Sunday 30 December 2012

 
మృత్యు క్రీడకు బలి
 
మృగత్వాన్ని ధిక్కరించిన ఆ ధీర వనిత ఇక లేదు. యావత్ భారతాన్ని కన్నీటి ధారల్లో ముంచి ఆ సాహసి తుదిశ్వాస విడిచింది. మృగాలు ఆడిన పాశవిక మృత్యుక్రీడలో ఒంటరిగా బలైపోయింది. అలసి సొలసి శాశ్వత నిద్రలోకి జారుకుంది. ఒక్కొక్క అవయవం కూలిపోతూ సోలిపోతుంటే హాస్పిటల్ బెడ్మీద అచేతనంగా ఒరిగిపోయింది. పోతూ పోతూ నవనాగరిక సమాజం మీద తుపుక్కున ఉమ్మేసి పోయింది. తలాకొంచెం సిగ్గుపడండని అసభ్య సమాజాన్ని పరిహసించి పోయింది.

ధామినీ! నిర్భయ! జ్యోతి! పేరేదైతే ఏంటి తల్లీ! క్షమించు! మృగాళ్ల రాజ్యంలో బలైన ఒంటరి లేడిపిల్ల కొన్నెత్తుటి మరణం సభ్య సమాజాన్ని పరిహసించింది. మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రి కన్నీటి నివాళులు అర్పించిన ఆ క్షణం కంటిరెప్ప మీద తల్లి, చెల్లి, కూతురు కనిపించింది. ఎనిమిది మంది స్పెషలిస్టుల వైద్యం బృందం ఏమీ చేయలేని నిస్సహాయులుగా మిగలారంటే.. మృగాళ్ల కామక్రీడ ఎంత నీచంగా ఉందో ఎంత హేయంగా ఉందో అర్ధమవతోంది తల్లీ! పేగులు కాలిపోయి ఒక్కో అవయవం కూలితుంటే నీకు బతకాలన్న తపన ఏ స్థాయిలో ఉందో అవగతమవుతోంది బిడ్డా!

ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కామాంధుల కండకావరానికి ఆ జ్యోతి ఆరిపోయింది. హస్తిన కీచకపర్వంలో మృత్యుకోరల్లోకి వెళ్లి 13 రోజుల పాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఆ ధీర వనిత కన్నుమూసింది. మానవ మృగాల దాడిలో తీవ్రంగా గాయపడ్డా మనోధైర్యాన్నిమాత్రం వీడలేదు. నాకు బతకాలనుంది. బంగారు భవిష్యత్తును బాటలు వేసుకోవాలనుందంటూ.. జీవితంపై తనకున్న ఆశని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ దుర్మార్గుల కర్కశత్వాన్ని భరించలేకపోయింది. డిసెంబర్16నాటి పీడకల భవిష్యత్తులో బాధిస్తుందనుకుందో.. లేక తన జీవితంతో చెలగాటమాడిన వారిపై అసహ్యం, వికారంతో అవస్థపడిందో.. కారణమేదైనా... చేయని తప్పుకు నరకయాతన అనుభవించి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. మృత్యువు ఆమెను కబళించినా... ఆమె స్థానాన్ని చరిత్రలో శాశ్వతంగా పదిలంచేసింది. ఆమె మనోనిబ్బరం తాను బాధితురాలు కాదు యోధురాలినని చాటింది.

డిసెంబర్16 నాటి ఘటన యావత్భారతావనిని కదిలించింది. పేగుబంధం కాదు. ఏ రక్త సంబంధమూ లేదు. దూరపు చుట్టమా అంటే అదీ కాదు. ఊరేదో పేరోదో తెలియదు. కనీసం ముఖ పరిచయం కూడా లేనివాళ్లే అంతా. అయినా అందరికీ ఆమె బంధువే. ఒకరికి కూతురు, మరొకరికి సోదరి. ఒక్కమాటలో చెప్పాలంటే భారతావనికి ఆమె వీరపుత్రిక.

కీచకపర్వంలో ఆమెకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా జాతియావత్తు ఉప్పెనలా విరుచుకుపడింది. కన్నవారు, తోడబుట్టిన వారు, స్నేహితుల బాధకన్నా ఎముకలు కొరికే చలిలో న్యాయం చేయమంటూ నిరసన కొనసాగిస్తున్నవారి బాధ ఏమాత్రం తీసిపోదు.

యువతలో వచ్చిన కదలికను చూసి పాలకులు ముఖ్యంగా పోలీసులు గజగజలాడుతున్నారు. దేశంలోని ప్రతి ఒక్క నగరంలో యువతీయువకులు, చివరికి వృద్ధులు కూడా అత్యాచార ఘటనను ఖండిస్తూ సర్కారు తీరును కడిగి పారేశారు. ఇంతకీ వారంతా ఉప్పెనలా ఎగిసిపడటానికి కారణమేంటి?

కారణముంది. ఢిల్లీలో గ్యాంగ్రేప్అనంతర నిరసనలు దేశంలో సామాన్యుల గుండెల్లో గూడుకట్టుకున్న భయాందోళనలకు కారణముంది! రేపు నా తల్లికో, నా కూతురుకో, నా అక్కకో చెల్లెకో ఈ ప్రమాదం రాదా అన్న భయముంది! ప్రస్తుతం యువతీయువకుల్ని వారి తల్లిదండ్రుల్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. తమను తరిమి తరిమి కొడుతున్న పోలీసులైనా ఇలాంటి ఘటనలు జరగవన్న హామీ ఇస్తారా? లేదు పోలీసు బాసులు కూడా ఇలా ఉండండీ అలా చేయకండని సుద్దులు చెప్తున్నరే కానీ మేమున్నామన్న హామీ ఇవ్వలేకపోతున్నరు. అందుకే ఊరేదో, పేరేదో తెలియకపోయినా జనం బాధితురానికి హృదయానికి హత్తుకున్నరు. ఆమె చనిపోయిందన్న వార్త విని గండెలు పగిలేలా ఏడుస్తున్నరు...స్పాట్
సింగపూర్లో కన్నుమూసిన మన ఆడపడుచు మరణం వృథా కాదని రాష్ట్రపతి చేసిన ప్రకటన నిజం కావాలి. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే న్యాయపరమైన లొసుగుల్ని తొలగించి కఠిన చట్టాలు తీసుకురావాలి. అధికారం, అర్థబలం, అంగబలం ఉన్నవారైనా లేనివారైనా ఒకే చట్టం అమలుచేయాలి. ఇదే జవాబుదారీ ఇప్పుడు జనం కోరుకుంటున్నరు.

No comments:

Post a Comment