Friday 21 December 2012

గాయని నిత్యశ్రీ  భర్త మహదేవన్ ఆత్మహత్య

చెన్నై, డిసెంబర్ 20 :
 ప్రముఖ కర్ణాటక విద్వాంసురాలు, కలైమామణి నిత్యశ్రీ మహదేవన్ భర్త నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అది తట్టుకోలేక ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. అపస్మారక స్థితిలోని ఆమెను కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పినట్లు తెలిసింది. నిత్యశ్రీ మహదేవన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు.

మహదేవన్ వయస్సు 45 ఏళ్లు కాగా, నిత్యశ్రీ వయస్సు 39. ప్రఖ్యాత కర్ణాటక విద్వాంసురాలు డీకే పట్టమ్మాళ్ మనువరాలైన నిత్యశ్రీ.. లెక్కకు మించి కచేరీలు చేసి, కర్టాటక సంగీత ప్రపంచంలో వెలుగొందుతున్నారు. దక్షిణాది సినిమాల్లోనూ ఆమె గాయనిగా రాణించారు. జీన్స్ చిత్రంలో 'కన్నులతో చూసేది...' పాటను గానం చేసింది ఆమే. చెన్నైలో జరుగుతున్న మార్గాళి ఉత్సవాల్లో భాగంగా గురువారం నిత్యశ్రీ కచేరీ చేయాల్సి వుంది. ఈ నేపథ్యంలో గురువారం అనూహ్య పరిణామాల నడుమ చోటు చేసుకున్న మహదేవన్ ఆత్మహత్య, నిత్యశ్రీ ఆత్మహత్యాయత్నం సంగీత ప్రపంచాన్ని నివ్వెరపరచింది.
అందరూ చూస్తుండగానే...
గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కారులో ఇంటి నుండి బయలుదేరిన మహదేవన్, కొట్టూరుపురం వంతెన మధ్యకు చేరుకున్న తరువాత డ్రైవర్‌ని కారు ఆపమని చెప్పి, కిందకు దిగారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వంతెన అంచుకు చేరుకున్న ఆయన, హఠాత్తుగా కూవం నదిలోకి దూకేశారు. అది చూసిన కారు డ్రైవర్, వంతెనపై సంచరిస్తున్న పాదచారులు నివ్వెరపోయారు.

సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మహదేవన్‌ను రక్షించేందుకు ఉపక్రమించారు. అయితే వారు బయటికి తీసే లోపే మహదేవన్ ప్రాణాలు కోల్పోయారు. భర్త ఆత్మహత్య వార్త తెలియగానే నిత్యశ్రీ షాక్‌కి గురయ్యారు. కచేరీ కోసం సిద్ధమవుతోన్న ఆమె తీవ్ర మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగినట్లు తెలిసింది. అపస్మారక స్థితిలో వున్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే అడయార్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఆమెకు చికిత్స చేసిన వైద్యులు, ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. అనంతరం నిత్యశ్రీని ఇంటికి పంపించేశారు. భార్యాభర్తల నడుమ విభేదాల వల్లనే మహదేవన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.కాగా నిత్యశ్రీ ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తను ఆమె కుటుంబసభ్యులు ఖండించారు. భర్త ఆత్మహత్యతో ఆమె షాక్‌కు గురయ్యారని తెలిపారు.

No comments:

Post a Comment