Tuesday 18 December 2012

కొత్త పుస్తకాలు

కొత్త పుస్తకాలు
అశోకుని తాత్వికత

అశోకుడు అనగానే మనకు - చెట్లు నాటించెను, బాటలు పరిచెను, కళింగ యుద్ధానంతరం బౌద్ధమతం స్వీకరించెను - అన్న విషయాలే గుర్తొస్తాయి. చరిత్రను ప్రత్యేకంగా అధ్యయనం చేయని వ్యక్తులకు అశోకుడి గురించి అంతకు మించి తెలిసే అవకాశం తక్కువే. అయితే శ్రీ శార్వరి రచన 'సామ్రాట్ అశోక' ఆయన తాత్విక కోణాన్ని మనకు తెలియజేస్తుంది. అశోకుడు, ఆయన తండ్రి బిందుసారుడు అందగత్తెలైన వారి భార్యలను పరిచయం చేస్తుంది. అలాగే వారి మనోగతాలనూ వివరిస్తుంది. 'నాకు బ్రాహ్మణత్వంపై కోపం లేదు, ద్వేషం లేదు, వాళ్ళ స్వార్థం అంటేనే మంట. దేవుళ్ళ పేరు చెప్పి బతకడం అసహ్యం. మనిషి మనిషిగా జీవించాలి. అందరినీ గౌరవించాలి..' అంటూ అశోకుడు తన భార్యకు ఒక సందర్భంలో వివరిస్తాడు. అశోకుడు అందగాడు కాదు. శౌర్యం, ప్రతాపం, బుద్ధికుశలత ఆయన లక్షణాలు.

కన్నతండ్రి మాదిరిగా ప్రజలను రాజు రక్షించాలన్నది ఆయన భావన. ఇరవై మూడు శతాబ్దాల నాటి కథ ఇది. ఆయినప్పటికీ ఈచరిత్రకు సమకాలీనత ఉంది. కుటిలనీతి, కుతంత్రం, స్వార్థం, పగ, ద్వేషం తదితరాల్లో అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా కనిపించదు. వేదపండితులతో అశోకుడు జరిపిన చర్చ తత్వ లోతులను స్పృశిస్తుంది. మనిషి సన్మార్గగామి కావడం ఎట్లా? సదాలోచన ఎట్లా? సత్య సంధత సాధ్యమేనా అంటూ మూడు ప్రశ్నలపై వారి మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా ఉంటుంది. రాజును చూసి ప్రజలు భయపడకూడదు, రాజుని ప్రేమించగలగాలి అని చెప్పే కళింగ శాసనం; ఇతర మతాలను గౌరవించినప్పుడే తన మతం విలువ పెరుగుతుందని తెలిపే షాబజగర్ శిలాశాసనం అశోకుడి మనస్తత్వాన్ని తెలియజేస్తాయి.

ఈ పుస్తకంలో చారిత్రక సత్యాలకు తోడు కొంత ఊహాకల్పన కూడా ఉందని రచయితే వివరించారు. అయితే కొన్నిచోట్ల పాత్రల మధ్య సంబంధాలను సరిగ్గా కలపనందున, చరిత్రపై పూర్తి స్థాయి అవగాహన ఉన్నవారిని ఈ పుస్తకం సంతృప్తిపరచలేకపోవచ్చు. అందువల్ల అన్నీ సత్యమా అనే వివేచన జోలికి వెళ్ళకుండా ఆశోకుడి జీవితం, ఆలోచనల గురించి హాయిగా చదువుకోవచ్చు. ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఆరాటాన్ని ఈ పుస్తకం రేకెత్తిస్తుంది. భాష చాలా సరళంగా ఉంది. ఆసక్తిపరుల మెదడుకు మంచి మేత అని చెప్పక తప్పదు.

సామ్రాట్ అశోక, శ్రీశార్వరి
ధర : రూ.150, పేజీలు : 230, ప్రతులకు : యోగాలయ, సికింద్రాబాద్, ఫోన్ నెం.040-27796676

No comments:

Post a Comment