Sunday 30 December 2012

ప్రముఖ చిత్రకారుడు రామలింగేశ్వరరావు కన్నుమూత

  • తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు 'తరతరాల తెలుగు వెలుగుల'ను తీర్చిదిద్దిన కుంచె ఆగిపోయింది
పాత తరం ప్రముఖ తెలుగు చిత్రకారుల్లో ఒకరూ, సీనియర్‌ పాత్రికేయులూ దసిక రామలింగేశ్వరరావు ఇకలేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్‌ 28వ తేదీ శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. 'డి.ఆర్‌' అనే సంక్షిప్త నామంతో చిత్రకళా రచన చేసి, 20వ శతాబ్దపు తెలుగు చిత్రకారుల్లో ఒకడిగా దసిక రామలింగేశ్వరరావు పేరు తెచ్చుకున్నారు. 'ఆంధ్రపత్రిక' యాజమాన్యంలోని దిన, వార పత్రికల్లో, 'భారతి' మాసపత్రికలో ఆయన చిత్రకారుడిగా, ఛాయాగ్రాహకుడిగా 1951 నుండి 1974 చివరి దాకా పనిచేశారు. వార, మాస పత్రికల ముఖచిత్ర రచనతోపాటు సినిమాలు, క్రీడలు, సభలు సమావేశాలను ప్రత్యేకంగా తన కెమెరాతో పాఠకుల కళ్లముందు నిలపడంలో విశిష్ట కృషి చేశారు. 1975లో హైదరాబాద్‌లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు, ప్రభుత్వం ఆయనను ప్రత్యేకంగా పిలిపించి, వివిధ రంగాల్లో చిరస్మరణీయులైన తెలుగు ప్రముఖుల మూర్తులను చిత్రింపజేసింది. రెండు నెలలపాటు అక్కడే ఉండి 120 మంది దాకా ప్రముఖాంధ్రుల మూర్తిచిత్రాలను (పోర్‌ట్రయిట్‌లను) ఆయన గీశారు. ప్రపంచ మహాసభల సందర్భంగా గాంధీభవన్‌లో ప్రదర్శించిన ఆ వర్ణచిత్రాలన్నీ 'తరతరాల తెలుగు వెలుగులు' శీర్షికన ఇప్పటికీ 'తెలుగు విశ్వవిద్యాలయం'లో ఉన్నాయి. చెన్నైలోని మైలాపూర్‌ ప్రాంతంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షతో ఆత్మబలిదానం చేసుకున్న భవన ప్రాంగణం (ఇప్పటి 'అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనం')లో ఇప్పటికీ కళకళలాడుతూ కనిపించే పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి, తెలుగు ప్రముఖుల తైల వర్ణ చిత్రాలు దసిక రామలింగేశ్వర రావు కుంచె నుంచి జాలువారినవే!
దాదాపు ఏడు దశాబ్దాలుగా చెన్నపట్నంతో రామలింగేశ్వరరావుకు విడదీయరాని అను బంధముంది. 'ఆంధ్రపత్రిక' కార్యాలయం చెన్నపట్నం నుంచి హైదరాబాద్‌కు తరలివెళ్ళినా, ఆయన తన చేతిలోని కళను నమ్ముకొని ఇక్కడే జీవితం సాగించారు. రామలింగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 1925 సెప్టెంబర్‌ 1వ తేదీన జన్మించారు. ఆయనకు చిన్ననాటి నుంచి కళల పట్ల మక్కువ. 1944లో చెన్నైలోని 'స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌' (ఇప్పటి 'కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్స్ట్‌')లో చేరారు. ప్రసిద్ధ చిత్రకారుడు దేవీప్రసాద్‌ రారు చౌధురి శిష్యరికంలో తనలోని చిత్రకళా ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారు. చిత్రరచనతోపాటు శిల్పకళలోనూ, ఛాయాగ్రహణంలోనూ నైపుణ్యాన్ని అందిపుచ్చుకున్నారు. ఇవాళ్టికీ చెన్నైలోని మెరీనా సముద్ర తీరానికి ప్రతీకలుగా కనిపించే ప్రసిద్ధ శిల్పాలైన గాంధీ బొమ్మ, కార్మిక విజయం (ట్రయంఫ్‌ ఆఫ్‌ లేబర్‌)ల రూపకల్పనలో దేవీప్రసాద్‌ రారుకి రామలింగేశ్వరరావు సహాయకుడిగా పనిచేశారు.
చదువుకొనే రోజుల్లోనే 1946లో అప్పటి భారత ప్రభుత్వం 'ఆలిండియా ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ సొసైటీ' (ఇప్పటి 'లలిత కళా అకాడమి') పక్షాన జరిపిన 'అంతర్జాతీయ సమకాలీన చిత్ర ప్రదర్శన'లో రామలింగేశ్వరరావు ప్రథమ బహుమతి పొందారు. 1947లో భారత ప్రభుత్వం నుంచి 'గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌' అందుకున్నారు. అలాగే, 'ప్రోగ్రెసివ్‌ పెయింటర్స్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌'తో సహా పలు చోట్ల బహుమతులు, ప్రముఖుల ప్రశంసలు పొందారు. తెలుగు చిత్రకళా రంగంలో దామెర్ల రామారావు తదితరులది తొలి తరమైతే, అడివి బాపిరాజు ప్రభుతులది మలి తరమైతే, వేలూరి రాధాకృష్ణ, హెచ్‌.వి. రామ్‌గోపాల్‌లతోపాటు దసిక రామలింగేశ్వరరావు ఆ తరువాతి తరానికి చెందిన ప్రముఖులు. ముందు తరానికి చెందిన ప్రముఖ తెలుగు చిత్రకళాచార్యులైన అడివి బాపిరాజు (గుంటూరు), అంకాల వెంకట సుబ్బారావు (భీమవరం), వరదా వెంకటరత్నం(రాజమండ్రి), చేమకూర సత్యనారాయణ (మద్రాసు) తదితరులు రామలింగేశ్వరరావు కళాకౌశలాన్ని ప్రశంసించారు.
కాలక్రమంలో ప్రకృతి దృశ్య చిత్రణ (ల్యాండ్‌స్కేప్‌ పెయింటింగ్‌), వర్ణ సమ్మేళన వైచిత్రి, మూర్తి చిత్రణ (పోర్‌ట్రయిట్‌)ల్లో రామలింగేశ్వరరావు సిద్ధహస్తులు. ఫొటోగ్రఫీలోనూ అంతే నైపుణ్యం గడించారు. పత్రికలో పనిచేస్తున్నప్పుడు రాష్ట్రంలో ప్రకృతి బీభత్సాలు, ప్రమాదాలు జరిగినప్పుడు పటం గీసి, ఆ మ్యాప్‌ సాయంతో ప్రమాద ఘటనా స్థల వివరాలను తెలియజెప్పడం లాంటి విధానాలను అప్పటి 'ఆంధ్రపత్రిక' సంపాదక మండలిలోని మద్దాలి సత్యనారాయణ శర్మ ప్రోత్సాహంతో రామలింగేశ్వరరావు విశేసంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. నిరంకుశ నిజాం పాలనలోని హైదరాబాద్‌ సంస్థానంపై భారత ప్రభుత్వం 'పోలీసు చర్య' చేపట్టినప్పుడు షోలాపూర్‌, కర్నూలు, కొండపల్లి- ఇలా రకరకాల వైపుల నుంచి భారత సైన్యాలు కదలివస్తున్న వైనాన్ని బాణాల గుర్తులు వేస్తూ, పటంగా రామలింగేశ్వరరావు చిత్రించారు. 'ఆంధ్రపత్రిక' తన ప్రత్యేక కృషిగా తొలి పుటలో దాన్ని ప్రచురించింది. ఆ మ్యాప్‌ జరుగుతున్న సంఘటనలను పాఠకుల కళ్లకు కట్టడమే కాక, పత్రికా రంగంలో సంచలనమై, అందరి ప్రశంసలూ అందుకుంది.
ప్రముఖ రచయితలు, పాత్రికేయులు తిరుమల రామచంద్ర, ముళ్ళపూడి వెంకట రమణ, సూరంపూడి సీతారామ్‌, పోలవరపు శ్రీరాములు, గోళ్ళమూడి రామచంద్రరావు, నండూరి రామమోహనరావులు 'ఆంధ్రపత్రిక'లో సహౌద్యోగులు. మృదు స్వభావి, హాస్య ప్రియుడూ అయిన రామలింగేశ్వరరావు చివరి వరకు క్రీడలన్నా, కళా రంగ అంశాలన్నా ఆసక్తి చూపేవారు. ఆయనకు భార్య (భానుమతి), ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. డిసెంబరు 29వ తేదీ శనివారం ఉదయం చెన్నైలోని బిసెంట్‌నగర్‌లో శ్మశాన వాటికలో రామలింగేశ్వరరావు అంత్యక్రియలు జరిగాయి. సరిగ్గా, నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సమయంలో, చెన్నై మెరీనా సముద్ర తీరంలోని గాంధీ శిల్పానికి మరమ్మతులు చేస్తూ, పునరుద్ధరిస్తున్న వేళ ఆ రెంటితోనూ అవినాభావ సంబంధమున్న దసిక రామలింగేశ్వరరావు కన్ను మూయడం తెలుగు చిత్రకళా ప్రియులకు తీరని లోటు. ఆయన గీసిన ప్రసిద్ధ వర్ణ చిత్రాలను భద్రంగా భావితరాలకు అందించడంలో అందరితోపాటు మన ప్రభుత్వ పెద్దలకూ బాధ్యత ఉంది.

No comments:

Post a Comment