Wednesday 26 December 2012

పార్టీల్లో అఖిలం టెన్షన్...?

హైదరాబాద్, డిసెంబరు 26: అసలేం జరుగుతోంది...? ఏం జరగబోతోంది....? ఏం జరగనుంది....? సమస్య అదే... పార్టీలు మారాయి... నాయకులూ మారారు. అప్పటి ప్రరాపా స్థానంలో ఇప్పటి వైకాపాకు చోటు దక్కింది. లోక్‌సత్తాను అసలు పరిగణనలోకే తీసుకోలేదు. 2010 రిపీట్‌ అవుతుందా? ఫలితం వస్తుందా? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ సమస్య సజీవంగా ఉంది. మరీ పుష్కరకాలంగా ఉద్యమం ఉధృత స్థాయికి చేరింది. సమస్యపై తాడోపేడో తేల్చాల్సిన సమయం వచ్చేసింది. మరి ఇప్పటికైనా సమస్య తేలుతుందా?
అధిష్ఠానం పెద్దల మనసులో అఖిలపక్షమన్న ఆలోచన కొత్తదేమీ కాదు... కాకపోతే దాన్ని ఈసారి సరికొత్తగా ఆవిష్కరించారు. తెలంగాణపై అఖిలపక్షానికి సిద్ధమని ప్రకటించారు. అందుకు ముహుర్తాన్ని ఈనెల 28గా నిర్ణయించారు. అఖిలపక్షంతో ఏదో జరగబోతుందన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈసారి తెలంగాణ వచ్చేస్తుందన్న ఆశతో తెలంగాణవాదులు ఎదురుచూస్తున్నారు. అఖిలపక్షంతో తేలేదేమీ లేదని, కేవలం అభిప్రాయ సేకరణే జరుగుతుందని సీమాంధ్రవాదులు చెబుతున్నారు. హోంమంత్రి మంత్రి మారినందునే మరోసారి అఖిలపక్షం నిర్వహిస్తున్నామని కేంద్రమూ తేల్చిచెప్పేసింది. ఈ అఖిలపక్షంతో రాజకీయ పక్షాల అసలు రంగు బయటపడుతుందని అన్ని పార్టీలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. దీనిపై కొంచం లోతుల్లోకి వెళదాం... 2009 ఎన్నికలకు ముందు... తెలంగాణపై అన్ని పార్టీలదీ ఒకే మాట. ప్రత్యేక రాష్ట్రానికి ఎంతమాత్రం వ్యతిరేకం కాదని. 2009 ఎన్నికల మొదటి దశ పూర్తికాగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్లేటు ఫిరాయించారు. హైదరాబాద్‌ వెళ్లాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుందని నంద్యాల సభలో భావోద్వేగాలు రెచ్చగొట్టారు. దీంతో టీఆర్‌ఎస్‌ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం ఇరుకున పడింది. వైఎస్‌ ప్రకటనతో సీమాంధ్రలో కాంగ్రెస్‌కు బాగానే లాభించింది. తర్వాత కొంతకాలం తెలంగాణపై టీఆర్‌ఎస్‌ మినహా... అన్ని పార్టీలు మౌనంగా ఉన్నాయి.

2009 నవంబరు 29న కేసీఆర్‌ దీక్ష తర్వాత అభిప్రాయ సేకరణ కోసమంటూ నాటి రోశయ్య ప్రభుత్వం డిసెంబరు 7న అఖిలపక్షం ఏర్పాటు చేసింది. తెలంగాణపై రాష్ట్రంలో జరిగిన తొలి అఖిలపక్షం ఇదే. అన్ని పార్టీలు తెలంగాణకు వ్యతిరేకం కాదని, అసెంబ్లీలో తీర్మానం చేద్దామని గట్టిగా నొక్కి చెప్పాయని ఇప్పటి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రెండురోజుల క్రితం తనను కలసిని టీజేఏసీ నేతలకు విస్పష్టంగా చెప్పారు. 2009 డిసెంబరు 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు మొత్తం తలకిందులయ్యాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ మినహా అన్ని పార్టీలు అడ్డం తిరిగాయి. తెలంగాణలో సంబురాలు... సీమాంధ్రలో సమరాలు ఏకకాలంలో మొదలయ్యాయి. కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు పార్టీలకతీతంగా ఏకమయ్యారు. సామూహికంగా రాజీనామాస్త్రాలు సంధించారు. ఈ పరిణామాలతో కేంద్రం మరోసారి ఆలోచనలో పడింది. డిసెంబరు 23న తెలంగాణపై మరో ప్రకటన చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాన్ని రెండుగా విభజించాలంటే రెండు ప్రాంతాల అభిప్రాయాలు అవసరమని, ఏకాభిప్రాయమూ ముఖ్యమంటూ అఖిలపక్షానికి పిలుపునిచ్చింది. ముహుర్తం 2010 జనవరి 5. అది కేంద్ర స్థాయిలో మొదటిది... మొత్తంగా రెండోసారి నిర్వహించిన అఖిలపక్షం.

ఈ భేటీకి రాష్ట్రం నుంచి 8 గుర్తింపు పొందిన పార్టీలను కేంద్రం ఆహ్వానించింది. కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తమ్‌కుమార్‌డ్డి, కావూరి సాంబశివరావు హాజరయ్యారు. ఇద్దరూ వేర్వేరు అభిప్రాయాలు చెప్పారు. ఇక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధుల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉత్తమ్‌కుమార్‌డ్డి చెప్పగా.... తెలంగాణ రాష్ట్రం అవసరం లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని కావూరి డిమాండ్‌ చేశారు. మజ్లిస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, అసెంబ్లీలో ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. రాష్ట్ర విభజన అవసరం లేదని, అలాంటి అనివార్య పరిస్థితే వస్తే రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుకుని, హైదరాబాద్ రాజధానిగా రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ లేని రాష్ట్రాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. పీఆర్పీ తరఫున హాజరైన ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, పార్టీ నేత సీ రామచంద్రయ్య రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, తాము సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. టీడీపీ తరపున తెలంగాణ ప్రాంతం నుంచి రేవూరి ప్రకాశ్‌డ్డి, సీమాంధ్ర నుంచి యనమల రామకృష్ణుడులు వెళ్లారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని, డిసెంబర్9 ప్రకటనను అమలు చేయాలని రేవూరి కోరగా.. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలన్నదే తమ అభిప్రాయమని యనమల చెప్పారు.

ఆ తర్వాత 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీ నియామించింది కేంద్రం. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ డిసెంబరు 30, 2010న రాష్ట్రంలోని పరిస్థితులపై సమగ్రమైన నివేదిక సమర్పించింది. ఇది మరింత అగ్గి రాజేసింది. 8 అధ్యాయాలు, 6 సూచనలతో నివేదిక ఇచ్చిన కమిటీ... 8వ అధ్యాయాన్ని రహస్యంగా ఉంచడం రాష్ట్రంలో మరోసారి రాజకీయ సంక్షోభానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే 2011, జనవరి 6న ముచ్చటగా మూడో అఖిలపక్షాన్ని నిర్వహించింది కేంద్రం. ఈ సమావేశాన్ని టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ బహిష్కరించాయి. మిగిలిన పార్టీలు హాజరైనా... సమావేశంలో ఏమీ తేలలేదు. తెలంగాణ సమస్యకు పరిష్కారం దొరకలేదు.

తాజా అఖిలపక్షం నాలుగోది. ఏమైనా...అఖిలపక్ష భేటీ పేరుతో నాటి హోంమంత్రి చిదంబరం మొదలు.. అదే శాఖకు నేటి మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వరకూ దోబూచలాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి దశలో తన హయాంలో రెండు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించిన చిదంబరం.. ఆ తర్వాత అసలు అఖిలపక్ష ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు. నాలుగు పార్టీలు ఇంకా అభిప్రాయం చెప్పలేదని, ఆ పార్టీలు అభిప్రాయం చెప్పిన తర్వాతే అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని పాడిన పాటనే పదే పదే పాడారు. చివరకు ఆ పదవిలోంచి వెళ్లిపోయారు. ఓ దశలో అఖిలపక్షంలో ఏకాభిప్రాయం కాదు.... ఆయా పార్టీల నాయకులే ముందు ఏకాభిప్రాయానికి రావాలని ఓ సలహా కూడా ఇచ్చారు. తాజాగా చిదంబరం స్థానంలో బాధ్యతలు స్వీకరించిన షిండే కూడా అదే బాట పట్టారు. అఖిలపక్షం ఏర్పాటు ఆలోచన ఇప్పట్లో లేదని నెలరోజుల కిందటి దాకా చెబుతూ వచ్చారు. అదే సమయంలో తన అభిప్రాయాన్ని అఖిలపక్షం అవసరం లేకుండానే తెలంగాణపై... కేంద్రం నిర్ణయం తీసుకోగలదన్నారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌ సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఒత్తిడికో... వారిని బుజ్జగించేందుకో కానీ ఈ అఖిలపక్షానికి అంగీకారం లభించింది. అయితే.. ఇది శ్రీకృష్ణ కమిటీ చెప్పినదానికి అనుగుణంగానే జరుగుతున్నదన్న వాదనా లేకపోలేదు. మొత్తానికి ఢిల్లీ పెద్దలు అఖిలపక్షానికి.. ఏకాభిప్రాయానికి ముడేశారు. నిజానికి ప్రపంచంలో ఏ అంశంపైనా ఏకాభిప్రాయం సాధ్యం కాదన్న సంగతి ఎవరికీ తెలియంది కాదు. చట్టసభల్లో ఒక బిల్లు ఆమోదం పొందటానికే కాదు.. సాక్షాత్తూ భారతదేశ పరిపాలనకు మూలాధారమైన రాజ్యాంగాన్ని సవరించడానికి కూడా ఏకాభిప్రాయం అవసరం లేదు. నిర్దిష్టమైన మెజార్టీ ఉంటే చాలు. ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం అదే. ఎక్కువ మంది ఏది కోరుకుంటే అది! ఇంగ్లిష్‌లో చెప్పాలంటే... మెజారిటీ ఈజ్‌ లా అన్నమాట. కానీ.. తెలంగాణ అంశానికి మటుకు అది వర్తించడం లేదు. మరి డిసెంబరు 28 అఖిలపక్షం చివరిదవుతుందా.... ఇంకా సమస్యను జఠిలం చేస్తుందా? లేక నాన్చివేత ధోరణికి కొనసాగింపు అవుతుందా? 2014 ఎన్నికలకు తెలంగాణ మరోసారి ఎజెండాగా మారుతుందా? మరో 48 గంటల్లో పాలకు పాలు... నీళ్లకు నీళ్లులా తేలిపోనుంది.


----------------

No comments:

Post a Comment