Saturday 29 December 2012

ఫలితం సున్నా

ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలి మృతి 
సింగపూర్:
 ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఏడాది అత్యంత విషాదకరమైన సంఘటన ఇదే. మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచింది. పక్షం రోజుల క్రితం ఢిల్లీలోని ఓ బస్సులో 23 ఏళ్ల యువతి దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. 
పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో బాధితురాలిని గురువారం సింగపూర్ మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. భారత కాలమానం ప్రకారం ఆమె తెల్లవారు జామును 2 గంటల 15 నిమిషాలకు మరణించింది. అంతకు ముందు ఆమెకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స జరిగింది. రోగి డిసెంబర్ 29వ తేదీన ప్రాణాలు విడిచిందని చెప్పడానికి విచారిస్తున్నామని ఆస్పత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కెల్విన్ లోహ్ ఓ ప్రకటనలో చెప్పారు. భారత హైకమిషన్, ఆమె కుటుంబం పక్కనే ఉన్నారని చెప్పారు. ఆమె విదేశీయురాలు కావడంతో కొన్ని లాంఛనాలను పూర్తి చేయడానికి మృతదేహాన్ని సింగపూర్ జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతదేహాన్ని భారత్‌కు తీసుకుని వెళ్తామని తల్లిదండ్రులు చెప్పారని భారత హై కమిషనర్ టిసిఎ రాఘవన్ చెప్పారు. అమ్మాయి ధైర్యంగా ఉందని, స్పృహలో ఉందని, చివరి వరకు మృత్యువుతో పోరాడిందని అన్నారు. ఉత్తమ చికిత్స అందించడానికి సింగపూర్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఆమె మృత్యువుతో చలించిపోయారని, అయితే అత్యంత మెరుగైన వైద్యం అందిందని భావిస్తున్నారని, గాయాల తీవ్రత కారణంగా బతకలేకపోయిందని ఆయన అన్నారు. తమను ఒంటరిగా వదిలేయాలని కుటుంబ సభ్యులు కోరినట్లు ఆయన తెలిపారు.

No comments:

Post a Comment