Wednesday 19 December 2012

అపోహలు

యుగాంతంపై...
సర్వత్రా ఉత్కంఠ!


మన బతుకులు మూణ్ణాళ్ల ముచ్చటేనా...? భూమి మీద అందరికీ నూకలు చెల్లాయా...? మరో రెండు రోజుల్లో ప్రపంచం మటాష్ అయిపోతుందా... ? యుగాంతం దగ్గర పడిందా...? డిసెంబరు 21 వస్తుందంటే వణుకు పుడుతోందా...?
యుగాంతం.... ఇప్పుడు అందరినీ వెంటాడుతోన్న భయం ఇదొక్కటే. మరో మూడు రోజుల్లో భూమిపై ఉన్న సకల జీవ జాలం నశించి పోతుందన్న ప్రచారం అందరినీ వణుకు పుట్టిస్తోంది. ఈ ప్రచారం సంగతి తెల్సుకోవాలంటే ముందుగా మాయన్ నాగరితక.... వారి కేలెండర్ గురించి తెల్సుకోవాలి. ఎందుకంటే మాయన్లు ఒక్కరే 2012లో యుగాంతం అవుతుందని చెప్పుకొచ్చారు.
మాయన్ నాగరికత....అసలు ఎవరీ మాయన్లు? దేవతల శిల్పి మయుడి సంతతే మాయన్లు అనేది కొందరి వాదన. అమెరికాలోని మెక్సికొ ప్రాంతంలో వీరి నాగరికత ఒకప్పుడు ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఎందుకంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం ఒకప్పుడు భూమి ఒకే చెక్కగా ఉండేది. ఆ తర్వాత వచ్చిన భౌగౌళిక మార్పులతో మాయన్లు ఉన్న భూభాగం విడిపోయింది. అంతేకాదు భరత భూమిలో ఉన్న మిథిల నుండి విడిపోయి భూభాగమే మాయన్ల స్వస్థలమనేది మరికొందరి వాదన. దీనికి వాళ్లు చెప్పేది కూడా మరొకటి ఉంది. భారతం ప్రకారం మయుడు కేతుమాల దేశానికి చెందిన వాడు. భూమి విడిపోయిన తర్వాత ఇప్పుటి గ్వాటిమాలే అప్పటి రాజ్యమంటున్నారు. క్రీస్తు పూర్వం 2500....250ల మధ్య కాలాన్ని మయనుల స్వర్ణ యుగమంటారు.700 సంవత్సరాల పాటు అవిచ్చిన్నంగా కొనసాగిన మయనుల సామ్రాజ్యం హఠాత్తుగా ఎలా మాయమైందో ఇప్పటికీ చరిత్రకారులు చెప్పలేక పోతున్నారు. ఇక అసలు విషయానికొస్తే....మాయన్ల క్యాలెండర్‌లో ఆగష్ట్‌తో మొదలు అవుతుంది. ప్రతి నెలలో 11వ తేదిని వారు మొదటి తారీకుగా లెక్కేసేవారు. అంటే వారి పంచాంగం 11వ తేదీతో మొదలయ్యేది. ఇక ఒక సంవత్సరంలో వారికి 260 రోజులు మాత్రమే ఉండేవి. ప్రతి 5126 సంవత్సరాలకు ప్రళయం వస్తుందనేది మాయన్ల సిద్ధాంతం. వారి లెక్క ప్రకారం ఇప్పటికీ 5 సార్లు ఇలా జరిగిందట. ఆరోసారి ఈ సంవత్సరం డిసెంబర్ 21తో ముగుస్తుందట. ఇప్పటికీ తమ సిద్ధాంతమే నిజమని బలంగా నమ్ముతున్నారు మాయన్లు. దానికి వారు చెప్పే లాజిక్ ఒక్కటే. మన లెక్క ప్రకారం సంవత్సరానికి 360 రోజులు. మాయన్ల లెక్క ప్రకారం సంవత్సరానికి 260 రోజులు. అంటే ప్రతి సంవత్సరానికి వంద రోజుల తేడా ఉంది. మాయన్లు చెప్పే దానిని బట్టి గతంలో వచ్చిన ప్రళయం తేదీ మొదలు ఇప్పటి వరకూ ప్రతి ఏడాది వంద రోజులు కలుపుకుని పోతే మొత్తం 5126 రోజులు పూర్తి అవుతాయట. ఆ రోజు డిసెంబర్ 21వ తేదీ అట. అందుకే తమ క్యాలెండర్ ఈ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీతో ముగుస్తుందనీ చెబుతున్నారు. ప్రళయం ముగిశాక.... మళ్లీ తమకు కొత్త క్యాలెండర్ వస్తుందంటున్నారు. అయితే ఎలాంటి విధ్వంసం జరుగుతుందనేది వారి సిద్ధాంతంలో కానీ.... మత గ్రంథాల్లోగానీ వివరించలేదు. వీరి వాదనలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియదు గానీ... మొత్తానికి మాయన్ల సిద్ధాంతం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.

టెన్షన్ పెడుతున్న నిబురు?
మాయన్ల సంగతి కాసేపు పక్కన పెడితే....మరొక సిద్ధాంత కూడా యుగాంతాన్ని కళ్లముందు చూపిస్తోంది. అది నిబురు గ్రహ శకలంలో వస్తుందని చెబుతున్నారు. అనంత విశ్వంలో అనేక గ్రహాలు ఉన్నాయి. అనేక వాటి నుంచి విచ్చిన్నమైన పలు గ్రహ శకలాలు విశ్వ వ్యాప్తంగా ప్రయాణిస్తుంటాయి. తమ దిశకు అడ్డుగా ఉన్న వాటితో ఢీ కొంటాయి. కొన్ని దగ్గరకు వచ్చి పోతుంటాయి. వాటి వల్ల గ్రహ శకలంలో, దాని సమీపానికి వచ్చిన గ్రహంలో విపరీతమైన మార్పులు వస్తుంటాయి. ఇది విశ్వంలో సహజంగా జరిగే పరిణామం. ఇక నిబురు విషయానికొస్తే.... అనంత విశ్వంలో ప్రయాణిస్తున్న ఓ భారీ గ్రహం. దీనికి ఏడు ఉప గ్రహాలు కూడా ఉన్నాయి. డార్క్ బ్లాక్ కలర్‌లో ఉండే నిబురు గ్రహం ఇప్పుడు మన భూమి దిక్కుగా ప్రయాణిస్తోంది. ఈ విషయాన్ని 1982లో నాసా ధృవీకరించింది. 1983లో ఇన్‌ఫ్రా రెడ్ ఆస్ట్రోనామికల్ శాటిలైట్‌ని నాసా ప్రయోగించింది. దీని ద్వారా నిబురు గమనాన్ని, వేగాన్ని లెక్కిస్తోంది. భూమి వైపుగా ప్రయాణిస్తోన్న నిబురు గ్రహం మన సౌర కక్షలోకి ప్రవేశించినప్పుడు విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి. అంటే సౌర కక్షలో దాదాపు 60 నుంచి 70 ఆస్ట్రోనాటికల్ యూనిట్ల పరిధిలోకి ఏదైనా గ్రహం కానీ, గ్రహశకలం కానీ ప్రవేశించినప్పుడు దాని వల్ల సమీప గ్రహంలో విధ్వంసం జరుగుతుంది. ఇప్పుడు నిబురు కూడా దాదాపు 60 ఆస్ట్రోనాటికల్ యూనిట్ల పరిధిలోకి వస్తోంది. అంటే దాదాపు జూపిటర్ గ్రహ కక్షలోకి వస్తోంది. మన సౌర వ్యవస్తలో భూమి మూడవ గ్రహం. దాని తర్వాత గురు గ్రహం, దాని తర్వాత బృహస్పతి గ్రహాలు ఉన్నాయి. అయితే నిబురు జూపిటర్ కక్షలోకి వస్తోంది. నిబురు గ్రహానికి ఏడు ఉప గ్రహాలు ఉన్నాయి. సౌర వ్యవస్తలోని గ్రహాల కక్షలకు దాదాపు 30 డిగ్రీల యాంగిల్లో నిబురు ప్రయాణం సాగుతోంది. దీని వల్ల మన గ్రహ కక్షల విచ్చిన్నం జరుగుతుంది. అంతేకాకుండా నిబురు ఉప గ్రహాల్లోని ఏడవ ఉప గ్రహం దాదాపు భూమి పరిమాణంలో ఉందట. నిబురు ప్రయాణించేటప్పుడు దాని ఏడవ ఉపగ్రహం భూమి కక్షలోకి వస్తుందట. దీంతో భూ అయస్కాంత క్షేత్రంలో విపరీతమైనా మార్పులు వస్తాయి. అంతేకాదు ఈ ఉప గ్రహం ఎరుపు రంగులో ఉందనీ....భూమి, సూర్యుల మధ్య ఇది వచ్చినప్పుడు ఆకాశంలో రెండు సూర్యులు ఉన్నట్లు కనిపిస్తాయట.
అంతేకాదు భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు వచ్చినప్పుడు సూర్యుడి నుంచి అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమిని తాకుతాయి. సౌర తుపాను భూమిని నేరుగా తాకుతుంది. ఎందుకంటే భూ అయస్కాంత క్షేత్రం బలహీన పడటం వల్ల సౌర తుపాను అడ్డుకునే వ్యవస్త బలహీన పడతుంది. సౌర సునామీ నేరుగా భూమిని తాకుడంతో ఓజోన్ పొర కరిపోయి.....భూమి మీదున్న నీరు ఆవిరి అవుతుందనీ....జీవజాలం నాశనం అవుతుందనీ అంచనా వేస్తున్నారు. మరో అంశం ఏంటంటే....2007లో దక్షిణ ధృవం దగ్గర ఉన్న టెలీస్కోప్‌ నుంచి నిబురు గమనాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక 2009 మే 15వ తేదీన దక్షిణ ధృవ ప్రాంతంలో టెలీస్కోప్‌తో స్పష్టంగా చూడగలిగారు. ఇక మే 2011వ సంవత్సరంలో నిబురు గమనాన్ని నేరుగా చూడగలిగారు. అయితే నిబురు గ్రహ ప్రయాణం ఎన్నాళ్లు ఉంటుంది. దీనికి కొందరు శాస్త్రవేత్తలు ఓ థియరీ చెబుతున్నారు. డిసెంబర్ 21వ తేదీన భూ కక్షలోకి అతి దగ్గరగా వచ్చే నిబురు గ్రహ పయనం.....ఫిబ్రవరి 12వ తేదీ....2013 నాటికి సూర్యుడు, భూమి మధ్య ప్రయాణిస్తుందంటున్నారు. దీనివల్ల భూమిపై విపరీత పరిణామాలు జరుగుతాయనీ, భారీ భూకంపాలు సంభవిస్తాయనీ.....మెగా సునామీలు భూమిని అతలాకుతలం చేస్తాయంటున్నారు. ఈ స్తితి దాదాపు జులై ఒకటవ తేదీ 2014 దాకా ఉంటుందనీ....ఆ తర్వాత మన సౌర వ్యవస్తకు దూరంగా నిబురు వెళ్లి పోతుందంటున్నారు. దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం అట్లాంటిస్ మునిగి పోయినప్పుడు సౌర వ్యవస్తలో ఇలాంటి పరిణామాలే జరిగాయనీ. నోహ ఉప్పెనకు కూడా ఇలాంటి గ్రహస్తితే కారణమంటున్నారు. ఇప్పుడు కూడా భారీ సునామీలు, భూకంపాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. సముద్ర తీర నగరాలకు ముప్పు తప్పదనీ....పీఠ భూమి ప్రాంతాలు, అగ్ని పర్వత ప్రాంతాలకు ఉపద్రవం ఉందంటున్నారు. నిబురు ప్రభావంతో ప్రపంచంలోని దాదాపు రెండింటికి మూడొంతుల జీవజాలం నాశనం అవుతున్నారని చెప్పుకొస్తున్నారు. దాదాపు ఆరు నెలల పాటు భూమిపై ప్రకృతి విలయ తాండవం చేస్తుందని చెప్పుకొస్తున్నారు.

ఇదీ నిబురు సంగతి. అంటే నిబురు వల్లే ఇంత ప్రమాదం ఉందా అంటే....అదొక్కటే కాదు మరొక ఉపద్రవం కూడా ఉందని చెబుతున్నారు కొందరు శాస్త్రవేత్తలు. అదేమంటే భూ ధృవాలు మారిపోవడం. అంటే పూర్తిగా మారిపోవు. స్తానభ్రంశం చెందుతుంది. అంతేకాదు మరొక భయం ఎల్లో స్టోన్ అగ్ని పర్వతం.

ఒకే సరళరేఖపై తొమ్మిది గ్రహాలు
డిసెంబర్ 21వ తేదీ 2012నాడు మన సౌర కుటుంబంలోని తొమ్మిది గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వస్తాయి. దీంతో గ్రహాల మధ్య ఆకర్షణ, వికర్షణలు బలంగా ఉంటాయి. ఇతర గ్రహాల సంగతి ఏమోగానీ....భూ గ్రహం అల్లకల్లోలం అవుతుంది. మరొక అంశం ఏంటంటే....తీవ్ర భూ కంపాల వల్ల భూమి కక్షలో మార్పు వస్తుంది. దాదాపు 20 నుంచి 30 డిగ్రీల పక్కకు భూమి జరుగుతుంది. అంటే భూమి ఉత్తర, దక్షిణ ధృవాల్లో పక్కకు జరుగుతాయి. ఈ విషయాన్ని కొందరు నాశా శాస్త్రవేత్తలు కూడా ధృవీకరిస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఇలా ధృవాల్లో విపరీత మార్పుల వల్ల....పెను సునామీలు సంభవిస్తాయి. భారీ భూకంపాలు వస్తాయి. ఈ పోలార్ షిఫ్టింగ్ ఇప్పుడేమీ కొత్త కాదనీ....దాదాపు ప్రతి 7 లక్షల 80 వేల సంవత్సరాలకు భూ అయస్కాంతపు పొరలో మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈసారి అలా జరుగుతుందా అంటే దీనికి సరైన సమాధానం ఎవరూ చెప్పడం లేదు. మొన్న జపాన్‌లో భారీ భూకంపం, ఆ తర్వాత సునామీ సంభవించినప్పుడు...భూమి ధృవాల్లో దాదాపు పది అంగుళాలు జరిగినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరొక అంశం ఏంటంటే....ధృవాల్లో మార్పులు వచ్చినప్పుడు....భూ భ్రమణం కొంచెం సేపు ఆగి పోతుంది. దీనికి కారణం.... భూమి అంతర్భాంలోని కోర్ స్తిరంగా ఉండటం. దీనివల్ల అగ్ని పర్వతాలు బద్దలు అవుతాయి. సముద్ర గర్భంలో భూ పొరల్లో ప్రకంపనలు పుట్టి.... ఇంతకు ముందు ఎరుగని స్థాయిలో సునామీలు సంభవిస్తాయి. దీంతో అధిక భూభాగాన్ని సముద్రపు నీరు మింగేస్తుంది.

ఎల్లోస్టోన్ టెన్షన్ అదేరోజు....
ఇక భూమికి పట్టుకున్న మరో భయం ఎల్లో స్టోన్ అగ్నిపర్వతం. అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఎప్పుడూ వేడినీటి బుగ్గలను విరజిమ్ముతూ ఉంటుంది. ప్రతి 6.50 లక్షల సంవత్సరాలకు ఎల్లోస్టోన్ అగ్ని పర్వతం బద్దలవుతుంది. డిసెంబర్ 21వ తేదీ తర్వాతే ఎల్లోస్టోన్ ఎందుకు బ్లాస్ట్ అవుతుంది....దీనికి రీజన్ చెబుతున్నారు కొందరు జియో సైంటిస్టులు. ఎల్లో స్టోన్ అగ్ని పర్వతం బద్దలైనప్పుడు భారీ మొత్తంలో బూడిద ఆకాశంలోకి విరజిమ్ముతుంది. సూర్యుడికి, భూమికి మధ్య బూడిద మేఘాలు అడ్డుగా ఉంటాయి. అంటే సూర్య కిరణాలు భూమికి సోకవు. దీంతో భూమి చల్లబడుతుంది. అంటే దాదాపు మంచు యుగం స్థితి వచ్చే ప్రమాదం ఉంది.

నాస్ట్రడమస్ ఏమన్నారు?
ఇక ప్రముఖ కాలజ్నాన వేత్త నోస్ట్రడామస్ కూడా యుగాంతం గురించి ప్రస్తావించారు. ఆకాశంలో రెండు సూర్యులు కనిపిస్తారనీ....ప్లానెట్ ఎక్స్ పేరుతో ఓ గ్రహం భూమిని అతలాకుతలం చేస్తుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ప్రపంచ ప్రళయంపై నోస్ట్రడామస్ తన పుస్తకంలో కొన్ని బొమ్మలు గీశాడు. వాటి ఆధారంగా యుగాంతంపై వస్తుందన్న ప్రచారం జరిగింది.

‘డూమ్స్ డే’’’‘’ పేరుతో లబ్దిపొందడమేనా?
డిసెంబర్ 21వ తేదీన నిజంగా యుగాంతం అవుతుందా....భూమి బద్దలు అవుతుందా....అంటే అది పచ్చి అబద్దం. జ్యోతిష్య పరంగా చూసుకున్నా.....సైన్స్ పరంగా చూసుకున్నా యుగాంతానికి ఏ ఆధారం లేదు. కేవలం కొందరు డూమ్స్ డే పేరుతో లబ్ది పొందాలని చూస్తున్నారని చెబుతున్నారు. అంతా ట్రాష్. ఎందుకంటే టెక్నాలజీ స్పీడ్ అందుకుంటున్న ఈ రోజుల్లో ఎలాంటి ఉప ద్రవాన్ని అయినా ఎదుర్కునే శక్తి మానవ మేథస్సుకు ఉంది. గ్రహ శకలం దారి తప్పించగల సత్తా ఉంది. నిజంగా నిబురుతో ప్రమాదం ఉందంటే ఖచ్చితంగా దాన్ని ఆకాశంలోనే బద్దలు చేయగల దమ్ము మనకుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చెబుతోంది. అంతేకాదు ఎల్లోస్టోన్న అగ్ని పర్వతం ప్రతి రోజూ వేడి సెగలు జిమ్ముతూనే ఉంటుంది. అంతేకాదు ఒకవేళ అది బద్దలయితే దానినుంచి వచ్చే బూడిద ప్రపంచాన్ని మొత్తం కప్పేసే అవకాశం లేదు. కాకపోతే కొంత ప్రాంతంలో దాని ప్రభావం ఉండొచ్చు. ఇక ధృవాల మార్పిడి అనేది ఇప్పట్లో తేలే అంశం కాదు. ఎందుకంటే దీనిపై ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇక యుగాంతం, ప్రళయం అంటూ గతంలో చాలా మంది పిచ్చి కూతలు కూశారు. 1806లో బ్రిటన్‌లోని లీడ్స్‌లో ఓ ప్రచారం జనాన్ని హడలెత్తించింది. క్రీస్తు వస్తున్నాడు అంటూ ఓ కోడి గుడ్లు పెడుతుందనీ....ఆ తర్వాత ప్రళయం వస్తుందన్న ప్రచారం జరిగింది. అయితే కొందరు మత ప్రచారకులు డబ్బులు సంపాదించడానికే ఇలా ప్రచారం చేశారని తేలింది. ఇక 1843 ఏప్రిల్ 23న కొందరు క్రైస్తవ మత ప్రచారకులు యుగాంతంపై ప్రచారం చేశారు. మిలెరైట్స్ అనే ప్రచారకుడు ఓ అబద్దపు ప్రచారంతో భారీ మొత్తంలో డబ్బులు సంపాదించాడు. 1843వ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన క్రీస్తు భూమిపై అవతరిస్తాడనీ...అంతకు ముందు ప్రళయం వస్తుందనీ ప్రచారం చేశాడు. అతని మాటలు నమ్మి చాలా మంది ఆస్తులు అమ్ముకున్నారు. భక్తిలో మునిగి పోయారు. అయితే ఆ రోజు ఏం జరగక పోవడంతో అందరికీ మిలెరైట్స్‌పై కోసం వెతికారు. ఎక్కడా అతను కానీ, అతని శిష్యులు కానీ ఎక్కడా కనిపించలేదు. మార్మన్ శాఖ వ్యవస్తాపకుడు....మార్మన్ వాక్యాలు మరో దుమారం రేపాయి. 1835లో ఫిబ్రవరిలో సమావేశం ఏర్పాడు చేసి మరో 56 సంవత్సరాల్లో ప్రళయం వస్తుందంటూ ప్రచారం చేశాడు. 56 సంవత్సరాల తర్వాత మార్మన్ చనిపోయాడు. కానీ ప్రళయం రాలేదు. ఆయన మాటలు నమ్మిన వాళ్లు రోడ్డున పడ్డారు. ఇక 1910లో హెలీ తోకచుక్క జనాన్ని హడలెత్తించింది. ఎందుకంటే హెలీ తోకచుక్క విష వాయువుల్ని చిమ్ముతుందనీ...దాంతో ప్రపంచంలోని సగానికిపైగా జనాభా మటాష్ అయిపోతారనీ కొందరు చెప్పుకొచ్చారు. చివరికీ అదీ కూడా అబద్దమని తేలిపోయింది. ఇక పాట్ రాబర్ట్‌సన్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు 1982లో ప్రపంచం అంతం అయిపోతుందంటూ ఓ టీవీ చానల్‌లో చెప్పుకొచ్చాడు. అయితే అది నిజం కాకపోవడంతో అతన్ని జైల్లో పెట్టారు. మరీ దారుణమైన విషయం మరొకటి ఉంది. 1997 హెలీ బాప్ తోకచుక్క కనిపించింది. అయితే దాని చుట్టూ గ్రహాంతర వాసుల తిరుగుతున్నారన్న వదంతులు వచ్చాయి. వీటిని ప్రచారం చేసింది హెవెన్స్ గేట్ అనే తెగ ప్రజలు. గ్రహాంతర వాసులు భూమిపై దాడులు చేస్తారనీ...భూమిని నాశనం చేస్తారన్న ప్రచారం చేశారు. అయితే అది అబద్దమని తేలడంతో హెవెన్స్ గేట్ తెగకు చెందిన 39 మంది సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. ఇక వై టూ కె సంగతి సరేసరి. 1900 సంవత్సరానికీ, రెండు వేల సంవత్సరాల మధ్య తేడా కనిపెట్టడంలో కంప్యూటర్లు విఫలం అయ్యాయి. అంటే 1999 డిసెంబర్ 31వ తేదీ తర్వాత వచ్చే తేదీని గుర్తిండంలో కంప్యూటర్లు విఫలం అయ్యాయి. దీంతో కంప్యూటర్లపై నడిచే వ్యవస్తలు నాశనం అయ్యి....యుగాంతం వస్తుందన్న ప్రచారం జరిగింది. దీన్ని కొందరు ప్రచారం చేశారు. నోస్ట్రడామస్ కూడా ఇదే విషయం చెప్పాడనీ....1999లో ప్రళయం వస్తుందంటూ ఊదరగొట్టారు. ఇ రెండు వేల సంవత్సరంలో ప్రపంచం నాశనం అవుతుందని కొందరు చెబితే.....2006లో అని కొందరు...కాదు కాదు 2008లో అని కొందరు ఎవరి ఇష్టం వచ్చిన భాష్యం చెప్పుకొచ్చారు. కానీ అన్నీ ప్లాప్ స్టోరీలేనని తేలిపోయాయి. ఇక 2011 అక్టోబర్ 1వ తేదీన భారీ భూకంపం వస్తుందని హరోల్డ్ క్యాంపింగ్ జరిగింది. ఆ రోజు కూడా అయిపోయింది. అంతా అబద్దమని తేలిపోయింది. ఇక మన జ్యోతిష్యులు కూడా యుగాంతాన్ని తోసిపుచ్చుతున్నారు. మాయన్ల క్యాలెండర్ నమ్మొద్దనీ...వారికి అప్పట్లో ఉన్న టెక్నాలజీ ప్రకారం డిసెంబర్ 21వ తేదీ వరకే క్యాలెండర్ రూపొందించారనీ చెబుతున్నారు. సిద్ధాంతాల పేరుతో అనవసర రాద్ధాంతం చేస్తూ జనాన్ని భయపెడుతున్నారని చెబుతున్నారు.

ఇదీ సంగతి.... అనవసర భయాలు పెట్టుకోవద్దు. పుస్తకాలు, సినిమాలు చూసి మైండ్ బ్లాంక్ చేసుకోవద్దు. యుగాంతం కాదు.....ప్రళయం రాదు....కాకపోతే మానవ వికృత ఆలోచనలు తగ్గించుకుంటే మంచింది. ప్రకృతికి విరుద్ధంగా వెళితే ఎప్పటికైనా ప్రమాదమే. గ్లోబల్ వార్మింగ్ తగ్గించుకుంటే వాతావరణం మామూలుగా ఉంటుంది. మన నాశనం మన చేతుల్లోనే ఉంది.

No comments:

Post a Comment