Saturday 29 December 2012

అఖిల పక్షం

కాంగ్రెసుకు చిక్కులు: జగన్, చంద్రబాబులకు ఊరట 
న్యూఢిల్లీ: 
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై శుక్రవారం నిర్వహించిన అఖిల పక్ష భేటీపై కొనసాగుతూ వచ్చిన ఉత్కంఠకు తెర పడింది. ఈ సమావేశంలో వెల్లడించే అభిప్రాయాల ద్వారా చిక్కుల్లో పడుతారని భావించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు ఊరట లభించినట్లే. తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని వెల్లడించడంలో చంద్రబాబు నాయుడు విజయం సాధించినట్లే. తెలంగాణ సమస్యను కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టేయడంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు దాదాపుగా విజయం సాధించినట్లే. నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అంటూ తమ నిర్ణయాన్ని వినిపించడం ద్వారా ఆ రెండు పార్టీలు తమ ఆధిక్యతను ప్రదర్శించాయి. తాము 2008లోనే ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చామని తెలుగుదేశం పార్టీ చెప్పింది. కాగా, తాము తెలంగాణకు అనుకూలమని స్పష్టంగా చెప్పకపోయినా, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని చెప్పడం ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా సంక్షోభం నుంచి గట్టెక్కిందని చెప్పాలి. కాంగ్రెసు పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా ఆ రెండు పార్టీలకు ఉపకరించింది. తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పరోక్షంగా తెలంగాణకు అనుకూలంగా చెప్పినట్లే. కాంగ్రెసు మాత్రమే రెండు నిర్ణయాలను చెప్పింది. దీంతో కాంగ్రెసు ఇరకాటంలో పడినట్లేనని చెప్పాలి. కాంగ్రెసు స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం వల్ల మాత్రమే తెలంగాణ సమస్యకు పరిష్కారం లభించడం లేదనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడంలో ఆ రెండు పార్టీలు విజయం సాధించాయి. కాంగ్రెసు పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుందని అఖిల పక్ష సమావేశం ద్వారా వెల్లడైంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తెలంగాణ సమస్యను నాన్చడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం లేదనేది తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సిపిఎం, మజ్లీస్‌లతో పాటు అన్ని పార్టీలు సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరాయి. సమైక్యవాదాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని కాంగ్రెసు సీమాంధ్ర ప్రతినిధి చెప్పగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రతినిధి కెఆర్ సురేష్ రెడ్డి చెప్పారు. అయితే, పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు గురువారం సాయంత్రం జరిగిన పార్టీ సమావేశంలో చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు తెలంగాణ బంతి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కోర్టులో పడినట్లే. తెలంగాణ ఏర్పాటు అనుకూలంగానో, వ్యతిరేకంగానో నిర్ణయం తీసుకోవాల్సిన పూర్తి బాధ్యతను కేంద్ర ప్రభుత్వంపై పెట్టడంలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఫలితం సాధించాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రభావం కాంగ్రెసు మీద మాత్రమే పడే విధంగా ఆ పార్టీలు వ్యవహరించాయి. మొత్తం మీద, తెలంగాణపై నిర్ణయం తీసుకోకపోతే పూర్తిగా కాంగ్రెసు పార్టీ మాత్రమే లక్ష్యంగా మారే పరిస్థితి ఏర్పడింది

No comments:

Post a Comment