Monday 24 December 2012

మీడియాలో ప్రజల భాష


 మీడియాలో

ప్రజల భాష

ప్రతిబింబించాలి

  • తెలుగుకు ఆధునిక సంస్కరణలు
  • కొత్త పదాల సృష్టికి వ్యవస్థ అవసరం
  • జర్నలిష్టుల సదస్సులో సంపాదకులు
ప్రజలు మాట్లాడుకునే భాష పత్రికలు, టివిలలో ప్రతిబింబించాలని పలువురు సంపాదకులు చెప్పారు. తెలుగు భాషా పరివ్యాప్తిలో, ప్రయోగాలలో మీడియా పాత్ర విశిష్టమైందని తెలిపారు. పాత్రికేయులు భాషా పరమైన తప్పొప్పులు సరిచేసుకోవడానికి శిక్షణా తరగతులు అవవసరమని అన్నారు. తెలుగు భాషను పరిరక్షించుకుంటూనే ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు తేవాలని సూచించారు. ఆంగ్ల పదాలను తెలుగులో అనువదించడానికి మంచి ప్రయోగాలు నిర్ణయించడానికి ఓ వ్యవస్థ అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ (ఎపియుడబ్ల్యూజె) ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ 'వార్తా మాధ్యమాలు-తెలుగు భాష తీరుతెన్నులు'అనే అంశంపై యూనియన్‌ అధ్యక్షులు డి సోమసుందర్‌ అధ్యక్షతన సదస్సు జరిగింది. పలువురు పత్రికా సంపాదకులు, సీనియర్‌ పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సదస్సులో వచ్చిన అంశాలను సంకలనం చేసి జనవరి మొదటి వారంలో పుస్తకాన్ని తీసుకొస్తామని సోమసుందర్‌ చెప్పారు.
తెలుగు భాషా వికాసానికి కృషి : తెలకపల్లి రవి

ఈనాటి సమాజంలో భాషా సంస్కరణలకు వేదికగా మీడియా ఉందని ప్రజాశక్తి సంపాదకులు తెలకపల్లి రవి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాషకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. భాషా పరిరక్షణకు ప్రభుత్వం నిర్దిష్టంగా చేస్తున్నది చాలా పరిమితమని, మీడియా పరంగానైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. భాషా పరిరక్షణకు, వికాసానికి కృషి చేయాలని కోరారు. తెలుగు పదసంపద పుష్కలంగా ఉందని, దానికి పరిమితులు కూడా ఉన్నాయని చెప్పారు. సామాజికంగా, సాంకేతికంగా భాషలో అనేక మార్పులు వచ్చాయన్నారు. ప్రజాస్వామికంగా ప్రజల భాషను స్వీకరించినప్పుడే అది మెరుగవుతుందని అన్నారు. తెలుగు భాషోద్యమంలో పురోగామి దృష్టితోపాటు తిరోగామి దృష్టితో చూస్తున్నవారూ ఉన్నారని చెప్పారు. పత్రికలకు ఏకసూత్రత ఉండదని చెప్పారు. చారిత్రకంగా తెలుగు భాష ఎప్పుడూ ప్రాకృతం, సంస్కృతం, ఉర్దూ, ఇప్పుడు ఆంగ్లంతో మిళితమై ఉందని వివరించారు. ఆధునిక భాషలో సామాజిక ఔచిత్యాన్ని, ప్రామాణికతను చేర్చాలని సూచించారు. వాడుకభాష పత్రికలకు పనికిరాదని గతంలో చెప్పినపుడు గిడుగు, గురజాడ పోరాడి ఆచరణలో చేసి చూపించారని గుర్తు చేశారు. ప్రజల భాషను శ్రామిక భాషగా సరళంగా మార్చిన ఘనత వామపక్ష పత్రికలకే చెందుతుందన్నారు. ప్రజల భాషకు ప్రజాశక్తి, విశాలాంధ్ర విశేషంగా సేవ చేశాయన్నారు.
తెలుగు జర్నలిస్టుల శిక్షణ కేంద్రం : కె శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌లో ఎకరన్నర స్థలంలో జర్నలిస్టుల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని విశాలాంధ్ర సంపాదకులు, ఎపియుడబ్ల్యూజె నాయకులు కె శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు. పత్రికల్లో వచ్చే తప్పులను అధిగమించడానికి కృషి చేయాలన్నారు.
పాఠకుడి అజ్ఞానానికి పత్రికలదే బాధ్యత : వరదాచారి

పాఠకుడి అజ్ఞానానికి పత్రికలదే బాధ్యత అని వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు జిఎస్‌ వరదాచారి చెప్పారు. తప్పుడు పదాలు ప్రచురించడం వల్ల పాఠకులు అదే నిజమనుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కొత్త పదాలు ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెచ్చి పాత్రికేయులకు అందించాలని సూచించారు. ప్రాచీన పదాలు, ఆధునిక పదాలను గ్రంథస్తం చేయాలని కోరారు. ప్రెస్‌ అకాడమి, తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం సమన్వయ పరిచే విధంగా ఓ కమిటీ ఉండాలని చెప్పారు.
భాషపై పట్టు బలహీనపడుతోంది : ఐ వెంకట్రావు

పాత్రికేయుల్లో తెలుగుభాషపై పట్టు బాగా బలహీనపడుతోందని మహాటివి ప్రధాన సంపాదకులు ఐ వెంకట్రావు చెప్పారు. నడుస్తోంది... నడుస్తుంది పదాలకు తేడా తెలియని పాత్రికేయులు చాలా మంది ఉన్నారని అన్నారు. ఇందులో పత్రికలు కొంత ఫరవాలేదని, ఎలక్ట్రానిక్‌ మీడియాలో మరింత గందరగోళం ఏర్పడిందని తెలిపారు. అచ్చుతప్పులు భయంకరంగా వస్తున్నాయని వ్యాఖ్యానించారు. దీనికి సిగ్గుపడుతున్నా అని అన్నారు. పాత్రికేయులకు శిక్షణ ఇప్పించాలని, ప్రభుత్వంతో సంప్రదించి నిధులు సేకరించాలని సూచించారు. అప్పుడే మీడియాకు విముక్తి లభిస్తుందన్నారు.
తప్పులు ఎత్తిచూపే వ్యవస్థ అవసరం : కె రామచంద్రమూర్తి

మీడియాలో వస్తున్న తప్పులను ఎత్తిచూపే వ్యవస్థ ఉండాల్సిన అవసరముందని హెచ్‌ఎంటివి ప్రధాన సంపాదకులు కె రామచంద్రమూర్తి సూచించారు. హైదరాబాద్‌ కేంద్రంగా కమిటీ ఏర్పాటు చేసి అందులో అన్ని పత్రికలు, ఛానెళ్లకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. వార్తలను పరిశీలించి సమీక్షించి అందులో వచ్చే తప్పులను క్రోడీకరించి నెలకోసారి విలేకరుల సమావేశంలో చెప్పాలన్నారు. ఏది తప్పు వచ్చిందో, దానికి ఒప్పును సైతం వివరించాలని సూచించారు. అప్పుడే తెలుగు భాషకు గౌరవం లభిస్తుందన్నారు. ఆ కమిటీకి ఆక్షేపించే, పదాలను సవరించే అధికారం ఇవ్వాలని, అప్పుడే ప్రయోజనముంటుందని చెప్పారు.
భాషకు విశ్వవిద్యాలయాలదే బాధ్యత : కె శ్రీనివాస్‌

అక్షరదోషాలు, ఆంగ్ల పదాలు వాడడం వల్లే తెలుగుకు ప్రమాదం వచ్చిందా?లేక ఇతర కారణాలున్నాయా? అనేది విశ్లేషించాలని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్‌ చెప్పారు. పాత్రికేయులకు శిక్షణ ఇచ్చే విద్యాసంస్థలు, పాఠ్యపుస్తకాలు రాసే అధ్యాపకులు భాషలో వచ్చే మార్పులను వివరించాలని చెప్పారు. విద్య విస్తరిస్తోందని, శాస్త్రవిజ్ఞాన అంశాలు వస్తున్న దశలో కొత్త పదాల గురించి అన్వేషించాలని సూచించారు. ప్రతిభాషా అన్ని అంశాలనూ వ్యక్తీకరించబోదని తెలిపారు. ఆంగ్లంలో అనేక కొత్త పదాలు వచ్చి చేరుతున్నాయని, తెలుగు పదం సృష్టించడానికి స్వతంత్ర వ్యవస్థ అవసరమని, దీనికి విశ్వవిద్యాలయాలు బాధ్యత వహించాలని చెప్పారు.
చారిత్రక, భౌగోళిక కోణాలు గుర్తించాలి : అల్లం నారాయణ

తెలుగు భాషలో ప్రాధమ్యాలు లోపించాయని, చారిత్రకమైన, భౌగోళికమైన కోణాలను గుర్తించాలని నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ సూచించారు. భాషలో ఆధునిక పోకడలు పత్రికల్లో ప్రతిబింబించాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ భాషను కించపర్చకూడదని కోరారు.
కళాఖండాలతోనే భాష ఆమోదం : కిశోర్‌

తెలుగు భాషకు ఆపద ఉందనిపించడం లేదని సాక్షి వెబ్‌సెక్షన్‌ సంపాదకులు ఎం కిశోర్‌ అన్నారు. ఏ భాష అయినా ఆమోదం పొందాలంటే కళాఖండాలు రావాలన్నారు. సూర్య సంపాదక సలహాదారు జి శ్రీరామమూర్తి మాట్లాడుతూ ప్రజల భాష పత్రికలకు ప్రాణమని చెప్పారు. మాతృభాషను జీవనదిగా కాపాడుతున్న ఘనత పత్రికలదేనని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించాలని హన్స్‌ ఇండియా డిప్యూటీ ఎడిటర్‌ టంకశాల అశోక్‌ చెప్పారు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వానికి భాషా విధానం లేదన్నారు. కర్ణాటక, తమిళనాడు తరహాలో భాషా విధానం ఉండాలని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు సిలబస్‌ పూర్తి చేసే బాధ్యతనే తీసుకుంటున్నాయని తెలిపారు. ఓ పిహెచ్‌డి విద్యార్థి మహాప్రస్థానం ఒక పరిశీలన అని రాయాల్సింది... బక పరిశీలన అని రాశారని గుర్తు చేశారు. నవల, సిద్ధాంతం, వ్యాసం, కవిత, దినపత్రికలు ఏవీ చదవడం లేదని, అధ్యయనం లోపించిన తరాన్ని సృష్టిస్తున్నందుకు సిగ్గుపడుతున్నామని తెలిపారు. చదవడం, రాయడం, నేర్చుకోవడం ఆపితే ఆ భాష సహజ మరణం పాలవుతుందన్నారు. తెలుగు భాషను ఆధునీకరించి పరిపుష్టం చేయాలని ఈనాడు జర్నలిజం కళాశాల అధ్యాపకులు ఆర్వీ రామారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో వై నరేందర్‌రెడ్డి (ఎపియుడబ్ల్యూజె), సన్నిధానం నర్సింహశర్మ (గౌతమీ గ్రంథాలయం), వెంకట్రామయ్య, సత్తి లలితారెడ్డి (ఆకాశవాణి) ప్రసంగించారు. భాషాభిమానులు, పాత్రికేయులు తదితరులు హాజరయ్యారు.

No comments:

Post a Comment