కత్తులు’ కథ కూడా కుటుంబ సంబం ధాల్లోని వెైఫల్యాన్ని స్పృశించిన కథే. అన్నదమ్ములకే కాదు ఆలు మగలకు కూడా ఆస్తిపాస్తుల తగా దాలు తప్పవని, ఆ తగాదాల వల్ల మానవ సంబంధాలు విచ్ఛిన్నమై ఆర్థిక సంబంధాలు మెరుగవుతాయని రచయి త అభిప్రాయపడ్డాడు. ఈ కథ ఉత్తరాం ధ్రలో మధ్యతరగతి పేద కుటుంబాలను దగ్గరగా చూసి రాసిన కథ. పురుష స్వామ్య సమాజంలో పురుషులెలా ఉం టారో, వారి అహంభావం వల్ల స్త్రీలు ఎంతగా మానసిక ఒత్తిడికి గురెై నలిగి పోతున్నారో ఈ కథలో బమ్మిడి వివరిం చాడు. నేటి తరం కథా రచయితలు వర్తమాన సంక్లిష్ట జీవన కోణాల్ని చిత్రిస్తూ జీవిత విస్తృతికి అక్షర రూప మిస్తున్నారు. మానవ సంబంధాల పెనుగులాటలు, విజ యాలు, వెైఫల్యాలు, విలువల దిగజారుడుతనం అన్నీ కథల్లోకి ప్రవేశించి మానవ సంబంధాలపట్ల ఓ అవగాహ నను ఉన్నతీకరిస్తున్నారు. ఈనాటి కథకు ప్రధాన ఇతి వృత్తం మానవ సంబంధాల ఘర్షణేనని బమ్మిడి కథలు చాలా బలంగా చూపుతాయి.
బమ్మిడి కథల్లోని మానవ సంబంధాల విశ్లేషణకు పరాకాష్ఠ ఆయన రాసిన ‘వెలుగు దారి వెతుకు దారి’ కథ. పట్నవాసపు కృత్రిమత్వం మధ్య పల్లె నిర్మలత్వం ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకుంటుంది.

సరిగ్గా ‘వెలుగు దారి వెతుకు దారి’ కథలో గోదావరమ్మ పరిస్థితి అంతే. పట్నంలో మృగ్యమైపోయిన ఆప్యాయతలు, అనురాగాలకోసం ఆమె తన పల్లె వెైపు దృష్టి సారిస్తుంది. అయితే సామ్రాజ్యవాద సంస్కృతి కారణంగా పెచ్చుమీరిన పరారుూకరణ, ధన సంస్కృతి మూలంగా లుప్తమైపోయిన మానవసంబంధాల మధ్య గ్రామ సీమలు మునుపటిలాగా ఉన్నాయా? అంటే లేవు అనే విషయాన్ని ఈ కథ తెలియజేసింది.మనిషి జీవితంలో చీకటి తప్ప ఇంకేమీ మిగలని ఒక ఉదాత్త జీవిత చిత్రాన్ని జగదీశ్వరరావు తన కథల్లో ఆవిష్కరించాడు.ఒక వ్యక్తి మనస్సును, శరీరాన్ని, మేధస్సును తనకోసం, ఇతరుల కోసం స్వేచ్ఛగా వినియోగించుకోవడంలోని అను భవమే జీవితం. అయితే ఇలా జీవితాన్ని అందరూ స్వేచ్ఛ గా అనుభవించాలంటే ప్రతి ఒక్కరికి కొన్ని నియమాలు, స్వేచ్ఛకి పరిమితులు తప్పవు. ఈ నియమాలు, పరిమితులు అవసరం మేరకు అవగాహనతో ఆచ రించిన వారి జీవితం వారి చేతుల్లో ఉం టుంది.

కాని సమాజంలో కొంతమంది తమ స్వేచ్ఛ కోసం, తమ జీవితం కోసం పరిమితులు, నియమాలు ఎదుటివారిపెై అతిగా రుద్దడం జరగొచ్చు. ఈ పితృస్వా మ్య సమాజంలో పురుషులు స్త్రీలపట్ల ఇటువంటి వెైఖరే అనుసరించారు. స్త్రీ శరీరాన్ని, మనస్సుని, మేధని అణచివేసి ఆమె స్వేచ్ఛకి పరిమితులు విధించే భావ జాలం అందించారు. ఈ భావజాల ప్రభా వం ఎంత తీవ్రంగా ఉందో, దీనివల్ల స్త్రీలు ఎంతటి అణచి వేతకి, హింసకి గురవుతున్నారో, ఎన్ని భ్రమలు వారి చుట్టూ ఉన్నాయో స్పష్టం చేస్తూవాటిని ఎలా ఛేదించాలో బమ్మిడి తన కథలో చిత్రించాడు. స్త్రీల జీవితంలోని అన్ని కోణాలను పరిశీలించి స్త్రీ పురుషుల మధ్య వివక్షని, దోపిడీని, లెైంగిక హింసను, వివాహ కుటుంబ వ్యవస్థల్లోని పితృస్వామ్య భావజాల ప్రభావాన్ని స్పష్టం చేయడమేగాక, స్త్రీల శరీరాల చుట్టూ ఉన్న భ్రమల్ని ఛేదించడానికి ప్రయ త్నించాడు.

స్త్రీలు తమని తాము తిరస్కరించుకుని, తమని తాము లేకుండా చేసుకునే క్రమంలోకి వివహమనే వ్యవస్థ ద్వారా ఎట్లా వెడతారో ‘సరుకు’ అనే కథలో బమ్మిడి వివరించాడు. ఈ కథలో రాజేశ్వరి పెళ్లికోసం పేరు మార్చుకుంటుంది. ప్రదానంనాడు ఆమె వేలికున్న చిన్న లోపాన్ని చూసి ఆమెకు ఐదునిమిషాల ముందు కట్టబెట్టిన చీరా జాకెట్‌ విప్పేసుకు పోతారు పెళ్లికొడుకు తాలూకు మనుషులు. ఈ కథ చదివి వాళ్లమీద కోపం తెచ్చుకోవడం చాలా సహజం. లోకం లోఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనుకుని, మనం మరీ అలాంటి వాళ్లం కాదులే అని పాఠకులను తృప్తి పడనిస్తే ‘సరుకు’ కథా ప్రయోజనం నెరవేరదు. వివాహ వ్యవస్థ ఇలాంటి రాక్షసులను తయారు చేస్తుందనీ, ప్రతి స్త్రీ ఏదో ఒక స్థాయిలో ఈ హింసకు గురవుతుందని అర్థం చేసు కున్నప్పుడే మనం సమూలమైన మార్పు గురించి ఆలోచిస్తాం.

ఈ సమాజంలో భార్య మీద కంటే తన సంబంధంలోకి వచ్చిన ఇతర స్త్రీల మీద ఎక్కువ హింస జరిపే అవకాశం మగవాడికి ఎంత ఉందో బమ్మిడి రాసిన ‘రెక్కల గూడు’ కథ చెబుతుంది. ‘లక్క పిడతలు’ బమ్మిడి కథల్లో జెండర్‌ వివక్షకు చాలా సూక్ష్మంగా చూపిన మంచి కథ. ఈ స్త్రీ పురుష వివక్షను ప్రసార సాధనాలు మరింత స్థిరపడేలా చేసే క్రమం గురించి ‘మా ఇంట్లో మహా భూతం’ కథ చిత్రించింది. వర్గం, లింగం రెండూ అణ చివేత క్రమంలో ఒకదాని కొకటి సహాయ పడుతున్నాయనీ, వర్గ దోపిడీ, పురుషా ధిపత్యమూ ఒకదాని నుంచిఒకటి విడదీయలేనంతగా పెనవేసుకుపోయి ఉన్నాయనే విషయాన్ని బమ్మిడి కథలు తెలియజేస్తాయి.
గ్రామీణ వ్యవసాయరంగం ఎదుర్కొన్న అనేక సమస్య లను వివిధ దృక్కోణాల నుండి పరిశీలించి, వాటికి శాస్త్రీయ కారణాలను అన్వేషించడానికి కూడా బమ్మిడి తన కథల్లో ప్రయత్నించాడు.
గ్రామీణవ్యవస్థని పణంగా పెట్టి పట్టణీ కరణ వేగవంతమౌతున్న నేపథ్యంలో పితృస్వామిక అణ చివేత నిర్దిష్ట రూపాల్ని, సంస్కృతి వికృతినీ చూపిం చాడు. కనుకనే గ్రామాలనుంచి కార్మికులుగా, ఉద్యోగులుగా మారి మధ్య తరగతి జీవన స్థాయిని, విలువల్ని, అందుకున్న పాత్రలు ప్రధానంగా బమ్మిడి కథా సంకలనాల్లో కనిపి స్తాయి. ఈ సమాజిక ఆర్థిక సంక్షోభానికి మరో చిత్రంలో కనిపించే వెనుకబడిన, దళిత వర్గాలకు చెందిన చిన్న రెైతులు, రెైతు కూలీలు, కార్మికులు ఎదుర్కొంటున్న వ్యవస్థాగత హింసని బమ్మిడి తన కథల్లో ప్రతిఫలిం పజేశాడు.ఇలా బమ్మిడి కథలన్నీ పాఠకుల్లో ఒక ఆలోచననీ, ‘వ్యక్తిస్థాయి’ నుండి ‘సామాజిక స్థాయి’కి అనే ఎదుగుదలకు చెందిన సంఘర్షణనీ పురిగొల్పే స్వభావాన్ని కలిగి ఉంటాయి. వ్యవస్థలోని జీవన సంక్షోభానికి కారణాలెైన భూమి సమస్య, దళారీ పాలకుల ప్రజావ్యతిరేక విధానాలు, సామ్రాజ్యవాదం వెదజల్లే వస్తు వ్యామోహ సంస్కృతి, డబ్బు సంస్కృతి ప్రజల్ని ఎంతటి హింసకైనా గురిచేస్తున్నాయనే వాస్తవానికి చెందిన ‘మౌలిక అంశాల్ని’ అందించడంలో బమ్మిడి కథలు చాలా వరకూ ప్రయోజకత్వాన్ని సాధించాయి.



No comments:

Post a Comment