Tuesday 18 December 2012

ఇంటింటికి ఈ-మీటర్

ఇంటింటికి ఈ-మీటర్
మెకానికల్ మీటర్ల స్థానంలో ఎలక్ట్రానిక్ మీటర్లు
ప్రభుత్వ ఆఫీసులకు ప్రీ-పెయిడ్ మీటర్లు

డబ్బులు చెల్లించి రీచార్జి చేయించుకోవాల్సిందే
ఎగవేతదార్లను 'వెబ్‌సైట్'లోకి ఈడ్చేస్తారు
(హైదరాబాద్- న్యూస్ మీడియా) : 
మీ ఇంటి కరెంటు మీటరు వైపు ఒకసారి చూడండి! అది ఎలక్ట్రానిక్‌దా? మెకానికల్‌దా? మామూలు మెకానికల్ మీటర్ అయితే... అతి త్వరలోనే దాని స్థానంలోకి ఎలక్ట్రానిక్ మీటర్ వచ్చేస్తుంది! ఖర్చు చేసిన కరెంటుకు పక్కాలెక్క చెబుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 50 శాతం మెకానికల్ మీటర్లే ఉన్నాయి. ఇప్పుడు వంద శాతం ఎలక్ట్రానిక్ మీటర్లను బిగించాలని డిస్కంలు నిర్ణయించుకున్నాయి.

చార్జీలను కచ్చితంగా వసూలు చేసి, ఆదాయం పెంచుకోవడమే విద్యుత్ శాఖ ముఖ్య లక్ష్యం. వాస్తవ వినియోగం కచ్చితంగా నమోదు కావాలంటే.. ఎలక్ట్రానిక్ మీటర్‌ను ఏర్పాటు చేయడమొక్కటే పరిష్కారమని విద్యుత్ శాఖ భావిస్తోంది. ఎలక్ట్రానిక్ మీటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) సీఎండీ హీరాలాల్ సమారియా మంగళవారం నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) సీఎండీలకు లేఖలు రాశారు.

మెకానికల్ మీటర్లవల్ల విద్యుత్ చౌర్యం జరుగుతోందని... వాటి స్థానంలో ఎలక్ట్రానిక్ మీటర్లను ఏర్పాటు చేయాలని దశాబ్దం కిందటే నిర్ణయించారు. కానీ... 50 శాతం మీటర్లను మాత్రమే మార్చగలిగారు. సరైన మీటరింగ్ లేనందున డిస్కంలకు రావాల్సిన ఆదాయం రావడం లేదన్న అభిప్రాయం విద్యుత్ శాఖలో నెలకొంది. రాష్ట్ర విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి మృత్యుంజయ సాహూ తాజాగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, రెవెన్యూ ఆదాయం, భవిష్యత్తు డిమాండు, విద్యుదుత్పత్తి తదితర అంశాలపై మేధోమథనం జరిపారు.

ఇందులో ట్రాన్స్‌కో సీఎండీ హీరాలాల్ సమారియా, జెన్‌కో ఎండీ కె. విజయానంద్, సీపీడీసీఎల్ సీఎండీ అనంతరాము, ట్రాన్స్‌కో డైరెక్టర్లు పలువురు పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలకు పైగా జరిగిన మేధోమథనంలో... డిస్కంలు రెవెన్యూ ఆదాయం పెంచుకునే మార్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే.. యుద్ధ ప్రాతిపదికన ఎలక్ట్రానిక్ మీటర్లను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ 50 శాతానికిపైగా ఇళ్లలో కాలం చెల్లిన మెకానిక్ మీటర్లనే ఉపయోగిస్తున్నారు. ఈ మీటర్ల వల్ల వాస్తవ విద్యుత్ వినియోగం లెక్కలు రావడం లేదు.

ఫలితంగా... సరఫరా అయిన కరెంటుకూ, మీటరింగ్ జరిగిన కరెంటుకూ మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ తేడాను కప్పిపుచ్చుకునేందుకు, వాటిని వ్యవసాయ విద్యుత్ వినియోగం కిందనో, సరఫరా, పంపిణీ నష్టాల కిందో చూపిస్తున్నారు. వాస్తవ వినియోగానికి తగ్గట్టుగా విద్యుత్ చార్జీలను వసూలు చేయాలంటే.. ఎలక్ట్రానిక్ మీటర్లను ఏర్పాటు చేయడమే సరైన పరిష్కారమని మేధోమథనంలో నిర్ణయించారు. ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలంటూ డిస్కంలకు లేఖలు రాయాలని ట్రాన్స్‌కో సీఎండీ సమారియాను ముఖ్య కార్యదర్శి సాహూ ఆదేశించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రిీ-పెయిడ్ మీటర్లు...
ప్రభుత్వ శాఖలు కోట్లలో బకాయిలు పడటం... ఆ డబ్బుల కోసం ముఖ్యమంత్రి స్థాయిలో పైరవీలు చేసుకోవాల్సి రావడం... ప్రభుత్వ ఆఫీసులకే కరెంటు కట్ చేయాల్సి రావడం... ఇలాంటి కష్టాలన్నింటికీ తెర దించాలని డిస్కమ్‌లు నిర్ణయించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ప్రి-పెయిడ్ మీటర్ల విధానాన్ని అమలు చేయాలని మేధోమథనంలో నిర్ణయించారు. ఈ విధానాన్ని ఈపీడీసీఎల్ పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మంచి ఫలితాలు సాధించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో, ప్రభుత్వ స్కీములన్నింటికీ ప్రీ-పెయిడ్ మీటర్ల విధానాన్ని అమలు చేయాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది.

ప్రిీ-పెయిడ్ మీటర్ల విధానంలో, ఆయా ప్రభుత్వ శాఖలన్నీ తమ కార్యాలయాలు, స్కీములకు కావాల్సిన విద్యుత్ సరఫరా కోసం ముందుగానే నగదు చెల్లించి (ప్రీ-పెయిడ్) మీటర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డబ్బుకు సరిపడా కరెంటు ఖర్చు పెట్టగానే... కనెక్షన్ కట్ అవుతుంది. అంతకంటే ముందే... మళ్లీ డబ్బు చెల్లించి రీచార్జి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల అటు డిస్కంల ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ వినియోగంలో క్రమశిక్షణ మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
ఇక ప్రతి నెలా 15 కల్లా కరెంటు బిల్లుల జారీ..
కరెంటు బిల్లుల జారీ విధానాన్ని సమూలంగా మార్చాలని మేధోమథనంలో నిర్ణయించారు. ఇక నుంచి ప్రతి నెలా 15వ తేదీలోగా వినియోగదారులకు బిల్లులు ఇవ్వాలని... బిల్లుల చెల్లింపునకు కనీసం వారం రోజుల సమయమివ్వాలని నిర్ణయించారు. ప్రస్తుత బిల్లుల జారీ విధానం వల్ల వినియోగదారులకు తక్కువ సమయం ఉంటుండటంతో, బిల్లుల చెల్లింపులో తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోంది. సకాలంలో బిల్లు చెల్లించలేని పక్షంలో... విద్యుత్ సిబ్బంది ఆ వెంటనే విద్యుత్ సరఫరా వ్యవస్థను నిలిపివేస్తున్నారు.

దీనివల్ల డిస్కంలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ఇటు డిస్కంలకు, అటు వినయోగదారులకు సౌకర్యంగా ఉండేలా బిల్లుల జారీని ప్రతి నెలా 15వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే, బిల్లులు ఎగవేసే వారి పేర్లను బహిర్గతం చేయాలని మేధోమథనంలో నిర్ణయించారు. కరెంటు బిల్లుల ఎగవేతదారుల పేర్లను ఆయా డిస్కంలు తమ వెబ్‌సైట్లలో ప్రదర్శిస్తాయి. ఏ స్థాయి వారైనా సరే... వారిని 'వెబ్‌సైట్'కు ఈడ్చడం ఖాయమని విద్యుత్ శాఖ వర్గాలు వివరించాయి.

No comments:

Post a Comment