Saturday 22 December 2012

ధర్మ సంకటం

*  ధర్మానకు గవర్నర్ షాక్


(శ్రీకాకుళం-న్యూస్ మీడియా)
ఆర్అండ్‌బీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంకటస్థితిని ఎదుర్కొంటున్నారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ధర్మానను ప్రాసిక్యూషన్ చేసేందుకు సీబీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. ప్రాసిక్యూషన్‌కు అనుమతించవద్దంటూ రాష్ట్ర కేబినెట్ తీర్మానించి ఫైల్‌ను గవర్నర్‌కు పంపించింది. దీనికి గవర్నర్ ఆమోదం లభిస్తుందని అంతా ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీకి, ధర్మాన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. మరింత సమాచారం కోసం న్యాయపరమైన అంశాలను పునఃపరిశీలించి ఫైల్‌ను తిరిగి పంపాలని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. తమకు అనుకూలంగా గవర్నర్ నిర్ణయం ఉంటుందని ఇంతవరకూ భావిస్తున్న ధర్మాన, అతని అనుచరులకు షాక్ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ధర్మానకు సీబీఐ కోర్టు నోటీసులు ఇచ్చింది.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఓ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా అవినీతి నిరోధక చట్టం కింద విచారించడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని సీబీఐ దాఖలు చేసిన మెమోలో పేర్కొనడంతో ధర్మానకు సీబీఐ కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ నెల 31కు విచారణ వాయిదా వేసింది. దీంతో ధర్మాన అంశం మళ్లీ మొదటికొచ్చి జిల్లా రాజకీయవర్గాల్లో పెద్దచర్చకు దారితీసింది. ఎప్పుడు ఏమవుతుందోనని ఆయన అభిమానులు, అనుచరుల్లో కలకలం మొదలైంది.ఆయనకు కొమ్ముకాసే కొంతమంది విలేఖరులు, డెస్క్ జర్నలిస్టులు ఆందోళన పడుతున్నారు. నవంబర్ 21న రాష్ట్ర కేబినెట్ మంత్రి ధర్మానకు బాసటగా నిలుస్తూ.. సీబీఐ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే అంతకుముందే సీబీఐ చార్జిసీటులో తన పేరుందని ధర్మాన నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా ప్రతి సీఎం తన వద్దనే ఉంచుకున్నారు.

'నేను ఏ తప్పు చేయలేదు. కేబినెట్ నిర్ణయాలకు కట్టుబడి నడుచుకున్నాను. నిర్ధోషినని తేలేవరకు మంత్రి బాధ్యతలు చేపట్టేది లేదు. అంతవరకు ఎమ్మెల్యేగానే కొనసాగుతాను'' అని ధర్మాన నిర్ణయించారు. దీనికి కట్టుబడి అధికారిక కార్యక్రమాలు ఏవీ రెండున్నర నెలలుగా చేపట్టడం లేదని బయటకు ప్రచారం జరుపుతూ లోలోపల అన్ని కార్యకలాపాలూ యధావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు.  ఓ పక్క సీబీఐ నోటీసులు, మరో పక్క గవర్నర్ తన ప్రాసిక్యూషన్ ఫైల్ తిప్పిపంపడంలాంటి వరుస పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ, ధర్మాన పార్టీ, విశాఖ జిల్ల్లా రచ్చబండ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

శుక్రవారం ఉదయం కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి రాజీవ్ ప్రజాసదన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కాసేపు అక్కడే గడిపి పాత్రికేయుల సమావేశంలో ఆయన తొలుత మాట్లాడి వెంటనే నిష్క్రమించారు. అప్పటికే గవర్నర్ తన ఫైల్‌ను తిరష్కరించారనే స్పష్టమైన సమాచారం ధర్మాన వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. తరువాత సాయంత్రం కేంద్రీయ విద్యాలయం వార్షికోత్సంలో ముఖ్యఅతి«థిగా ధర్మాన పాల్గొన్నారు. ఎప్పటిలాగే ఆయన మేకపోతు గాంభీర్యాన్ని  ప్రదర్శిస్తూ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఏమీ జరగకపోవచ్చనే సంకేతాలను అనుయాయులకు ఇచ్చినట్టు భావించారు. అయితే గవర్నర్ నిర్ణయం వారిని కంగు తినిపించింది.

No comments:

Post a Comment