Sunday 23 December 2012

'ఆంధ్రోడు' అనొద్దు: టి నేతలకు ఆర్.నారాయణ మూర్తి 

హైదరాబాద్:
 తెలంగాణ ఉద్యమకారులు ఆంధ్రోడు అంటూ మాట్లాడవద్దని ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణ మూర్తి శనివారం అన్నారు. హైదరాబాదులోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ధూం ధాం దశాభ్ది ఉత్సవాలను నిర్వహించారు. ప్రజా కళాకారిణి విమలపై అక్రమ కేసులను నిరసిస్తూ ధూం ధాం దశాబ్ధి ఉత్సవాలను నిరసన సభలుగా నిర్వహిస్తున్నట్లు ధూం ధాం అధ్యక్షుడు రసమయి బాలకిషన్ తెలిపారు. ఈ సందర్భంగా .నారాయణ మూర్తి మాట్లాడారు. ఉద్యమకారులు ఆంధ్రోడు అంటూ మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రజలకు కూడా ఆత్మ గౌరవం ఉంటుందనే విషయం గుర్తించాలన్నారు. విమలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, బేషరతుగా విడుదల చేయాలని, తెలంగాణ భాషను పట్టించుకోని ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని ఇందులో తీర్మానాలు చేశారు.
 గద్దర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని, తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్సేనని అన్నారు. తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ ఉద్యమం కాదని, ఇది సాంస్కృతిక ఉద్యమమని కె.శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ భావంపై విస్తృత ప్రచారం చేసింది కవులు, కళాకారులే అన్నారు. ధూం ధాం తెలంగాణ ప్రజలు చేస్తున్న సాంస్కృతిక పోరాట ప్రకటన అని, అది మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని వర్గాలు కల్సి కోట్లాడాల్సిన అవసరముందని ఎంపి వివేక్ అన్నారు. శనివారం వెల్లడైన ఆర్టీసి గుర్తింపు సంఘ ఎన్నికల ఫలితాలతో ఆంధ్ర ప్రజలు తెలంగాణవాదానికి అనుకూలంగా ఉన్నారని అర్థమవుతోందని సిద్దిపేట తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. 28 లోపు తెలంగాణపై వైఖరి చెప్పకుంటే వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల వద్ద ధూం ధాం నిర్వహిస్తామని టిజెఏసి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. కేంద్రంలో కాంగ్రెసు తెలంగాణ ఇవ్వని పక్షంలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం ఇస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు ఆపాలని, తెలంగాణ రాష్ట్రం చూడటం కోసమైనా బతికి ఉందామని, బతికి ఏదైనా సాధించుకోవాలన్నారు.

No comments:

Post a Comment