Tuesday 18 December 2012


అందని మీ సేవ

(న్యూస్ మీడియా-శ్రీకాకుళం)
ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నిరకాల సేవలను అందుబాటులోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఏర్పాటు చేయించిన మీసేవా కేంద్రాలు సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతున్నాయి. చాలా కేంద్రాల్లో విద్యుత్ బిల్లుల స్వీకరణకు తప్ప ఇతర సేవలు అందుబాటులోకి రావడం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు అవసరమైన సేవలను ఆన్‌లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చి అందించాలన్న లక్ష్యం అమలులో నెరవేరడం లేదు.

గతంలో ఉన్న ఈ సేవా కేంద్రాలను మీసేవా కేంద్రాలుగా మార్చడంతోపాటు కొత్తగా మరిన్ని కేంద్రాలకు అనుమతిచ్చి జిల్లాలో మొత్తం 35 మీసేవా కేంద్రాలను రెండు నెలల కిందట ప్రారంభించారు. వీటిద్వారా 18 రకాల సేవలను ప్రజలకు అందుబాటులో తేవాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరలేదు. అతికష్టం మీద ఐదు రకాల సేవలు మాత్రం ప్రజలకు వీటిద్వారా అందుతున్నాయి.

మీసేవా కేంద్రాలను ఎక్కువ శాతం మండల కేంద్రాల్లో కాకుండా మారుమూల గ్రామాల్లో ఏర్పాటు చేయడం వలన ప్రజలకు అంతగా ఉపయోగపడడం లేదు. ఈ కేంద్రాల ద్వారా అందజేస్తున్న ధ్రువపత్రాలను ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరిలో ఇచ్చే ధ్రువపత్రాలు అన్‌లైన్‌లో ఉన్న తహశీల్దార్ సంతకంతో ఇవ్వాలి. బీ కేటగిరిలో రెవెన్యూ అధికారుల తనిఖీ అనంతరం పౌరసేవాపత్రం ప్రకారం నిర్ణీత వ్యవధిలో అందించాలి. దీనికి 40 రూపాయల వరకూ రుసుము వసూలు చేస్తారు. విద్యార్థులకు అన్నిరకాల ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు అందించే బాధ్యతను మీ సేవా కేంద్రాలకు అప్పగించారు. ధ్రువపత్రాలు అవసరమైన విద్యార్థులు జిల్లాలో 1.75 లక్షల మంది ఉంటారని అధికారుల అంచనా. వీరందరికీ ధ్రువపత్రాలు అందించాలన్న లక్ష్యం నెరవేరలేదు.

ఈ కేంద్రాల ద్వారా సులభంగా ధ్రువపత్రాలు పొందడానికి రెవెన్యూ శాఖ నుంచి ఇచ్చిన ఐడీ నంబర్ ఆధారంగా సమాచారం ధ్రువపత్రంపై ముద్రించాలి. రెవెన్యూ శాఖ ద్వారా ఆన్‌లైన్‌లో పొందుపర్చిన సమాచారం తప్పులతడకగా ఉండడంతో విద్యార్థులు ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకొనే సమయంలో పడరానిపాట్లు పడ్డారు. తిరిగి తహశీల్దారుతో ధ్రువీకరించుకొని, బీ కేటగిరీలో దరఖాస్తు చేసుకుని ఒక్కో ధ్రువపత్రానికీ నలభై రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. సుమారు 60 వేల మంది విద్యార్థులకే ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

మిగిలిన వారంతా తహశీల్దార్ కార్యాలయాలపైనే ఆధారపడుతున్నారు. ఈ కేంద్రాల్లో కాళింగ కులానికి ఓబీసీ, రెడ్డిక కులానికి సంబంధించి ఈబీసీ, ఓబీసీ ధ్రువీకరణ పత్రాలు రావడంలేదు. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు మీసేవా కేంద్రాల పనితీరుపై మండిపడుతున్నారు.

ఫైరవీలకే ప్రాధాన్యం : ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మీసేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించగానే అధికార పార్టీ నాయకుల పైరవీలు జోరందుకున్నాయి. వీరి పైరవీలకే ప్రాధాన్యతనిస్తూ అధికారులు కూడా పెద్దగా పరిశీలన జరపకుండానే వీటి ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేశారు. ఈ సేవా కేంద్రాలు ఎంత వరకూ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి? వాటిని ఏర్పాటు చేసిన గ్రామ జనాభా ఎంత? మండలంలోని ప్రజలందరికీ ఈ సేవలు అందుతాయా? అనే కనీస ఆలోచన లేకుండా వీటికి అనుమతులు ఇచ్చారు. దీంతో వివిధ పనులపై మండల కేంద్రానికి వచ్చిన వారు మారుమూల గ్రామాల్లోని మీసేవా కేంద్రాలను వెతుక్కుంటూ వెళ్లక తప్పని పరిస్థితి ఎదురవుతోంది.

దీనికితోడు అవగాహన లేని ఆపరేటర్లకు వీటిని అప్పగించడం వలన ప్రజలకు మెరుగైనసేవలు అందడం లేదు. ఈ కేంద్రాల నిర్వహణను పరిశీలించి, తగు సహకారాన్ని అందించడానికి జిల్లా కేంద్రంలో సాంకేతిక సమాచార కేంద్రం (ఎన్ఐసీ) ఉన్నా అందులో సాంతికసేవలు అందించే నిపుణులు మాత్రం లేరు. మండలాల్లోని మీ సేవా కేంద్రాల్లో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అలాంటి కేంద్రాలు అలంకారప్రాయంగా మారుతున్నాయి. ఈ కేంద్రాల ద్వారా రైతులకు ఎఫ్ఎంబీ, అడంగల్ కాపీలు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు వంటివి అందించాలి.

కానీ అవేవీ రైతులకు సక్రమంగా అందకపోవడంతో ఈ ఏడాది రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న రైతులకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. చివరికి పాతపద్ధతినే అనుసరిస్తున్నారు. పుట్టిన తేదీ ధ్రువపత్రాలు, మరణ ధ్రువపత్రాలు, లీగల్‌హైర్ వంటి వాటిని ఇంకా పూర్తిస్థాయిలో ఈ కేంద్రాలు అందించలేకపోతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ మీ సేవా కేంద్రాల పనితీరుపై పర్యవేక్షణ జరిపి వాటిని మండల కేంద్రాల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల ప్రభుత్వ సేవలను వీటి ద్వారా అందించడానికి కృషి చేయాలని అంతా కోరుతున్నారు.

No comments:

Post a Comment