Sunday 23 December 2012




(శ్రీకాకుళం- న్యూస్ మీడియా)

శ్రీకాకుళం జిల్లాలో మరోమారు ఖాకీలు తమ పశు బలం ప్రదర్శించారు. ఉరుము లేని పిడుగులా బడుగులపై విరుచుకుపడ్డారు. రక్షణ కల్పించాల్సింది పోయి రాక్షసంగా వ్యవహరించారు. బడా పారిశ్రామికవేత్తలకు దన్నుగా నిలిచి బడుగు జీవులపై ప్రతాపం చూపారు. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం అరిణాం-అక్కివలసలో కాలుష్యంతో మృత్యు పరిశ్రమగా మారిన నాగార్జున అగ్రికెమ్‌ ను కొనసాగించడానికి కాలుష్య నియంత్రణ మండలి మరో రెండు నెలలు అనుమతి ఇవ్వడంపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు శనివారం ప్రయత్నించిన జనాన్ని కమ్మేశారు. వారు నిరసన గళం విప్పకముందే.. వీరు విరుచుకుపడ్డారు.
అడ్డుకున్న వారిని నిర్ధాక్షిణ్యంగా లాగి అవతలికి విసిరేశారు. మహిళలను జుత్తు పట్టుకుని ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్లలోకి ఎక్కించారు. మహిళలు, పురుషులు, వృద్ధులు, మాలధారులు అన్న విచక్షణ లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చితగ్గొట్టారు. లాఠీలతో కుళ్లబొడిచారు. పొలాల వెంట పరుగులు తీయించారు. సుమారు గంటసేపు వీరంగం వేసి అరిణాం అక్కివలసలోని అగ్రికెమ్ ఫ్యాక్టరీ ప్రాంతాన్ని రణరంగంగా మార్చేశారు. ఈ కుమ్ములాటల్లో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. మరో మహిళకు కడుపులో గట్టిగా దెబ్బ తగిలింది. ఆందోళనకారులకు నేతృత్వం వహించిన శ్రీనివాసానంద స్వామితోపాటు 36 మందిపై కేసులు బనాయించారు. రోజంతా వారిని అదుపులో ఉంచుకుని రాత్రి విడిచిపెట్టారు.

రాక్షసులైన రక్షక భటులు!
  ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు రాక్షసంగా వ్యవహారించారు. తమ బతుకులను నాశనం చేస్తున్న ఎన్‌ఏసీఎల్ వద్దంటూ ఆందోళనకు దిగిన వారిపై విరుచుకుపడ్డారు. అభం శుభం తెలియని వారిపై తమప్రతాపం చూపి కసితీరా చితక్కొట్టారు. చిన్నపిల్లలు... వృద్దులు... మహిళలు.భక్తులని చూడకుండా విచక్షణారహితంగా లాఠీలకు పని చెప్పి గాయపరిచారు. వివరాల్లోకి వెళితే.... చిలకపాలెం సమీపంలోని నాగార్జున అగ్రికెం పరిశ్రమకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాత్కాలికంగా ఇచ్చిన మూడు నెలల గడువును మరో రెండు నెలలు పెంచింది. గడువు పెంచడా న్ని నిరసిస్తూ పలు గ్రామాల ప్రజలు శనివారం నిరసనకు దిగారు. పొందూరు మండలం నరసాపురం అగ్రహారం, కంచరాం, లోలుగు గ్రామాలకు చెందిన ప్రజలు నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమ వల్ల తమ గ్రామాలకు నష్టం వాటిల్లుతోందని, పరిశ్రమను మూయించేందుకు శాంతి యుతంగా పోరాడాలని భావించారు.

కుటుంబ సభ్యులతో కలిసి ఎన్‌ఏసీఎల్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు శ్రీని వాసానందస్వామిజీతో కలిసి పరిశ్రమ వద్దకు బయల్దేరి వచ్చా రు. లొలుగు నుంచి ర్యాలీగా వచ్చిన వీరు పరిశ్రమ జంక్షన్‌కు చేరుకున్నారు. ఇక్కడ నిరసన గళం విప్పకముందే వీరిపై ఖాకీలు జూలం ప్రదర్శించారు. పొందూరు రహదారి నుంచి పరిశ్రమకు వెళ్లే జంక్షన్‌లో శాంతియుతంగా ధర్నా చేయాలని భావిస్తున్న సమయానికే డీఎస్పీ అర్జున్‌తో పాటు పోలీసు బలగాలు చేరుకుని గందరగోళం సృష్టించారు. స్వామిజీని అరెస్ట్ చేయడానికి డీఎస్పీ ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రజలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు.

విచక్షణా రహితంగా ప్రవర్తించిన పోలీసులు
తోపులాట అనంతరం పోలీసులు విచక్షణా రహితంగా వ్యవహరించారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదా రు. వృద్ధులు.. పిల్లలు.. మహిళలు.. భవాని భక్తులని కూడా చూడకుండా కొట్టారు. మహిళలను ఈడ్చుకెళ్లి ట్రాక్ట ర్ ట్రక్కుల్లో పడేశారు. జుట్టు పట్టుకుని లాక్కొని వెళ్తుంటే వారికుటుంబ సభ్యులు నిస్సాహులైన అర్తనాదాలు చేస్తూ విలపించారు. తాము ఏం తప్పు చేశామని.. మమ్మల్ని వదిలిపెట్టండి అన్నా వినిపించుకోలేదు. సుమారు గంట పాటు ఈ ప్రదేశం రణరంగాన్ని తలపించింది. బలహీనం గా ఉన్న ఓ విదార్థినిని ఐదుగురు మహిళా పోలీసులతో పాటు ఎస్సై నారీమణి జుట్టుపట్టుకుని లాక్కెళ్లి మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తించారు.

పలువురికి గాయాలు
పోలీసు జులుంలో పలువురు గాయపడ్డారు. నరసాపురం అగ్రహారానికి చెందిన పిన్నింటి అసిరమ్మ స్పృహకోల్పోయి రహదారిపై పడిపోయింది. ఇదే సమయంలో పలువురు ఆమె పైనుంచి మట్టుకొని వెళ్లడంతో చనిపోయిందని కుటుంబసభ్యులు, ఆందోళనకారులు ఆందోళన చెందారు. పోలీసుల తీరును దుయ్యబట్టారు. ఇదే గ్రామానికి చెందని మరో మహిళలను పోలీసులు ఈడ్డుకెళ్లి కొట్టడంతో కడుపునొప్పి రావడంతో తీవ్రంగా రోదించినా ఖాకీల మనసు కనికరించలేదు.

ఆడ్డకున్నా ఆగని స్వామిజీ అరెస్ట్
స్వామిజీని అరెస్టు చేసేందుకు దురుసుగా వచ్చిన పోలీసులను మహిళలు అడ్డుకున్నారు. అయితే వారిని పోలీసులు పక్కకు లాగేసి స్వామిజీని అరెస్టు చేసి జీపు ఎక్కించి తీసుకెళ్లిపోయారు. మిగిలిన వారిని వెంటాడి తరిమికొట్టారు. భయంతో పోలాల్లోకి పరుగు తీసిన వారిని బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. అరెస్టయిన వారిలో శ్రీనివాసా నంద స్వామిజీతో పాటు కలిశెట్టి నాగన్నాయుడు, అప్పలనాయుడు, మోహన్, పిన్నింటి తాత, పిన్నింటి పైడితల్లి, సత్తెమ్మ, కాంతమ్మ తదితరులున్నారు.

36 మంది అరెస్టు-విడుదల
ఎన్‌ఏసీఎల్‌కు వ్యతిరేకంగా పోరాటానికి వచ్చిన 36 మంది పై కేసులు నమోదు చేసి ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌కి తరలించా రు. శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పూచీకత్తుపై పోలీసులు వీరిని విడిచిపెట్టారు.

No comments:

Post a Comment