Wednesday 19 December 2012

*మన తెలుగు

తెలుగు వారు..... తెలుగు తీరు

జీవితానుభవాల సారమే సామెతలు. 'కాకిపిల్ల కాకికి ముద్దు' వంటి వాటిని మరువలేము కదా! తెలుగు వారికి తెలుగు భాష మధురంగా ఉంటుంది. అలాగే తమిళులకు తమిళ భాష కూడా! తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి 'సుందర త్తెలుంగ'ని పొగిడారు. ఈ విధంగా తమిళ భాషను పొగిడిన తెలుగుకవి ఎవరూ ఉన్నట్టు లేరు.
'దేశ భాషలందు తెలుగు లెస్స' అని పొగడబడింది కదా అని ఆంగ్లంలో 'లెస్స'గా భావింపకబడే స్థితికి తెలుగుకు 'తెగులు' పట్టింది. 'తెలుగు లలిత కళాతోరణం' తెలుగు వారి గర్వకారణంగా భావించిన రోజులు మారాయి. అది తెలుగు భాషకా, సాహిత్యానికా లేక సంస్కృతికా దర్పణం పట్టేది? అనే విషయం నేడు ప్రశ్నార్థకమయింది. అందువల్ల 'నేతి' బీరకాయ, 'పెరుగు' తోటకూరలలోని 'నేతి, 'పెరుగు' పదాలకు ప్రాధాన్యం లేనట్లుగానే, లలిత కళాతోరణంలోని 'తెలుగు' పదాన్ని కూడా అలానే భావించింది ప్రభుత్వం. అందువల్ల, 'ప్రగతి' పేరిట 'తెలుగు' పద నిర్మూలనమే అధోగతి'గా మారింది; 'రాజీవ్‌ లలిత కళాతోరణం'గా పేరు మార్చింది.
31.10.2008న కేంద్ర ప్రభుత్వం కన్నడంతోపాటు, తెలుగుకు కూడా ప్రాచీన హోదాను ప్రకటించింది. 1.11.2008న ఆంధ్ర రాష్ట్రావతరణ సందర్భంలో అంబరాన్నంటే సంబరాలు జరిపిన ప్రభుత్వం, సంస్థలు, సంఘాలు ఆ పిదప భాషా విషయంలో నిమ్మకు నీరెత్తినట్లున్నాయి. ఆంధ్ర రాష్ట్రావతరణ సందర్భాన్ని చక్కగా జరుపుకోవడానికి ప్రాచీనభాష హోదా ప్రకటన ఆనాడు లాభించింది. ఇప్పుడు అందరూ ఆ ప్రకటనను విస్మరించారు. మన భాష గొప్పది అని చెప్పుకోడానికి, ఇతరులిచ్చే డబ్బుకు సంబంధం లేదు. మన భాషాభిమానానికి, ప్రాచీన హోదాకు సంబంధం లేదు. 'ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూసి మోసపోకుమా' అన్నట్లు, 'దాహం వేసినప్పుడు బావిని తవ్వడం మొదలు పెట్టడం' అనుచితమవుతుందనే విషయాన్ని ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకొని, సంబరాలు చేసికోవాలి.
తెలుగు పరిశోధన - పరిరక్షణ
ఒక భాష ప్రాచీనమా, ఆధునికమా? అన్న విషయంలో అభిప్రాయ భేదాలు ఉండటం సహజం. తమిళ భాషకు 'సెమ్మొళి' (క్లాసికల్‌) స్థాయి ఇచ్చేంతవరకూ తెలుగువారికి భాషాభిమానం ప్రశ్నార్థకమయింది. కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలుగును కూడా 'క్లాసికల్‌' అని ఆమోదించడంతో మనవారి ఉత్సాహం పరిసమాప్తమయింది. 'క్లాసికల్‌' పదాన్ని ప్రాచీన, విశిష్ట, శ్రేష్ట - అనే పదాల ద్వారా తెలియజేశారు. ఇంతకీ, ఇవేవీ సరైన అనువాదాలు కావు. 'శాస్త్రీయ' పదాన్ని వాడితే, 'వ్యావహారికం' పేరిట మన భాషకు గల శాస్త్రీయత నేడు ప్రశ్నార్థకమైంది. అసలు, తెలుగు భాష మనుగడే నేడు ప్రశ్నార్థకమయినప్పుడు, అది శాస్త్రీయమా, ప్రాచీనమా, విశిష్టమా లేక శ్రేష్ఠమా - అనే పదాల చర్చకు తావే లేకుండా పోయింది. తమిళ భాష తరువాత సంస్కృతాన్ని 'క్లాసికల్‌'గా గుర్తించి కేంద్ర ప్రభుత్వం, ఘోరమైన తప్పిదం చేసింది. ప్రపంచం నలుమూలలా సంస్కృతాన్ని 'క్లాసికల్‌'గా గుర్తించారు. దానికి, భారత ప్రభుత్వం మాత్రమే అంగీకరించడమో, ప్రకటించడమో ఒక ప్రహసనం మాత్రమే! 'క్లాసికల్‌' ప్రకటనకు కాలవ్యవధిని నియమించియున్నందున, పురావస్తు తత్త్వశాస్త్రాన్ని ఆశ్రయించవలసి వచ్చింది.
సాంకేతిక కారణాలను వదిలిపెడదాం.కారణాలు ఏమైనా - ప్రాచీన భాషా స్థితి కావాలన్నాం. లాంఛనప్రాయంగా పొందాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా తెలుగు భాషా స్థితిగతులను గురించి ఆలోచించవలసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే గదా! డబ్బులు ఏమైనా వస్తే, పనిచేయవలసింది తెలుగువారే కదా! అటువంటి ప్రభుత్వం గత కొన్నేళ్లుగా తెలుగు భాషను బాగుపరచడానికి చేపట్టిన ప్రక్రియ అంటూ ఏమైనా ఉందా? ఇప్పుడు మాత్రం తెలుగు మహాసభల పేరిట జరుగుతున్న సంబరం భాషోద్ధరణకు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. కేవలం ఒక సంబరం ద్వారా భాషను ఉద్ధరించటం అయ్యే పని కాదని అందరూ గుర్తు పెట్టుకోవాలి.
విశ్వవిద్యాలయాలు ఈ విషయంలో చాలా మార్పులు తీసుకురావాలి. భాషాభివృద్ధికి గట్టి కృషి చేయాలి. ఇటీవల 'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం' వారు 'ఎంఏ- క్లాసికల్‌ తెలుగు'ను ప్రవేశపెట్టారు. అంటే - ఇంతవరకు ఉన్న 'ఎమ్‌ఏ - తెలుగు' పనికిరాదనా? 'క్లాసికల్‌ తెలుగు'లో ఎమ్‌ఎ ప్రవేశపెట్టడంతో ఈ విషయం రుజువవుతుంది. 'క్లాసికల్‌' ప్రకటన ద్వారా ఒకవేళ డబ్బులు వస్తే, వాటిని కర్పూరంలా కరగబెట్టడానికా? అనే సందేహం కలుగుతుంది.
ఎమ్‌ఏ తెలుగు; ఎమ్‌ఏ క్లాసికల్‌ తెలుగు- రెండు విభాగాల్లో తెలుగు అధ్యాపకుల ఉద్యోగాలు ఏ విభాగం వారికి ఇస్తారు? మాములు పాఠ్యప్రణాళిక స్థాయి చాలదంటే, వాకి ఉద్యోగాలు ఇచ్చినా, భాషకు లాభం లేదనే విషయం అంగీకరించినట్లవుతుంది. 'క్లాసికల్‌' తెలుగు చదివినవాళ్లకే తెలుగుకు సంబంధించిన ఉద్యోగాలంటే - ఇటువంటి ఎమ్‌ఏ ఉండేది ఒకే ఒక విశ్వవిద్యాలయంలో. మిగిలిన విశ్వవిద్యాలయాల్లోని తెలుగుశాఖల పనితీరు సంతృప్తిగా లేదని ఒప్పుకొన్నట్లే గదా! ఇటువంటి నేపథ్యంలో అటువంటి ఎమ్‌ఏలు దేనికి? అనే ప్రశ్న సహజంగానే కలుగుతుంది. ఇంతవరకు బోధిస్తున్న ఆచార్యులే గదా ఈ 'క్లాసికల్‌' తెలుగును కూడా బోధించేది! 'ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కుతా'నన్నట్లు పరిస్థితి తయారయింది. ఇటువంటి వారి ద్వారా 'క్లాసికల్‌' స్థాయి నిలబడుతుందా?
విశ్వవిద్యాలయాల్లోని తెలుగుశాఖలు సంయుక్తంగా ఒక పాఠ్యప్రణాళికను తయారుచేయాలి. భాషాదోషాలు పరిహారమయ్యేలా ముందస్తుగా ఒక విధానాన్ని ఏర్పరచాలి. నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోకుండా పనిచేయాలి. ప్రాచీన స్థాయికోసం పోరాటం సలిపిన విశ్వవిద్యాలయాలు, తెలుగు భాష ప్రాచీన విషయంలో ఎన్ని పరిశోధనలు ప్రారంభించాయి? అలా జరగని పక్షంలో - ఆ హోదా వలన వచ్చే పనిని చేసేవారెవరు? ఆ విషయంలో లోతుపాతులను గురించి చర్చించేవారెవరు?
ప్రభుత్వం ఈ విషయంలో విద్యారంగాన్ని, అందునా - తెలుగు విద్యారంగాన్ని, ప్రక్షాళన చేయడం తప్పనిసరి. ఉద్యోగ నిమిత్తమైన పరిశోధనలను గాక, భాషా సాహిత్యాల సమృద్ధికోసం పరిశోధన జరగాలి. ప్రాచీన స్థాయి విషయంలో 'క్లాసికల్‌' పదానికి సరైన పదాన్ని నిర్ధారించలేని తెలుగువారు ఆ అంతస్తును నిలబెట్టుగలరనే విశ్వాసం పోయింది. విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన లక్ష్యం నేడు ప్రశ్నార్థకమైంది.
అలాగే విశ్వవిద్యాలయాల్లో పరిశోధన రెండు రకాలుగా మారింది. డిగ్రీల తృష్ణ మొదటిది. ఇది ఆర్థికంగా ఫలితాన్నిస్తుంది. రాళ్లు, రప్పలకు ఎదుగుదల లేదుగాని, ఉద్యోగంలో పెరుగుదల సహజం. కాగితాలకే పరిమితమవుతున్న ఈ పరిశోధనలను ప్రోత్సహించడం వల్ల భాషావృద్ధికి జరిగేది అల్పమే అవుతుంది. పరిశోధనలో రెండవది వైయుక్తికం. వాళ్లు ఆత్మతృప్తి కోసం ఇటువంటి వాటిని చేస్తుంటారు. మొదటిరకం పరిశోధనకు అంతకు ముందువారి సిద్ధాంత వ్యాసాలు ప్రచురితమైనా, అప్రచురితమైనా - సహాయకాలు. అందువల్ల తీసి తీసి రాసేదే 'థీసిస్‌' అనే పరిభాష వరకూ వచ్చింది. రెండవ రకం పరిశోధనలో అంతర్జాలం, వికీపీడియా సమాచారం నుంచి తీసి తీసి రాస్తున్నవే! అంతర్జాలం, వికీపీడియాల్లో యథారీతిగా తమకు తోచిన విధంగా సమాచారాన్ని ఆయా వ్యక్తులు చేర్చుతుంటారు. ఈ విషయాల్లోని అధికారికం ఎంత అనే విషయాన్ని ప్రశ్నించినవారు గాని, పరిశీలించినవారు గాని లేరు. అటువంటి ప్రణాళికగాని, సంస్థ గాని లేదు. అయినా, ఆ సమాచారాన్ని వాస్తవమని నమ్మడం ఎంతవరకు సబబుగా ఉంటుంది? వాటి ద్వారా ఏర్పడే రచనలు, సిద్ధాంతాలు ఎలా ఉంటాయో తెలియంది కాదు. అయినా, దీనిని ఆపేవారు, పరిశీలించే విధానం, సంస్థ గాని లేవు. తెలుగు భాషను గురించి పట్టని ప్రభుత్వానికి విశ్వవిద్యాలయానికి ఈ విషయం పడుతుందా? సంస్థలు పెరుగుతున్నాయి. అయినా భాషాధ్యయనంలో ప్రాముఖ్యం, ప్రాధాన్యం, ప్రాబల్యం లోపిస్తున్నాయి. ఇటువంటి వాతావరణంలో ప్రాచీన, విశిష్ట, శ్రేష్ఠ పదాల్లో ఏది ఉత్తమం అనే విషయం - 'శాస్త్రీయమా' అనే సంగతికి సంబంధించింది. ప్రజల నిధులను వినియోగం పేరిట దుర్వినియోగం చేయడం కంటే, సద్వినియోగ మార్గాలను సుసాధ్యం చేస్తారని తలుద్దాం.

No comments:

Post a Comment