Friday 28 December 2012

తెలుగుతల్లి మెడలో పూలదండశంకరంబాడి

అది 1975 ఏప్రిల్ నెల... హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియం... అది ప్రపంచ తెలుగు మహాసభలకు వేదిక. సభలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. టంగుటూరి సూర్యకుమారి ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ...’ ప్రార్థనాగీతం ఆలపిస్తున్నారు. రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన అలీ అహ్మద్ సభను ప్రారంభించారు. ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వేదిక మీద ఆసీనులయ్యారు. విద్యాశాఖమంత్రి మండలి వెంకటకృష్ణారావు కార్యక్రమాన్ని తన భుజాల మీద నడిపిస్తున్నట్లు ఉన్నారు. మా తెలుగుతల్లి గీత రచయిత శంకరంబాడి సుందరాచారిని పరిచయం చేశారాయన. ఈ సభల పుణ్యమా అని శంకరంబాడి కలం నుంచి జాలువారిన ఈ అమృతధార రాష్ట్రగీతం అయింది. ఈ గీతాన్ని రాసిన సుందరాచారి ప్రపంచానికి పరిచయమయ్యారు.
శాపోపహతుడు

శంకరంబాడి జీవితం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే శాపోపహతుడు అనాలి. కవులు, రచయితలు, కళాకారులలో చాలామందిని అదృష్టదేవత ఆశీర్వదించదు. కాలం, కర్మం కలిసిరాక శీపోపహతులుగా జీవితాలు సాగిస్తుంటారు. శంకరంబాడి కూడా 60 ఏళ్లు వచ్చే వరకు లోకానికి తెలియకుండానే జీవించారు. ఈ గీతం రాష్ట్రగీతం అయ్యేవరకు ఆయనెవరో చాలామందికి తెలియదు. తర్వాత కూడా ఆ ఒక్క గీతం దగ్గరే ఆగిపోయింది ఆయన పరిచయం. ఆయన రాసిన సాహిత్య సుమాలు, జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలు అనేకం.

సుందరాచారి తిరుపతిలో పరమనైష్ఠిక కుటుంబంలో పుట్టారు. లోక్‌సభ స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌కు బంధువు. ఆ బంధుత్వాన్ని ఉపయోగించుకుంటే జీవితం ఎవరూ అందుకోలేని స్థాయిలో ఎదగవలసిన నేపథ్యం. కానీ స్వతంత్ర భావాల సుందరాచారి 14వ ఏటనే తండ్రితో విభేదించి జందేన్ని తెంపి స్వతంత్రంగా జీవించడం మొదలుపెట్టారు. కాశీనాథుని నాగేశ్వరరావు చలవతో ఆంధ్రపత్రిక ఉద్యోగి అయ్యారు. కొన్నాళ్లకు దాన్ని వదిలేశారు. సినీ మాటల రచయితగా, గీత రచయితగా మద్రాసు జీవితమూ అచ్చిరాలేదు. దాంతో నటుడిగా జీవితాన్ని మొదలుపెట్టారు. నాటకాలకు దర్శకత్వం వహించారు. ఆ పైన పాఠశాల అధ్యాపకుడిగా చేరారు. అందులో జూనియర్ స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ వచ్చింది. అంతలోనే తమాషా సంఘటన... ఒక రోజు తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి పాఠశాల డెరైక్టర్ రైలు దిగారు. ఆయన చేతిలో ఉన్న ఫైలును సుందరాచారి చేతికిచ్చారు. ఇలాంటి బానిస బతుకు అక్కరలేదని మరునాడే రాజీనామా చేశారు శంకరంబాడి. అప్పటికి ఆయనవయసు 40. మరో పద్దెనిమిదేళ్ల సర్వీసు వదులుకోవడానికి వెనుకడుగు వేయని సాహసి.

పుస్తకాలు అమ్ముకుని... కవిత్వాన్ని నమ్ముకుని!

కవితోపన్యాసాలిస్తూ, దాదాపు 700 పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పుస్తకాలు పంచారు. పుస్తకాలు అమ్ముకుని, కవిత్వాన్ని నమ్ముకుని జీవించారాయన. సుందరాచారికి వైవాహిక జీవితమూ అంతగా కలిసి రాలేదు. భార్య వేదమ్మాళ్ అనారోగ్యంతో బాధపడుతుండేవారు. ఇలా ఉండగా ఒకసారి... మాఢభూషి గారి ఆహ్వానం మీద ఢిల్లీ వెళ్లి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను కలిసి బుద్ధగీత కవితా సంపుటిలోని కొన్ని కవితలను వినిపించారు. రాధాకృష్ణన్ ఆ కవితలను, సుందరాచారిని ప్రశంసిస్తూ కొన్నింటిని ఇంగ్లిష్‌లోకి అనువదించమని కోరారు. అలాగే జవాహర్‌లాల్ నెహ్రూతో ఇంటర్వ్యూ కూడా ఏర్పాటు చేశారు సర్వేపల్లి.

నెహ్రూ సంతకం... ఓ మధుర జ్ఞాపకం!

ఇంగ్లిష్‌లో రాసిన బాలలగేయాలను నెహ్రూకి వినిపించారు శంకరంబాడి. నెహ్రూ పరవశుడై తన సొంత చెక్కు మీద 500 రూపాయలు రాసి, సంతకం చేసి ఇచ్చారు. మర్నాడు ఆ చెక్కును క్యాష్ చేసుకోవడానికి బ్యాంకుకెళ్లారు సుందరాచారి. నెహ్రూగారి సంతకం చూసి ముగ్ధులైన బ్యాంకు మేనేజర్... వెంటనే అనుమానంగా చూశారు. ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి నిర్ధారించుకున్న తర్వాత సుందరాచారికి మర్యాదలు చేసి, డబ్బు ఇచ్చి పంపుతూ మొమెంటోగా దాచుకోమని ఆ చెక్కును కూడా ఇచ్చి పంపారు.

మరో సందర్భంలో రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను కలిసినప్పుడు ఆయన ‘మీకేం కావాలి కవిగారూ’ అని అడిగితే... ‘నాకు పదవులు వద్దు, బహుమానాలు వద్దు. రాష్ట్రపతి చేతుల మీదుగా నూటపదహార్లు, కవిగా ఓ శాలువా చాలు’ అని చాలా హుందాగా చెప్పిన ఉదాత్తుడు సుందరాచారి.

కొన్ని సినిమా పాటలు... స్వాతంత్య్ర ఉద్యమ గేయాలు!!

1941లో మహాత్మాగాంధీ జీవితాన్ని డాక్యుమెంటరీ తీసినప్పుడు శంకరంబాడి ‘పాడవే రాట్నమా ప్రణవ భారత గీతి...’ అంటూ రాట్నం మీద ఓ గీతం రాశారు. 1942లో దీనబంధు సినిమాకు ఆరుపాటలు రాశారు. 1961లో విశ్వకవి రవీంద్రుని గీతాంజలిలోని 103 పద్యాలను తెలుగులోకి అనువదించారు. ‘సుందర భారతము, సుందర రామాయణాన్ని రాశారు. వ్యాసుని హృదయాన్ని, వాల్మీకి భావుకతను తెలుగులోకి తెచ్చారు. ‘బుద్ధగీత’లో బుద్ధని ఆవేదనను చాలా అందంగా చిత్రించారు సుందరాచారి’ అని ప్రముఖులు పలు సందర్భాల్లో ఆయనను ప్రశంసించారు.

ఏకలవ్యుడు, అగ్నిపరీక్ష, అపవాదు, సుందరసుధాబిందువులు వంటి ఖండకావ్యాలు రాశారు. ‘అపవాదు’లో సీతాదేవి మీద వచ్చిన అపవాదును 108 తేటగీతుల్లో చిత్రించారాయన. జీవించినంత కాలం అక్షరాలకే అంకితమయ్యారు. అన్ని అక్షరాల్లో ఆయనను మనకు చేరువ చేసింది, కలకాలం గుర్తుండిపోయేలా చేసింది ‘తెలుగుతల్లి మెడలో అలంకరించిన మల్లెపూదండ. తెలుగుతల్లి మెడలో మల్లెపూదండ ఎప్పటికీ వాడదు, సుందరాచారీ వాడిపోడు. నిత్య వికసిత పుష్పంలా సువాసనలు వెదజల్లుతూనే ఉంటారు.

వాగ్గేయకారుడు కూడా!

సుందరాచారి రాసిన దేశభక్తి గీతాన్ని స్వయంగా ఆయనే ఆలపించినప్పుడు ఆకాశవాణి కడప కేంద్రంలో రికార్డు చేశారు. ఆ గీతాన్ని అంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకంటే... ఇది జరిగింది 1977 ఏప్రిల్ ఆరవ తేదీన. ఆ తర్వాత రెండు రోజులకే ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఆయన కన్నుమూశారు.

- డా. ఆర్. అనంత పద్మనాభరావు

తెలుగుతల్లి మల్లెపూదండ ఇలాగ పూసింది!!

ఈ గీతాన్ని సుందరాచారి ఓ సినిమా కోసం రాశారు, కానీ వారికది నచ్చకపోవడంతో ఆ సినిమాలో వాడలేదు. తర్వాత ఆయన అనుమతితో సూర్యకుమారి 1942లో ప్రైవేట్ గ్రామఫోన్ కంపెనీ వారికి పాడి రికార్డు చేశారు. అయినా మూడు దశాబ్దాల వరకు ఈ గీతానికి పెద్దగా ఆదరణ లభించలేదు.

రచయిత గురించి...

శంకరంబాడి సుందరాచారి జీవితాన్ని అక్షరబద్ధం చేసిన రచయిత పద్మనాభరావు... ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలలో పనిచేసి ఢిల్లీ కేంద్రంలో అడిషనల్ డెరైక్టర్ జనరల్‌గా రిటైరయ్యారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా రెండు దఫాలు ఆకాశవాణి కడప కేంద్రంలో శంకరంబాడి సుందరాచారిని ఇంటర్య్వూ చేశారు. కవిమిత్రుల సత్సంగాలతో వీరిద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం పెరిగింది.
  

No comments:

Post a Comment