Sunday 30 December 2012

సాహిత్యం

చరిత్ర పుటల్లో చేరని దళిత పద్య కవులు
ప్రాచీనసాహిత్యం అనగానే పద్యం, పద్యం అనగానే పండితుల పాండిత్యపరి జ్ఞానం గుర్తుకు వచ్చే ప్రధానాం శాలు. తర్వాత వ్యాక రణం, చంధస్సు, అలంకారాలు, సమాసాలు, సంధులు, సంప్రదాయ సాహిత్య సనాతన ధర్మాలు! వీటన్నింటిని పాటించి రాస్తేనే అది పద్యం అవుతుం దనే భావన కలుగుతుంది. ఇప్పటికీ పద్యంరాస్తేనే పండితుడు అనే అపోహకూడా లేకపోలేదు. పద్యం రాయాలంటే తెలుగు ప్రజలు ప్రామాణిక గ్రంథాలుగా పూజించే రామాయణ, మహా భారత, భాగవతాది గ్రంథాలు తప్పక అవపోసన పట్టి ఉండాలనీ, ఇంకా ఆ రంగంలో రాణించగలగాలంటే వేదవాజ్ఞ్మయ పరిజ్ఞానం, ఉపనిషత్తుల సారాంశం తెలిసి ఉండాలనీ వీటిలో ఏఒకటి లోపించినా వారు తెలుగుసాహిత్యంలో పండితులుగా రాణించలేరనే భావన ఈనాటికీ పామర, పండిత దృష్టిలో ఉందంటే అతిశయోక్తి కాదేమో!

ఈనాటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు చదువుతున్నానంటే ఒక మంచి పద్యం చెప్పు లేదా భాగవతంలో లేదా రామాయణంలో లేదా మహాభారతంలో ఒక ఘట్టంచెప్పు చూద్దాం అని అవహేళనచేసే పరిస్థితి. ఇంతటి ప్రసిద్ధ పద్య ప్రక్రియను, దాని రూపురేఖలను గ్రహించి పద్యం అంటే కేవలం ఒక వర్గపు సంపద కాదు, అందులో సాహిత్యంకూడా ఏదో పూర్వజన్మసుకృతం వలనో, దెైవఅనుగ్రహం వలనే వచ్చేదికాదు, ఎవరిలో ప్రతిభ సామర్ధ్యా లుంటాయో వారు అంతా పద్యరచన చేయవచ్చు అని నిరూపించిన దళిత పద్యకవులు సాహిత్యంలో చాలామందిఉన్నారు. ఈ కవులకు- అణగారిన కులాల ముద్రవల్ల సమాజంలో ఏవిధంగా సముచిత స్థానం ఇవ్వలేదో, అదే విధంగా సాహిత్య చరిత్ర పుటల్లో వారి దాఖలాలు కూడా లేవు.

ఇటు సాహిత్య చరిత్రలో, అటు సమాజ చరిత్రలో అట్టడగున ఉన్న రచయితలు ఎందరో ఉన్నారు. కొద్దో గొప్పో సాహిత్యంలో చోటు కల్పించుకున్న వారిలో జాషువా, కుసుమ ధర్మన్న, భోయి భీమన్న, జ్ఞానానందకవి వంటివారు కొద్దిమందే ఉన్నారు. కానీ వీరేకాకుండా జాతీయోద్యమ కాలం నుండి ఈనాటి వరకు కూడా దళిత జీవన విధానాలను పద్యాల్లో రాసిన కవులు వందల్లోఉన్నారు. వీరి సాహిత్యసంప దను రికార్డు చేయలేకపోవటం విషాదకరం. వీరంతా సంప్రదాయ సాహిత్య గ్రంథాలకు ఏమాత్రం తీసిపోని విధంగా పద్యరచనలు చేశారు. వారిలో ఎక్కువ శాతంమంది స్వయంగా దళిత కుటుంబాలలో జన్మించి తమ తమ దళిత జీవనస్థితిగతులను చెప్పారు. కనుక వీరిని దళిత పద్యకవులుగా చెప్పుకోవచ్చు. సంప్రదాయ మార్గమైన, అభ్యుదయ మార్గమైన, అంబేద్కర్‌ సామాజిక పోరాట మార్గమైన ప్రజాస్వామిక ప్రగతిశీల భావాలతో సమాజ శ్రేయస్సుకోసం సాహిత్యంరాస్తూ, అందులో దళిత సమస్యలు, వారి పోరాటాలు, వారి గాథలు పద్యం రూపంలో చెప్పేన పద్యకవులను దళిత పద్య కవులు అని చెప్పుకోవచ్చు.

ఇలా రచనలు చేసినవారిలో జ్యోతి కోటాదాసు (1850-1925), కుసుమ ధర్మన్న (1884-1946), గుర్రం జాషువా(1895-1971), కర్ణవీర నాగేశ్వరరావు (1900-1961), భోయిభీమన్న (1911- 2005), నడకుర్తి వెంకటరత్నం (1915-1989), జ్ఞానానందకవి(1922-2011), మల్లవరపు జాన్‌ (1927- 2006), బొడ్డు ప్రకాశం, బిర్నిడి మోషే, సవ్వప్పగారి ఈరన్న, ఆశావాది ప్రకాశ రావు, నంబూరి దుర్వాస మహర్షి, యం.పి. జానుకవి, మల్లవరపు రాజేశ్వరరావు, నూతక్కి అబ్రహం, పెనుమాక శామ్యూల్‌, బిర్నీడి ప్రసన్న- ఇలా చాలామంది రచయితలు పద్య కావ్య ప్రక్రియలో నిష్ణాతులుగా ఉన్నారు. వీరిలో చాలా మంది రచయితల వివరాలు, తదితర పూర్తి సమాచారం ఇంకా కొంత అందుబాటులో లేదు. ఈ దిశగా పరిశోధనలు జరాగాల్సిన ఆవశ్యకత ఉంది.

వీరు కేవలం ఏదోఒక పద్యకావ్యాన్ని రచించారనుకుంటే పొరపాటే. వీరు శతకాలు, ఖండ కావ్యాలు, లఘుకావ్యాలు, యక్షగానాలు, నవలలు ఇలా దాదాపు వారి కాలంలో ప్రాచుర్యంలో ఉన్న ప్రక్రియలన్నిం టిలోనూ వందల్లో సాహిత్య రచన చేశారు. వీరిలో కొంత మంది సాహిత్య రచనలు ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. వీరిలో బహుభాషా పండితులూ ఉన్నారు. అవధానాలు నిర్వహించ్వినవారున్నారు, సాహిత్య గోష్ఠులు నిర్వహించినవాన్నారు. సాహిత్య పురస్కారాలు స్వీకరించినవారు న్నారు. కానీ ఏసాహిత్య చరిత్రలో వీరికోసం ఒక్కపేజీకూడా కేటాయించలేదు. కారణం వీరు దళితులు కావడమేనా? వీరు దళితప్రజల గురించి సాహిత్యాన్ని రాయడమేనా? జాషువా అన్నట్లు గౌరవం కులానికా, కలానికా? వీళ్ళంతా విశ్వవి ద్యాల యాల్లో పట్టాలు పొందలేదు, గురువుల దగ్గర వేదవిద్యలూ అభ్యసించలేదు.

ఈ దళిత పద్యకవుల జీవితాలను పరిశీలిస్తే దాదాపు చాలా మంది రచయితలు ప్రాధమిక విద్యలోనే వీరి విద్యాభ్యాసానికి స్వస్తి పలికి వారికిఉన్న స్వీయానుభ వాలతో, సామర్థ్యంతో సాహిత్యంరచన చేశారంటే ఏ పండితునికి నమ్మశక్యం కాదేమో! ఇవి చరిత్ర పుటల్లో చేరని చెరిగిపోని చేదు నిజాలు.దళిత పద్యకావ్యా లను అధ్యయనం చేసినప్పుడు, పద్యకావ్యాలకు- దళిత పద్యకావ్యాలకు కవితాప్రక్రియా పరంగా, స్వభావ రీత్యా ఒకటే అయినా భావ, భాష, రూప, వస్తు, శెైలో తదితర విషయాల పట్ల ఎంతో వెైవిధ్యంఉంది. అవి:1. హరిజన సమస్యను నిర్మూలించే దిశగా రచనలుచేయడం. 2. అస్పృశ్యత నివారణోద్యమానికి సంబంధించినవి. 3. జాతీయ, సంస్కరణభావాలు గలవి.4. అంబేడ్కర్‌ ఔన్నత్యానికి, ఆయన సామాజిక పోరాటానికి సంబంధించినవి. 5. హిందూ మతసిద్ధాంతాలకు వ్యతిరేకంగా క్రైస్తవ మత సాహిత్యాన్ని, బౌద్ధ మత సారాంశాన్ని ప్రజల్లో చాటి చెప్పే సాహిత్య రచనలు.

6. స్ర్తీల సమస్యలు-వరకట్నం, సతీసహగమనం, పురుషాధిక్యత వంటి విషయాల పట్ల ప్రజలను చెైతన్యపరచే రచనలు చేయటం. 7. తెలుగుసంస్కృతీ, సాహిత్య ఔన్నత్యానికి సంబంధించిన రచనలు. 8. రాజకీయ నాయకుల స్తుతికావ్యాలు. 9. గాంధేయ మార్గాలను అనుసరించే రచనలు.10. చారిత్రక కావ్యాలు. ఎవరికీ కనిపించని, కనిపించినా సాహిత్య చరిత్రపుటల్లో స్థానానికి నోచుకోకుండా పామర సాహిత్యకోవలోకి పరిమితమైన కవులు ఈ దళిత పద్యకవులు. వీరు ఏదో సరదాకోసమో, మానసిక ఆనందం కోసమో సాహిత్యరచన చేయలేదు. రగులుతున్న గుండెల్లో వెల్లువలా వచ్చిన వేదనాభరిత పోరాటాలే వీరి కావ్య ఇతివృత్తాలు. ఆధునిక కాలం మొదలెై జాతీయోద్యమం, సంఘసంస్కరణ ఉద్యమం బాగా ఊపు అందుకున్న రోజుల్లో వచన ప్రక్రియ కొనసాగినా, పద్యప్రక్రియ మాత్రం తనస్థానాన్ని నిలుపుకోగలిగింది. జాతీయోద్యమం రెండు విధాలుగా కొనసాగింది.

ఒకటి దేశ స్వంత్రత్య్రం లక్ష్యంగా, మరొకటి దళిత ప్రజల హక్కుల సాధన. స్వాతంత్య్రఉద్యమానికి గాంధీ తదితర నాయకులు నాయకత్వం వహిస్తే, దళిత ప్రజల హక్కుల సాధనకు అంబేడ్కర్‌ వంటి మహనీ యులు నాయకత్వం వహించారు. వీరు గాంధీ పట్ల ఆకర్షితులు కావడానికి కారణం- ఆనాటి రాజకీయ, సామాజిక, కాల పరిస్థితులు. అంబేడ్కర్‌ సిద్దాంతాల పట్ల ఆకర్షితులు కావడానికి కారణం- ఆయన జాతి ప్రయోజనాల కోసం పోరాడిన దళిత నాయకుడు కావటం. దళిత పద్యకవులు హరిజనులు మనుషులే అన్న భావనను వ్యక్తపరుస్తూ, వారి పట్ల జాలి, దయ, కరుణ, ఆదరణ భావం ఉండాలనే సానూభూతి తత్త్వాన్ని ప్రేరేపించేవిధంగా సాహిత్యం రాశారు. వీరి సాహిత్యాన్ని పరిశీలిస్తే- గాంధేయవాద సిద్ధాంతాలెైన అహింస, సత్యం, హరిజనాభ్యు దయం, అస్పృశ్యతనివారణ వంటఇంశా లపెై సంస్కరణ మార్గంలో వెలువడిందనే చెప్పుకోవాలి.

దళిత పద్యకవులను ప్రధానంగా గాంధేయవాద ధోరణిలో రచనలు చేసేవారు , అంబేడ్కర్‌ సిద్ధాంతాల పట్ల రచనలు చేసేవారు, గాంధీ, అంబేడ్కర్‌ ఇద్దరిని అనుసరిస్తూ రచనలు చేసేవారు, క్రైస్తవమత ప్రభావంవల్ల హిందూమతం లోని లోపాలను చెప్పిన వారు, బౌద్ధ ధర్మాలను తెలియజెప్పినవారు ఉన్నారు. అంటరాని తనాన్ని, వెనుక బాటుతనాన్ని చెప్తూ పల్లెప్రజల్లో, పద్యాలు పాడుతూ చెైతన్య జ్వాలలు రగిలించారు.
‘చదువుల్‌ పెరిగిన సంబరమే గాని/ అంటరానితనంబు అణగలేదు’ (నడకుర్తి వేంకట రత్నకవి) అన్న రచయిత వేదనగమనిస్తే దళిత పద్య కవుల జీవితాలకి ఇది సరిపోతుంది. ‘మాల యతడు, నేను మాదిగ కులజు/ నను విభేదముండునం తదనకు కలిసి తిరుగలేవు గద! కులీనుల తోడ/ ఇంటగెలిచి రచ్చకేగుమయ్య’ (మల్లవరపు జాన్‌).

ఇక్కడ దళిత అంతర్గత పోరును తెలియపరుస్తూ ఆనాడే ఈ పద్యాన్ని చెప్పాడు. దీనిని బట్టి రచయితకు ఉన్న ముందు చూపు, సోదరకులాల మధ్య ఐక్యతాభావం సాధించాలనే లక్ష్యం కనిపిస్తుంది. ‘చేనేత గుడ్డతో మానంబు గాపాడి/ కట్టుబట్టల కెట్లు కష్టపడితివో/ పాదరక్షలనిచ్చి పాదాల రక్షించి/ దూరముగా నెట్లు త్రోయబడితివో’ (మల్లవరపు జాన్‌). ఈనాడు బహుజనరాజ్యం, దళిత సాధికారిత, రాజ్యాంగసాధనే లక్ష్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఏకం కవాలనే నినాదాలు వింటున్నాం, కానీ ఈ రచయిత ఎప్పుడో వీరి ఐక్యత ఆవశ్యకతను ఈ పద్యం ద్వారా తెలియజెప్పాడు. గుర్రం జాషువా ప్రభావంవలన అనేకమంది దళితరచయితలు సాహిత్యంలో పద్యకవులుగా స్థానాన్ని నిలుపుకోగలిగారు. చాలా మంది రచనల్లో జాషువా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

పండిత కవులకు- దళిత కవులకు రచనా నేపథ్యంలో, కృతి భర్తల విషయంలో రసపోషణలో, వర్ణనాత్మ కతలో- అన్ని విషయాల్లో వెైవిధ్యం కనిపిస్తుంది. ప్రాచీనకావ్యాల్లో ఇతివృత్తాలు తీసుకొన్నవాటిలో సామాజి కాంశాలు చెప్పడం, ఎవరెైతే దళితవా డలకు సేవచేశారో వారికి తమకావ్యాలను అంకితంఇవ్వడం, దళిత చారిత్రక పుత్రు లను ఆయాకావ్యాల్లో ప్రశంసించటం, తమపూర్వీకులను కీర్తించటం, స్ర్తీ ప్రసవ వేదన, వరకట్నాల గురించి ఎంతోవెైవిధ్యభరితంగా వీరి సాహిత్య రచన సాగింది.ఒక వర్గ ఆధిపత్యం, తరతరాలుగా కూరుకుపోయిన వర్ణ , కుల వ్యవస్థ వీటన్నింటికీ మించి మనుషుల మధ్య ఉండే వివక్షలను నిరసిస్తూ , ఏ అక్షరం అయితే చదివితే నాలుకలు కోశారో, ఏ వేదాలు వింటే చెవుల్లో సీసం పోశారో అదే సంస్కృత సాహిత్యాన్ని అలవోకగా చదివి పండిత వర్గాల ప్రసంశలు పొందటంలో సఫలీకృతులెైనారు.
వీరు పాండిత్య ప్రకర్షకు సాహిత్యాన్ని సృష్టించలేదు. వారి అవసరం అలా వారిని కవులుగా తీర్చిదిద్దింది. దళిత పద్య కవులు రాసిన సాహి త్యం సంస్థానాల్లో కావ్య గౌరవాలను పొందలేకపోవచ్చు గానీ దళిత గుడిసెల్లో చెైతన్యం నింపడంలో విజయం సాధించారు. దళిత పద్యకావ్యాలు గాంధేయ మార్గంలో పయనించి ఉండవచ్చు. అంత మాత్రంచేత గాంధీ సిద్ధాంతాలకు వీళ్ళు జోలపాడలేదు, జేజేలుకొట్టలేదు. నిరసించా ల్సినచోట నిరసించారు, ఎదిరించా ల్సినచోట ఎదిరించారు. సొంత గొంతును తమదెైన రీతిలో పద్యప్రక్రియలో వేదనాభరితమైన దళిత జీవితకథలను వినిపించగలిగిన ఈ రచయితలు చరిత్రలో పుటల్లో చేరవల్సిన నిజమైన సాహిత్యసృజనకారులు.


No comments:

Post a Comment