Wednesday 26 December 2012

తెలంగాణపై....
సోనియాకు చిక్కు?


హైదరాబాద్‌, డిసెంబరు 26 : తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానాన్ని చిక్కుల్లో పడేసే విధంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు వ్యూహాన్ని రచించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చిక్కులు కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 28న జరిగే అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్ వైఖరిని చీల్చి చెండాడాలని వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అనుకుంటున్నాయి. తెలంగాణ అంశానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం మెడ మీద కత్తి వేలాడుతున్నట్లే చెప్పాలి. అఖిలపక్ష సమావేశంలో ముందుగా అన్ని పార్టీలూ తమ వైఖరి చెప్పిన తర్వాత తమ వైఖరి చెబుతామని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే, పరిస్థితి అందుకు అనుకూలంగా లేనట్లు కనిపిస్తోంది. తెలంగాణకు అనుకూలమని కాంగ్రెస్ అధిష్టానం చెప్తే పరిస్థితి పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. జెసి దివాకరరెడ్డి లాంటి వారు రాయలసీమ ప్రాంతానికి అఖిలపక్షంలో ప్రాతి నిధ్యం కల్పించాలని లేఖ రాస్తే, తనను అఖిల పక్షానికి పంపించాలని మంత్రి శైలజానాథ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అటు సీనియర్‌ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు సమైక్యాంధ్ర జేఏసీ, విద్యార్థి సంఘాల నేతలతో చురుగ్గా ఉంటున్నారు. లగడపాటి రాజగోపాల్‌ లాంటి వారు ఈ అఖిలపక్షం వల్ల ఒనగూరే ప్రయోజనమేదీ ఉండ బోదని ప్రచారం చేస్తున్నారు. సీమాంధ్ర నాయకులు తమ ఏర్పాట్లో తాము ఉంటే, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అవకాశం చిక్కినప్పుడల్లా నాయకత్వం మీద విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందో అవగాహన కోసమే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేశామని, ముందుగా భేటీలో పాల్గొనే అన్ని పార్టీలు (కాంగ్రెస్‌ మినహా) తమ అభిప్రాయాలను చెబితే వాటిని పరిశీలించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని షిండే మంత్రిత్వ శాఖ నోట్‌ జారీ చేసింది. ఇది తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఇబ్బందుల్లోకి నెట్టింది. కేంద్రం తెలంగాణపై మరోసారి నాన్చుడు వైఖరి అవలం బించేందుకే ఈ ఎత్తుగడలను అనుసరిస్తోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణా మాల ఫలితం గానే కేకే లాంటి సీనియర్‌ నేతలు మాటల తూటాల వాడి మరింత పెంచారు. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్‌ ప్రజాద్రోహం చేసిన ట్టవు తుందన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఈ నెల 28వ తేదీన జరిగే సమావేశంలో పార్టీ తెలంగాణకు అనుకూలంగా కనిపించకపోతే ఇతర పార్టీల్లో చేరడానికి కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సభ్యులు సిద్ధపడుతున్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి లాంటి వారు తెలంగాణ ఇవ్వ పోతే తమ దారి తాము చూసుకుంటామని ఇప్పటికే ప్రకటించేశారు. సీనియర్‌ ఎంపీ మందా జగన్నాథం సైతం తమకు టీఆర్‌ఎస్‌ నుంచి ఆహ్వానం ఉందని, తెలంగాణపై ఏదో ఒకటి తేల్చకపోతే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని బహిరంగంగానే చెప్పారు. మరో ఎంపీ వివేక్‌ అటు అధిష్ఠానం పైనా, ఇటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపైనా అవకాశం దొరికినప్పుడల్లా కత్తులు దూస్తున్నారు. అఖిలపక్షంలో ఏ నిర్ణయమూ చెప్పకపోతే ఆ సమావేశానికి హాజరయ్యే అన్ని పార్టీల నుంచీ ఎదురు దాడిని ఎదుర్కునే అవకాశం ఉంది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పాటు సిపిఎం, సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అఖిల పక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసే వ్యూహాన్ని అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment