Sunday 30 December 2012

 ఆడపిల్లలను అప్రమత్తం చేయాల్సిందే.....
 
ఇప్పుడు మనం పూర్తిగా మార్కెట్ గుప్పిట్లో ఉన్నాం. ఇక్కడ వ్యాపారాభివృద్ధి, లాభం మాత్రమే పరిగణన లోకి తీసుకో బడతాయి. సమ భావన, సంస్కృతీ, నీతి వంటి మాటలు బూతులై పోయాయి. వాణిజ్య ప్రకటనలు, సినిమాలు, పత్రికలూ...ఏవి తీసుకున్నా...అమ్మాయిలు కేంద్రంగా, అందాల ఆరబోత ధ్యేయంగా  ఉంటున్నాయి. వీటి ప్రభావం వల్ల ఆడ పిల్లల పట్ల చిన్న చూపు ఒక వైపు, వారొక సెక్స్ వస్తువులన్న భావన మరొకవైపు పెచ్చరిల్లుతున్నాయి...ఈ ఆధునిక సమాజం లోనూ. వీటి వల్లనే ఆడ పిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. 

ఈ చవట ప్రభుత్వాలు, నింపాది చట్టాలు, స్వార్ధపూరిత ప్రజా సంఘాలు, కుళ్ళు మెదళ్ల మేధావులు ఏమీ చేయలేరు..ఈ భయంకరమైన సమస్య పరిష్కారానికి. ఎన్నికలలో లబ్ధికి, కాంట్రాక్టుల ఖరారుకు, ఆర్ధిక ప్రయోజనాలు కలిగే పనులకు అమ్మాయిలను వాడుకోవడం సర్వ సాధారణం అయ్యింది. వర్క్ ప్లేసులలో బాసుల కిరాతకానికి బలవుతున్న మహిళలు ఎందరో!

ఢిల్లీ రేప్ ఘటన పట్ల గొంతు చించుకుంటున్న ఒక ప్రముఖ పార్టీ అధినేత రాజకీయ ప్రయోజనం కోసం ఒక ఉన్నత స్థాయి జడ్జి దగ్గరకు అప్పటి హీరోయిన్, ఇప్పటి పొలిటీషియన్ ఒకరిని సెక్స్ సుఖం కోసం పంపి పనిచేయించుకున్నట్లు మీడియాలో ఉన్న చాలా మందికి తెలుసు. ఇప్పుడున్న మీడియా ప్రభువులలో పలు దరిద్రులు...వ్యాపార విస్తరణ కోసం...అమ్మాయిలను, ముఖ్యంగా తమ దగ్గర పనిచేసే యాంకర్లను పావులుగా వాడుకుంటున్న సంగతి బహిరంగ రహస్యం. అప్పనంగా అందలం, ఆర్ధిక హోదా లభిస్తుండే సరికి కొందరు ఆడ పిల్లలు రాజీ పడుతున్నారు. ఈ పరిస్థితి మారాలి. 

పోలీసులు, మీడియా, న్యాయ వ్యవస్థ ప్రతికూలంగా వ్యవహరిస్తున్న ఈ పరిస్థితుల్లో సాధారణ పౌరులే నడుం బిగించాలి. సమాజ శ్రేయస్సు ధ్యేయంగా కుటుంబ విలువలు పెంపొందించాలి. పాఠ్య పుస్తకాలతో సంబంధం లేకుండా...పిల్లలకు విలువలు బోధించాలి. ఈ నేపథ్యoలో...అబ్రకదబ్ర పెద్దలకు, స్కూల్-కాలేజ్ పిన్నలకు విడివిడిగా రూపొందించిన ప్రవర్తనా నియమావళి మీ కోసం.  

పెద్దల ప్రవర్తన

>బాలికలు, మహిళల పట్ల చిన్న చూపు ఇంటి నుంచే ఆరంభం అవుతుంది. దీన్ని నివారించే చర్యలు చేపట్టాలి. 
>మనుషులం అందరం సమానమే...అన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు నూరిపోయాలి. అది నిరూపించి చూపాలి. 
>జీవిత భాగస్వామిని, భార్యను, చులకనగా చూడడం, చీటికీ మాటికీ తిట్టడం, సూటిపోటి మాటలతో చులకన చేయడం ఆపాలి.
>ఇంట్లో పనికి కుదిరే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం దారుణం. 
>ఇంటికి వచ్చే ఆడ పిల్లలు, మహిళలను అదోలా చూడడం, వారితో వెకిలి చేష్టలకు ఒడిగట్టడం చేటుచేస్తాయి.    

మగ పిల్లలకు నేర్పాల్సినవి 

>తోటి బాలికలతో ఎలా ప్రవర్తించాలో చిన్నప్పటి నుంచే బోధించాలి. >సాధ్యమైనంతవరకూ ఇప్పటి సినిమాలను చూడనివ్వవద్దు. ముఖ్యంగా ప్రేమ సెంట్రిక్ గా ఉండే తెలుగు, హిందీ సినిమాలను నివారించాలి.   
>సినిమాలు అడపా దడపా చూసినా అందులో వెకిలితనాన్ని అనుకరించవద్దని చెప్పాలి.
>సినిమాలలో అశ్లీలత, అసభ్యతలను పెద్దలే  అక్కడికక్కడ తిట్టి పోయాలి. ఆ సినిమా తీసిన దర్శక నిర్మాతలు పశువులతో సమానమని, దేశభక్తి లేని కుక్కలని ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలి.
>బాలికలపై దాడిని బహిరంగంగా ఖండించాలి. ఆ తాలూకు నిరసన ప్రదర్శనలలో పాలు పంచుకోవాలి. 
>స్కూలు స్థాయి నుంచే చట్టాల గురించి పిల్లలకు ప్రాథమిక అవగాహన వచ్చే చర్యలు చేపట్టాలి.
>పిచ్చి పనులు చేస్తే...పడే శిక్షల తీవ్రతను తెలియపరిచాలి.
>జులాయి స్నేహితులతో తిరగకుండా చూసుకోవాలి. 
>విలాసాల పట్ల మక్కువ చూపే కొడుకు ఎన్నడో ఒక నాడు ప్రమాదం కొని తెస్తాడని గుర్తించాలి. 
>స్కూలు బస్సులోనో, దారి వెంటనో...ఈవ్ టీజింగ్ వంటివి జరుగుతున్నాయేమో అడిగి తెలుసుకోవాలి. 
>ఈవ్ టీజింగ్ బాధితుల పట్ల సానుభూతితో ఎలా వ్యవహరించాలో తెలియజేయండి. 
>ఈవ్ టీజింగ్ ను నిరోధించడం...ఎందుకు, ఎలా సోషల్ రెస్పాన్సిబిలిటి అవుతుందో పిల్లవాడికి తెలియజేయాలి.
>పిల్లవాడితో మిత్రుడిలా వ్యవహరిస్తే స్కూల్, కాలేజ్ లలో పరిణామాలు తెలుసుకోవచ్చు. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు.
>లవ్వు, పార్టీలు, సోషల్ నెట్ వర్కింగ్ వంటి అంశాలను సున్నితంగా డీల్ చేయాలి.
>మన పిల్లవాడి మానసిక పరివర్తనలో తేడా కనిపిస్తే...కుటుంబ సభ్యుల లేదా వైద్యుల సహకారం తీసుకోవడానికి వెనకాడవద్దు.   

ఆడ పిల్లలకు నేర్పాల్సినవి 

>మగవాళ్ళను పూర్తిగా నమ్మవద్దని, వారి మాటలను, చేష్టలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని నూరిపోయాలి.
>తోటి బాలురతో ఎలా ప్రవర్తించాలో, వారిలో ఓవర్ యాక్షన్ గాళ్ళను ఎలా డీల్ చేయాలో చిన్నప్పటి నుంచే బోధించాలి.
>సాధ్యమైనంతవరకూ ఇప్పటి సినిమాలను చూడనివ్వవద్దు. సినిమాటిక్ ధోరణులను మొగ్గలోనే తుంచి వేయాలి.
>మగ పిల్లల పొగడ్తలు నిజమని నమ్మవద్దని, పొగిడిన వాళ్ళు నమ్మకస్తులని, దగ్గరివారని నమ్మవద్దని స్పష్టం చేయాలి.
>స్కూలు, కాలేజి స్థాయిలో సెల్ ఫోన్ వాడకం తగ్గించాలి. 
>విలాసవంతమైన జీవితం పట్ల మోజు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తుందో చర్చించాలి. 
>మరీ జుగుప్సాకరమైన డ్రస్సులను ధరించనివ్వవద్దు.  
>మోతాదు మించిన టెక్స్ట్ మెసేజులు, మెయిల్స్ ప్రమాదకరమని తెలియజెప్పాలి. 
>ఒంటరిగా ఇతరుల ఇళ్ళకు, రహస్య ప్రాంతాలకు  వెళ్ళడం ఎంత ప్రమాదమో తెలియజెప్పాలి.
>అమ్మాయి స్నేహితులను నమ్మి...సినిమాలకు, షికార్లకు, పార్కులకు, పార్టీలకు పంపడం ప్రమాదం.
>స్కూల్ భరోసా లేనిది బైటి ప్రాంతాలకు ఎక్స్ కర్షన్ లకు పంపడం శ్రేయస్కరం కాదు.
>ఇతరులతో సంబంధాల విషయంలో గోప్యత (సీక్రసీ) ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందో తెలియజెప్పాలి.
>అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ తో తరచూ మాట్లాడడం, సమాచారాన్ని సేకరించడం   మంచిది.
ఏతా వాతా...అద్భుతమైన ఈ కుటుంబం ఆవశ్యకత, మనుషుల మధ్య నమ్మకాల అవసరం, అబద్ధాలు తెచ్చి పెట్టే ప్రమాదాలు, ఎయిడ్స్ వంటి రోగాల తీవ్రత ..తల్లి దండ్రులు ఎప్పటికప్పుడు ఇళ్ళలో చర్చించాలి. 

కాలేజ్ రోజుల్లో పిల్లలు (మగైనా...ఆడైనా) ఏదో ఒక రిలేషన్ లోకి వెళ్ళడం దాదాపు ఖాయమని పెద్దలు సిద్ధపడాలి. అందులో కొన్ని రిలేషన్స్ అద్భుతమైనవి కావచ్చు...పెళ్ళికి దారి తీయవచ్చు. మరీ సంపాదనే లక్ష్యం కాకుండా...పిల్లల కోసం రోజూ కొంత సమయం కేటాయిస్తే...వారికి ఒక సన్నిహిత మిత్రుడిగా వ్యవహరిస్తే...చాలా సమస్యలను మొగ్గలోనే పరిష్కరించవచ్చు. 
( Thanks to 
--Dr. S.Ramu garu from .....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు)


No comments:

Post a Comment