Tuesday 18 December 2012

                                       భాషోద్ధరణ మాటల్లోనే?

తెలుగు భాషను పాలన భాషగా ప్రసార మాధ్యమ భాషగా, బోధన భాషగా వినియోగించాలని పాలకులు ఏనాడో చట్టాలు చేశారు, జీవోలు ఇచ్చారు. కానీ, ఆ జీవోలు అమలయ్యాయా? ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగులో మాట్లాడేవారు కాని తెలుగులో రాసిన దరఖాస్తులను స్వీకరించేవారు ఉన్నారా? తెలుగు సాహిత్యం, సాంస్కృ తి చరిత్ర గ్రంథాలు, భాషా నిఘంటువులను పునర్‌ ముద్రించాల్సి ఉండగా పాలకులు ఏరోజైనా పట్టించుకున్నారా? కంటి తుడుపుగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తే వచ్చే లాభం ఏమిటో పాలకులకే తెలియాలి. అన్ని విభాగాల పర్యవేక్షణకు మంత్రిత్వ శాఖలుండగా తెలుగు భాష అమలుకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం ఘోరమైన తప్పిదం కదా. తెలుగు మీడియం చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన పాలకులు మాట తప్పలేదా? మహా సభల ముందు శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలూ అందించడం పాలకులకు కొత్తేమీ కాదు. ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు భాషా బోధనకు సరైన చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం కప్పదాటుడు వైఖరి కొనసాగించడం విచారకరం. తెలుగు భాషపై ప్రేమ లేకపోయినప్పటికి తూతూమంత్రంగా హామీల వర్షం కురిపించడం తప్ప మిగిలిందేమి లేదు. తెలుగు భాష పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా తామేదో వెలగబెడతామంటూ వాగ్దానాలు కురిపించడం వృథా కాదా? 1975లో హైదరాబాద్‌లో జరిగిన సదస్సు తీర్మానాలు ఇప్పటికైనా అమలు చేశారా?
తెలుగు వారి భాషా సాంస్క ృతుల్లో ఇప్పటివరకూ ఎన్నో మార్పులు వచ్చినప్పటికి తెలుగుభాష పూర్తిగా దిగజారిపోయింది. తెలుగు మహాసభలకు కోట్లాది రూపాయలు వృథా చేయడం కన్నా తెలుగు భాషా, సాంస్కృతుల పరిరక్షణ తెలుగు మంత్రిత్వ శాఖ ఏర్పాటు వంటి విషయాల్లో శ్రద్ధ చూపాలి. సినిమాల్లో, పత్రికల్లో, టీవీ చానెళ్లలో భాషను నియంత్రించే నాథుడే లేకపోవడం వల్ల తెలుగు భాష విధ్వంసానికి గురవుతుంది. ధనార్జన కోసం, లాభాపేక్షకోసం ఇంగ్లీష్‌ మీడియం చదువులను విద్యార్థులపై నెట్టడం తెలివితక్కువతనం కాదా? మనతో పాటు ఏర్పడ్డ భాషా ప్రయుక్త రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు భాష పరిరక్షణ విషయంలో మనకంటే ముందున్న విషయాన్ని మన పాలకులు మర్చిపోయారు. చట్టసభలు, మండల, జిల్లా కార్యాలయాలు, సచివాలయాలు, జిల్లా న్యాయస్థానాల్లో తెలుగులో వ్యవహరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన జిఒ నెం.485ని వెంటనే అమలు పరిస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి తేటతెల్లనవుతుంది. రాష్ట్రంలోని అన్ని స్థాయుల, రకాల విద్యాసంస్థల్లోనూ తెలుగును ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలి. తెలుగు భాషా పరిరక్షణకోసం రూ.150 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో అన్ని పోటీ పరీక్షలకు తెలుగును తప్పనిసరి అర్హత పరీక్షగా ఆదేశాలు జారీ చేయాలి. ప్రభుత్వం కొండంత హడావిడి చేయడం కన్నా గోరంత ఆచరణ చూపితే అందరికీ ఆనందం, తెలుగు భాషకు శ్రేయస్కరం!

No comments:

Post a Comment