Tuesday 18 December 2012

 
 పార్లమెంటుని కుదిపేసిన గ్యాంగ్‌రేప్: జయ ఉద్వేగం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆదివారం రాత్రి జరిగిన సామూహిక అత్యాచార ఘటనను పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ లేవనెత్తింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి అత్యాచార ఘటనపై చర్చ చేపట్టాలని బిజెపి సభ్యులు నోటీసులు ఇచ్చి నిరసనకు దిగారు. బిజెపి సభ్యులకు నచ్చజెప్పేందుకు చైర్మన్ ప్రయత్నించారు. వారు ఎంతకూ శాంతించక పోవడంతో సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనా మరో అరగంట వాయిదా వేశారు. ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనను బిజెపి నేత షాన్‌వాజ్ హుస్సేన్ లేవనెత్తుతామని చెప్పారు. రాజ్యసభలో స్మృతి ఇరానీ నోటీసు ఇచ్చారు. దేశ రాజధానిలో క్రైమ్ రేటును తగ్గించలేక పోతున్నారని బిజెపి ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బిజెపి ఈ రోజు ఉదయం మాట్లాడుతూ... ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటనను తాము పార్లమెంటులో లేవనెత్తుతామని చెప్పింది. ఈ ఘటన చాలా సీరియస్ అంశమని.. ఇలాంటివి తరుచూ జరుగుతున్నాయని బిజెపి వ్యాఖ్యానించింది. తాము పార్లమెంటులో దీనిని లేవనెత్తుతామని లోకసభా బిజెపి పక్షనేత సుష్మా స్వరాజ్ తెలిపారు. బిజెపి అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురిని గుర్తించారు. సభలో జయాబచ్చన్ ఉద్వేగంతో ప్రసంగించారు. అత్యాచార ఘటనపై ప్రభుత్వం సమాధానం సరిగా లేదని విమర్శించింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు ఈ రోజు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల ఆందోళన సామూహిక అత్యాచార ఘటనపై వసంత్ విహార్ పోలీసు స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇలాంటివి తరుచూ జరుగుతుండటంపై విద్యార్థులు పోలీసులను ప్రశ్నించారు. బస్సు డ్రైవర్, మరొకరు కలిసి ఈ అత్యాచారానికి పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నిందుతులను వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అత్యంత గోప్యంగా విచారిస్తున్నారు. కాగా ఢిల్లీలో ఆదివారం రాత్రి ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. సామూహిక అత్యాచారానికి గురైన విద్యార్థిని ఢిల్లీలోని షఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటనలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వెంటిలేటర్‌పై ఆమెను ఉంచారని సమాచారం. కడుపులో ఆమెకు తీవ్రమైన దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. చిన్నప్రేవు దెబ్బ తిన్నట్లు సమాచారం. ఆమెను ఓ గట్టి వస్తువుతో కొట్టినట్లు కూడా తెలుస్తోంది. అతని ప్రియుడికి చికిత్స చేసి అతన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. అతని వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. బాలికపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అన్నారు. పారా మెడికల్ విద్యార్థిని న్యూఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన విషయం తెలిసిందే. ఓ కాలేజీ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఓ బస్సులో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వారిద్దరు కలిసి ఆదివారం రాత్రి ఓ బస్సులో వెళుతున్నారు. ఆ సమయంలో అదే బస్సులో ఉన్న కొందరు యువకులు అమ్మాయిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడి బాయ్ ఫ్రెండ్‌ను కొట్టి బస్సులో నుండి కిందకు తోసేశారు. యువతి పైనా అత్యాచారం చేసి ఆమెను కూడా బస్సులో నుండి కిందకు తోసేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం... అమ్మాయి, ఆమె బాయ్ ఫ్రెండ్ ఇద్దరు మునిర్కా నుండి ద్వారక వెళ్లేందుకు రాత్రి బస్సు ఎక్కారు. బస్సు మహిపాల్పుర్ చేరుకున్న సమయంలో సామూహిక అత్యాచార సంఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత వారిద్దరిని బస్సులో నుండి తోసేశారు. అమ్మాయిని సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని బాధితురాలు స్నేహితులు చెప్పారు. ఈ ఘటన వసంత్ విహార్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

No comments:

Post a Comment