Thursday 20 December 2012

'అణు'యుద్ధం

సిక్కోలులో 'అణు' ప్రకంపనలు

(న్యూస్ మీడియా - శ్రీకాకుళం)


శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో 'అణు యుద్ధం' మొదలైంది. తమ వేడుకోలు, విన్నపాలను పట్టించుకోని ప్రభుత్వంపై ప్రజలు, మత్స్యకారులు యుద్ధానికి సన్నద్ధమయ్యారు. అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ రణస్థలం మండలం కొవ్వాడలో మత్స్యకారులు, ప్రజలు మంగళవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభించారు. ప్రాణాలైనా అర్పించి అణుపార్కును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఉద్యమం విజయవంతం కావాలంటూ, ప్రభుత్వాల మనసు మారా లంటూ మత్స్యకార మహిళలు గ్రామదేవత పోలేరమ్మకు, దుర్గాదేవికి పూజలు చేశారు.

దీక్షా శిబిరంలో శ్రీనివాసనందస్వామీజి, గొర్ల కిరణ్‌కుమార్, మైలపల్లి పొలీస్, కలిశెట్టి అప్పలనాయుడు, సీహెచ్ నరసింగరావు, గొర్లె అసిరినాయుడు, మైలపల్లి జగ్గులు, అల్లిపల్లి రాముడు, బడి తోటయ్య, డొప్ప రాము, బి.కృష్ణమూర్తి, కరిమజ్జి భాస్కరావు, అప్పారావు, చీకటి నరసింహమూర్తి కూర్చున్నారు.

పార్టీలకతీతంగా ఐక్యంగా పోరాడి అణుపార్కును అడ్డుకుంటామని వారు పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అణుపార్కులను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ భూమి సాగు చేసిన మత్స్యకారులకు సాగు హక్కు కల్పిస్తామని రెవె న్యూ అధికారులు హామీ ఇచ్చి వాటి ని తుంగలో తొక్కారన్నారు. ఇప్పు డు వారు అణుపార్కు ఏర్పాటుపై వివరించడానికి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. సోం పేట, కాకారపల్లి ఉద్యమాల ను స్ఫూర్తిగా తీసుకొని పోరాటాన్ని ఉధృతం చేస్తామని హె చ్చరించారు. అణుపార్కును వ్య తిరేకిస్తూ 30 పంచాయతీలు తీర్మానం చేసి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కోండ్రు మురళీమోహన్, ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడుకు ఇచ్చామని చెప్పారు.

2004 ఎన్నికలలో కొవ్వాడలో అణుపార్కురాదని హామీ ఇచ్చిన బొత్స సత్తిబాబు నేడు పట్టించుకోవడం మానేశారని అన్నారు. అమెరికా ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కొవ్వాడలో అణుపార్కు ఏర్పాటు చేయడానికి సమాత్తం అవుతుందని, ఐక్యంగా దీనిని ఎదుర్కొంటామని అన్నారు. కుడంకులంలో అణువిద్యుత్ కేంద్రాన్ని అక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారని వివరించారు. అణుపార్కుకు సంబంధించిన జీవో నెంబర్లు 42,270,47 రద్దు చేసే వరకు కొవ్వాడలో దీక్షలు కొనసాగుతాయని అన్నారు. ప్రధాన జంక్షన్‌లు కోష్ట, పైడిభీమవరం, రణస్థలం, చిలకపాలేంలో అణుపార్కుకు వ్యతిరేకంగా దీక్షలు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి చిన్నకొవ్వాడ, రామచంద్రాపురం, గూడాం, పాతర్లపల్లి, కోటపాలేం, అల్లివలస, జీరుపాలేం, కోష్ట, రణస్థలం తదితర గ్రామాల నుంచి సుమారు రెండు వేల మంది ప్రజలు హాజరయ్యారు.

పోలేరమ్మా.. ఊరిని కాపాడమ్మా

సముద్రాన్నే నమ్ముకున్న జీవిస్తున్న తమ గుండెలపైకి అణుకుంపటి రాకుండా చూడమ్మా అంటూ మహిళలు గ్రామ దేవత పోలేరమ్మను వేడుకున్నారు. మంగళవారం పోలేరమ్మకు ముర్రాటలు చెల్లించి ప్రార్థనలు చేశారు. చేపల వేటకు వెళ్ళే ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మత్స్యకారులు దినచర్య ప్రారంభిస్తారు. కొన్నేళ్ళగా అణుపార్కు కొవ్వాడలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తం కావడంతో మత్స్యకార కుటుంబ సభ్యులకు కంటిమీద కునుకు ఉండడం లేదు. మంగళవారం మొదలైన రిలే దీక్షలు సక్రమంగా జరగాలని ఆశిస్తూ ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ బయలుదేరి గ్రామదేవత పోలేరమ్మకు పసుపు కుంకమలతో కూడిన ముర్రాటను సమర్పించారు.

శాంతియుత పోరాటాలకు సంపూర్ణ మద్దతు

సోంపేట: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలపై ప్రజలు సాగిస్తున్న శాంతియుత పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ వై.కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి బీన ఢిల్లీరావు, టి.చంద్రయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవ్వాడలో అణువిద్యుత్ ప్లాంట్ నిర్మించవద్దని 32 పంచాయతీలకు చెందిన ప్రజలు ముక్తకంఠంతో నినాదిస్తున్నా అందుకువిరుద్ధంగా ప్రభుత్వం ప్లాంట్ నిర్మాణానికి 42వ జీవోను విడుదల చేయడం దురదృష్టకరమన్నారు. జీవోను రద్దు చేసేవరకు దీక్షలు కొనసాగించాలని సూచించారు.

భూసేకరణను విరమించుకోవాలి

శ్రీకాకుళం: కొవ్వాడలో అణు విద్యుత్‌ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం చేస్తోన్న భూసేకరణను విరమించుకోవాలని సీపీఎం పట్టణ కార్యదర్మి పంచాది పాపారావు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఏడు రోడ్ల జంక్షన్‌లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూజిల్లాను అగ్నిగుండంగా మార్చే ఈ ప్లాంట్ నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేయాలన్నారు. అనంతరం అణుభూతం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్, చలపతిరావు, తదితరులు ఉన్నారు.




No comments:

Post a Comment